Telangana Budget 2024: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ ను ఆర్ధిక మంత్రి భట్టి విక్రమార్క ఈరోజు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. మొత్తం రెండు లక్షల 91వేల 191 కోట్ల రూపాయలతో రాష్ట్ర బడ్జెట్ ను తీసుకువచ్చారు. ఇందులో రూ.2.20,945 కోట్లు రెవెన్యూ వ్యయంగానూ, రూ.33,487 కోట్లు మూలధన వ్యయంగానూ చూపించారు. బడ్జెట్ లో సంక్షేమానికి పెద్ద పీట వేసినట్టు చెప్పిన భట్టి విక్రమార్క పలు సంక్షేమ పథకాలకు భారీగా నిధులు కేటాయించినట్టు ప్రకటించారు.
Telangana Budget 2024: బీసీ సంక్షేమం కోసం రూ. 9,200 కోట్లు కేటాయించారు. అలాగే రూ. 17,056 కోట్లు ఎస్టీ సంక్షేమానికి, రూ. 3,003 కోట్లు మైనార్టీ సంక్షేమం కోసం, రూ. 2,736 కోట్లు స్త్రీ, శిశు సంక్షేమానికి దీంతో పాటు ఎస్సీ సంక్షేమం కోసం రూ. 33124 కోట్లు బడ్జెట్ లో ప్రతిపాదించారు. ఇక కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టో హామీ అయిన గృహ జ్యోతి పథకానికి రూ.2418 కోట్లు కేటాయించినట్టు భట్టి విక్రమార్క ప్రకటించారు. అంతేకాకుండా మరో మ్యానిఫెస్టో హామీ అయిన 500 రూపాయల గ్యాస్ సిలిండర్ పథకం కోసం రూ.723 కోట్ల నిధులను బడ్జెట్ లో ప్రకటించారు.
Telangana Budget 2024: ఇక తన బడ్జెట్ ప్రసంగ సందర్భంగా గత ప్రభుత్వంపై విరుచుకు పడ్డారు మంత్రి భట్టి విక్రమార్క. భారీ స్థాయిలో అప్పులు చేశారని చెప్పారు. బీఆర్ఎస్ సభ్యుల అభ్యంతరాల మధ్య బడ్జెట్ ప్రసంగంలో బీఆర్ఎస్ పాలనపై పలు అంశాలను వివరిస్తూ భట్టి విక్రమార్క ప్రసంగం సాగింది. తెలంగాణ ప్రజలు గత అస్తవ్యస్త పాలనకు చరమగీతం పాడారాని చెప్పిన మంత్రి అప్పులు పది రెట్లు పెరిగాయన్నారు. అంతేకాకుండా బంగారు తెలంగాణ తెస్తామని ఉత్తరకుమార ప్రగల్భణాలు పలికి.. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి పదేళ్లయినా ఉద్యోగాలు.. నీళ్లు ప్రజలకు దక్కే పరిస్థితి లేకుండా చేశారని ధ్వజమెత్తారు. గత ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ విఫలం అయిందని చెప్పిన మంత్రి భట్టి విక్రమార్క దూబరా ఖర్చులను నిలిపేసి.. ఆర్ధిక క్రమశిక్షణ తమ ప్రభుత్వం పాటిస్తోందని చెప్పారు. తెలంగాణ ఏర్పడిన పదేళ్ల తరువాత మొదటిసారిగా తాము వాస్తవిక బడ్జెట్ తీసుకువచ్చామని మంత్రి వివరించారు.