Hi Nanna Movie Review: ఎమోషనల్ లవ్ డ్రామా ‘హాయ్.. నాన్న’ సినిమా ఎలా ఉంది అంటే.. 

నేచురల్ స్టార్ నాని తాజా సినిమా హాయ్.. నాని ఈరోజు థియేటర్లలో విడుదలైంది. ఎమోషనల్ లవ్ డ్రామా గా తెరకెక్కిన ఈ సినిమా కుటుంబ ప్రేక్షకులు కోరుకునే సినిమాగా మంచి మార్కులు సాధించింది. హాయ్.. నాన్న సినిమా పూర్తి రివ్యూ హెడింగ్ పై క్లిక్ చేసి తెలుసుకోండి. 

Hi Nanna Movie Review: ఎమోషనల్ లవ్ డ్రామా ‘హాయ్.. నాన్న’ సినిమా ఎలా ఉంది అంటే.. 
New Update

Hi Nanna Movie Review: కొద్దిసేపు ఈ మెషిన్ గన్స్.. చేజింగ్స్.. దెయ్యాలు.. అన్నిటినీ పక్కన పెట్టేద్దాం. డజన్ల కొద్దీ ఫైట్స్.. డాన్స్ బీట్స్.. మర్చిపోదాం. కితకితలు పెట్టుకుని నవ్వుకోవడం.. ఎందుకొచ్చిన బాధరా బాబు అని ఏడ్చుకోవడం వదిలేద్దాం.  ఒక్కసారి ‘హాయ్.. నాన్న’ ని పలకరిద్దాం. ఏంటిది అనుకోకండి.. చక్కని సినిమా.. వెకిలితనం లేని హాస్యం.. పిచ్చి తనం లేని రొమాన్స్.. అన్నిటినీ మించి మంచి ప్రేమను పంచే సినిమా చూడాలంటే.. ‘హాయ్.. నాన్న’ చూడాల్సిందే. 

ప్రేమంటే ఏమిటి? ఎవరినైనా ప్రశ్నించి చూడండి ఏం  చెబుతారు? వాళ్ళు చెప్పేది వాళ్ళకే అర్ధం కాని విధంగా ఉంటుంది. ప్రేమకు సరైన నిర్వచనం ఇవ్వడం ఎవరి వల్ల కాదు.. కాలేదు. ఎవరికి తోచినట్టు వారు ప్రేమ గురించి చెబుతారు. కానీ, హాయ్..నాన్నలో కనిపించే ప్రేమ చూసితీరాల్సిందే. ప్రేయసితో ఉండే ప్రేమ.. భార్యకి పంచే ప్రేమ.. బిడ్డ పై చూపించే ప్రేమ.. దేనికి అదే సంబంధం లేనివి కదా. ఈ మూడింటిని ఒక కథలో ముడివేస్తే.. దానిలో పుట్టే ఎమోషనల్ డ్రామా.. ‘హాయ్.. నాన్న’. 

Hi Nanna Movie Review: లవ్ ఎట్ ఫస్ట్ సైట్ మీద నమ్మకం లేని ప్రేమ రాహిత్యంలో ఉన్న యువతి.. మొదటి చూపులోనే నిన్ను పేమించాను అని చెప్పిన యువకుడు.. వారి మధ్య సంఘటనలు.. ఇద్దరి పెళ్లి తరువాత జీవితం.. తరువాత బిడ్డ..  ఇద్దరి మధ్య ఎడబాటు.. తిరిగి అందరూ ఎలా కలిశారు? ఇంతే కథ. చాలా సినిమాల్లో చూసిన కథే.. చాలా మంది దర్శకులు చెప్పిన కథే. కానీ.. శౌర్యువ్ కథనం మనల్ని కట్టి పడేస్తుంది. ప్రేమ లోతును వెండితెరపై మూడు పాత్రల మధ్య సంఘర్షణతో నడిపించిన తీరు మనలో ఎక్కడో ఉండిపోయిన భావోద్వేగాల్ని తట్టి లేపుతుంది. సినిమా కథ గురించి చెప్పుకోవడం కన్నా.. సినిమా లోని ఫీల్ గురించి చెప్పుకోవాలంటే చాలా ఉంది. ఒక చిన్నారికి తన తండ్రి చెప్పే కథలో ఎప్పుడూ అమ్మ ఉండదు. అమ్మ ఎందుకు లేదు అని అడిగే ఆ పాపకు నాన్న సమాధానం చెప్పలేడు. చెప్పాల్సిన సమయం వచ్చేసరికి అనుకోని సంఘటనలు ఎదురయ్యి.. ఎందుకోసం అయితే, పాపకు అమ్మ గురించి తెలియకూడదు అనుకున్నాడో అదే సమస్యగా ఎదురయితే.. చివరికి ఏమవుతుంది? ముందే చెప్పినట్టు.. నాన్న ప్రేమ.. యువతీయువకుల ప్రేమకథలు చాలా వచ్చాయి.. కానీ, హాయ్.. నాన్న సినిమాలో వచ్చే మలుపులు మనల్ని సినిమాకి కట్టిపడేస్తాయి. 

Hi Nanna Movie Review: ఇక నాని గురించి ప్రత్యేకంగా చెప్పేదేం ఉంటుంది? కొత్తదనం అంటేనే నాని. తన పాత్రకు ప్రాణం పోసాడు వంటి రొటీన్ గా కాకుండా చెప్పాలంటే.. ప్రతి నాన్న.. తనని నానిలో చూసుకుంటాడు అని చెపితే కరెక్ట్ గా ఉంటుంది. ప్రతి ఎమోషన్.. ప్రతి సీన్.. ప్రతి డైలాగ్ నాని పెర్ఫెక్షన్ కి సాక్ష్యంగా నిలుస్తాయి. నానితో పోటీ పడే నటిని నేనున్నాను అన్నట్టుగా మృణాల్ ఠాకూర్ మరో పక్క జీవిస్తుంటే.. వారిద్దరి మధ్య వచ్చిన సన్నివేశాలన్నీ ప్రేక్షకులను కళ్ళుతిప్పుకోనివ్వవు. ఇక చిన్నారి బేబీ కియారా సరిగ్గా వారిద్దరితోనూ సింక్ అయిపొయింది. ముద్దుగా కనిపిస్తూనే.. అందరికీ కన్నీళ్లను తెప్పించింది. ఇక ప్రియదర్శి, జయరాం కూడా మంచి నటనతో సినిమాకి సపోర్ట్ అయ్యారు. 

Also Read: వామ్మో.. హాయ్ నాన్న ఓటీటీ రైట్స్ అన్ని కోట్లా?

టెక్నీకల్ గా సినిమా ఫొటోగ్రఫీ అందించిన సాను వర్గీస్ కళ్ళు తిప్పుకోనీయని అందాలు చూపించాడు. ప్రతి షాట్ లోనూ కెమెరా గొప్పతనం కనబడింది. సినిమాలో ఒక సన్నివేశంలో నాని.. మృణాల్ పడుకుని ఉంటారు.. అక్కడకు పాప వస్తుంది.. ఆమె వారి మధ్యలో పడుకుంటుంది. ఈ సీన్ లో షాట్ నిజంగా మన మైండ్ లో రిజిస్టర్ అయిపోయేలా ఉంటుంది. చాలాసేపు గుర్తుండిపోతుంది. ఇక సంగీతం విషయానికి వస్తే హషీమ్‌ అబ్దుల్‌ వాహబ్‌ నేపధ్య సంగీతంతో మేజిక్ చేశాడు. పాటలు అన్నీ సిట్యుయేషనల్ గా బావున్నాయి. అలాగే ప్రవీణ్ ఎడిటింగ్ కూడా సినిమాకి ప్లస్ అయింది. 

ఇక సినిమా హైలైట్స్ చెప్పుకోవాలంటే..(Hai Nanna review in Telugu)  నానికి.. కూతురుకు మధ్య ఒక సన్నివేశంలో.. ‘’అప్పుడు అమ్మకోసం పరిగెత్తావు.. ఇప్పుడు ఈమె కోసం పరిగెత్తావు.. కానీ.. నాన్న కోసం ఆగాలని అనిపించలేదా? నాన్న చూపించే ప్రేమ సరిపోలేదా తల్లీ’’ అంటూ నాని చెప్పే డైలాగ్ గుండెల్ని పిండేస్తుంది. మృణాల్ ఠాగూర్ తో చిన్నారి ‘నువ్వు నా నిజం అమ్మవు కాదుగా’ అని చెప్పిన డైలాగ్.. ఇలా చెప్పుకుంటూ పొతే సినిమాలో ప్రతి డైలాగ్.. సన్నివేశం అన్నీ ఎమోషన్ ను పండించేవే. ఈ సినిమాని ఫస్ట్ హాఫ్.. సెకెండ్ హాఫ్ అని విడదీసి చెప్పుకోవడం కరెక్ట్ కాదు. సినిమా అంతా చక్కని భావోద్వేగాలను చూపిస్తూనే.. ఎక్కడా ఇబ్బందికర సన్నివేశాలు లేకుండా నడిపించడంలో దర్శకుడు ప్రతిభ చూపించాడు. 

మొత్తంగా చెప్పాలంటే Hi Nanna Review in Telugu చాలాకాలం తరువాత ఫ్యామిలీ ఆడియన్స్ కోసం వచ్చిన మంచి ఎమోషనల్ డ్రామా హాయ్..నాన్న. కుటుంబం అంతా కలిసి చూడదగ్గ మంచి సినిమా. అలానే, హాయ్.. నాన్న నిన్ను నువ్వు నమ్మితే.. ఆ నమ్మకం నిన్ను గెలిపిస్తుంది అని చెబుతుంది. 

చివరగా ఒక్కమాటలో చెప్పాలంటే ప్రేమను చూపించే హాయ్..నాన్న. 

Watch this interesting Video:

#mrunal-thakur #nani #hai-nanna
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe