ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి హైదరాబాద్ నగరమంతా తడిసిముద్దయ్యింది. ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురుస్తుండగా.. నగరాన్ని నల్లటి ధట్టమైన మేఘాలు కమ్మేశాయి. నాచారం, మల్లాపూర్, ముషీరాబాద్, కొండాపూర్, మాదాపూర్, గచ్చిబౌలి, నారాయణగూడ, హిమాయత్‌నగర్, యూసుఫ్‌గూడ, కుత్బుల్లాపూర్, తిరుమలగిరి, అల్వాల్, బోయినపల్లి, జవహర్‌నగర్, బేగంపేట, బొల్లారం, మారేడ్‌పల్లి, చిలుకలగూడ, తార్నాక, ఓయూ, లాలాపేట, హబ్సీగూడ, మెహిదీపట్నం, ఆసిఫ్‌నగర్, చైతన్యపురి, గుడి మల్కాపూర్, నాంపల్లి, మలక్‌పేట, దిల్‌సుఖ్‌నగర్, ఖైరతాబాద్, పంజాగుట్ట, లక్డీకపూల్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, రామంతాపూర్, బోడుప్పల్, పీర్జాదిగూడ, సుల్తాన్‌బజార్, బేగంబజార్, బషీర్‌బాగ్‌తో పాటు పలు ప్రాంతాల్లో భారీ వాన కురుస్తుంది. కూకట్‌పల్లి, కాచిగూడ, విద్యానగర్, అంబర్‌పేట, ఉప్పల్, ఘట్కేసర్, రాజేంద్రనగర్, గండిపేట, కోఠి, అబిడ్స్‌తో పాటు పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది. వర్షం కారణంగా.. ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రోడ్లపై వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.
నగరవ్యాప్తంగా కురుస్తున్న వర్షం..
చార్మినార్ లో అత్యధికంగా 4.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. లింగోజిగూడలో 4.4 సెంటీమీటర్లు, మలక్ పేట్, మియాపూర్ లో 4.2 సెంటీమీటర్లు, ఖైరతాబాద్, సనత్ నగర్ లో 4.1 సెంటీమీటర్లు, అంబర్పేట్, లంగర్ హౌస్, సికింద్రాబాద్ లో 3.9 సెంటీమీటర్లు, బంజారాహిల్స్, గోషామహల్ విజయనగర్ కాలనీ హిమాయత్ నగర్ లో 3.5 సెంటీమీటర్లు, ఫిలింనగర్, సరూర్ నగర్ లో 3.3 సెంటీమీటర్లు, బోరబండ, యూసుఫ్‌గూడా, 3.1 సెంటీమీటర్లు, రాజేంద్రనగర్, చిలకలగూడ, షేక్‌పేట్‌లో 2.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది. గడిచిన గంటసేపట్లో జీహెచ్ ఎంసీ కంట్రోల్ రూమ్‌కి 250 కి పైగా ఫిర్యాదులు వచ్చాయి. చాలా ప్రాంతాల్లో వర్షపునీరు రోడ్లపై నిలిచింది. సాయంత్రం నుంచి కురుస్తున్న వర్షానికి ముసారాంబాగ్ బ్రిడ్జ్ నీట మునిగింది.రాకపోకలను పోలీసులు నిలిపివేశారు. వర్షాల కారణంగా.. విద్యాశాఖ రేపు ఒక్క రోజు పాఠశాలలకు సెలవు ప్రకటించే ఛాన్స్ ఉంది.
టోల్‌ఫ్రీ నెంబర్ల ఏర్పాటు
మరో వైపు ట్రాఫిక్ తీవ్ర అంతరాయం కలుగుతున్నది. హైదరాబాద్ –విజయవాడ రహదారిపై రాకపోకలు స్తంభించాయి. అబ్దుల్లాపూర్‌మెట్ నుంచి హైదరాబాద్ వైపు రాకపోకలు నిలిచాయి. వర్షంధాటికి దారి కనిపించకపోవడంతో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. భారీ వర్షంతో డీఆర్‌ఎఫ్ బృందాలు అప్రమత్తమయ్యాయి. ఈ సందర్భంగా టోల్‌ఫ్రీ నెంబర్లను ఏర్పాటు చేసింది. అవసరముంటే 040-21111111, 9000113667 నంబర్లలో సంప్రదించాలని డీఆర్‌ఎఫ్ సూచించింది. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇండ్ల నుంచి రావ్దొదని కోరింది.