School Holiday: హైదరాబాద్ నగరంపై వరుణుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. గత 24 గంటలుగా నగరంలో ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. పలు ప్రాంతాల్లో వర్షానికి ఇల్లులు నీటమునిగాయి. రోడ్లు కొట్టుకుపోయాయి. ఇదిలా ఉంటే భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్ లోని పలు విద్యాసంస్థలు సెలవు ప్రకటించాయి. భారీ వర్షాల నేపథ్యంలో ఈరోజు స్కూల్ కు సెలవు ప్రకటిస్తున్నట్లు విద్యార్థులు తల్లిదండ్రులకు ఉదయం నుంచి మెసేజ్ లు పంపుతున్నాయి. కాగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని ప్రైవేట్ పాఠశాలలకే ఈ మెసేజ్ వచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు హైదరాబాద్ కు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
కొట్టుకుపోయిన కార్లు...
నగరంలో మంగళవారం తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేకుండా పడుతున్న వర్షంతో ప్రధాన మార్గాలు, కాలనీలు అన్ని కూడా జలమయం అయ్యాయి. ఎల్బీనగర్, నాగోల్, అల్కాపురి, దిల్ సుఖ్ నగర్, కొత్తపేట, సరూర్ నగర్ ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది. ఖైరతాబాద్, నాంపల్లి, బషీర్‌బాగ్, హిమాయత్ నగర్, అబిడ్స్, అమీర్‌పేట, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, గాజులరామారం, జగద్గిరిగుట్ట, బహదూర్‌పల్లి, సురారం, సుచిత్ర, గుండ్ల పోచంపల్లి, పేట్ బషీరాబాద్, జీడిమెట్లలో కుండపోతు పడుతుంది.
వనస్థలిపురం, బీఎన్‌రెడ్డి నగర్, హయత్ నగర్, పెద్ద అంబర్ పేట, అబ్దుల్లాపూర్ మెట్ ప్రాంతాల్లో రహదారులు చెరువుల్లా మారాయి. కొన్ని ప్రాంతాల్లో మోకాలిలోతు నీరు చేరింది.గంగపుత్ర కాలనీల్లోకి భారీగా వరద నీరు చేరింది. వర్షపు నీటిలో గుర్తు తెలియని వ్యక్తి కొట్టుకుపోయినట్లుగా స్థానికులు చెబుతున్నారు. కొన్ని చోట్ల కార్లు కొట్టుకుపోయాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో అప్రమత్తంగా ఉండాలని జీహెచ్‌ఎంసీ అధికారులు తెలిపారు. అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని సూచించారు. మరో వైపు వాతావరణశాఖ అధికారులు నగరానికి ఎల్లో అలర్డ్ జారీ చేశారు. నగరంలో మరో రెండు గంటల పాటు భారీ వర్షం కురిసే అవకాశమున్నట్లు తెలిపారు.