Telangana: తెలంగాణలో రేవంత్ సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్లలోనే విద్యుత్ శాఖతో ప్రక్షాళన మొదలుపెట్టిన సీఎం రేవంత్ రెడ్డి.. ఆ తర్వాత పోలీస్ శాఖపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇందులో భాగంగానే ఇప్పటికే పలువురు పోలీసు అధికారులపై ప్రభుత్వం బదిలీ వేటు వేయగా.. తాజాగా హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్‌లో ఒకేసారి 16 మంది సీసీఎస్ సిబ్బందిపై బదిలీ వేటు వేసింది. ఈ మేరకు 12 మంది సీఐలు, నలుగురు ఎస్సైలను బదిలీ చేస్తూ.. కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి ఉత్వర్తులు జారీ చేశారు. వీరందరినీ తక్షణమే మల్జీజోన్- 2కు రిపోర్టు చేయాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.
ఇప్పటికే అవినీతి ఆరోపణలతో ACP ఉమామహేశ్వరరావు, CI సుధాకర్‌ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కాగా గతంలో పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో సిబ్బంది మెుత్తాన్ని ఒకేసారి మార్చేశారు. హోంగార్డు స్థాయి నుంచి సీఐ వరకు మొత్తంగా 86 మంది సిబ్బందిని బదిలీ చేశారు. అక్కడ విధులు నిర్వర్తించిన సిబ్బందిని వీఆర్‌కు అటాచ్ చేస్తూ తీసుకున్న నిర్ణయం సంచలనం సృష్టించింది. హైదరాబాద్ కమిషనరేట్ చరిత్రలో ఇలా స్టేషన్ సిబ్బంది మెుత్తాన్ని ఒకేసారి బదిలీ చేయం అదే మొదటిసారి.