Anjali Birthday: టాలీవుడ్ వాకిట్లో అచ్చ తెలుగు నటనాంజలి.. అంజలి జర్నీఇదే!

టాలీవుడ్ లో తెలుగు హీరోయిన్స్ కి ఛాన్సే  లేదా అనుకుంటున్నపుడు రాజోలు నుండి వచ్చింది అంజలి. అవార్డులు.. రివార్డులు.. ప్రేక్షకుల అభిమానం సొంతం చేసుకుని తనదైన రూట్ లో వెళుతోంది. ఈ రోజు (జూన్ 16) ఆ తెలుగింటి ముద్దుగుమ్మ పుట్టిన రోజు. 

Anjali Birthday: టాలీవుడ్ వాకిట్లో అచ్చ తెలుగు నటనాంజలి.. అంజలి జర్నీఇదే!
New Update

Anjali Birthday: మన టాలీవుడ్ హాలీవుడ్ రేంజ్ కి ఎదిగినా.. మన తెలుగు రాష్ట్రాల నుంచి హీరోయిన్స్ మాత్రం ఆరేంజ్ లో ఇండస్ట్రీలో నిలదొక్కుకోలేదనే చెప్పాలి. ఇంకా చెప్పాలంటే అలాంటి అవకాశాలు ఇవ్వలేదనే చెప్పుకోవచ్చు. జయప్రద, జయసుధ, శ్రీదేవి వంటి తెలుగు హీరోయిన్స్ వరుసగా టాలీవుడ్ లో దశాబ్దాల పాటు స్టార్ హీరోయిన్స్ గా వెలిగారు. జయప్రద, శ్రీదేవి అయితే.. బాలీవుడ్ లో కూడా తమ ముద్ర వేశారు. ఒక దశలో వారిద్దరిదే బాలీవుడ్ లోనూ హవా. వరుస హిట్స్ తో అప్పట్లోనే పాన్ ఇండియా హీరోయిన్స్ గా రికార్డ్ సృష్టించారు. ఇక ఆ తరువాత అచ్చ తెలుగు హీరోయిన్స్ మన సినిమాల్లో కనిపించడం తగ్గిపోయిందని చెప్పాలి. కానీ, అడపా దడపా కొంతమంది మన సినిమాల్లో మెరుస్తూ వస్తున్నారు. ఒకటి రెండు సినిమాలతో తట్టా.. బుట్టా సర్దేస్తున్నారు. కారణాలు ఏమైనా కానీ, తెలుగు అమ్మాయిలు తెలుగు సినిమాల్లో హీరోయిన్లుగా కంటిన్యూగా నిలబడటం తగ్గిపోయింది. దాదాపుగా లేదు. కానీ, మన రాజోలు పిల్ల మాత్రం సపరేట్ రూటులో ప్రత్యేకతను నిలబెట్టుకుంటూ తెలుగు ఇండస్ట్రీలో అచ్చ తెలుగు హీరోయిన్ గా దశాబ్ద కాలానికి పైగానే తన ప్రత్యేకతను నిలబెట్టుకుంటూనే ఉంది. 

publive-image

Anjali Birthday: "ఏమో.. నాకన్నీ అలా తెలిసిపోతూ ఉంటాయంతే.." ఈ డైలాగ్ వింటే.. వెంటనే గుర్తొచ్చేపేరు.. అవును.. అంజలి. అచ్చ తెలుగు అమ్మాయి. తెలుగుతనం తెరమీద పంచుతున్న కథానాయకి. ఈ అంజలి పుట్టిన రోజు ఈరోజు. ఈ సందర్భంగా అంజలి గురించి నాలుగు ముక్కలు చెప్పేసుకుందాం. సహజమైన నటన అంజలి సొంతం. కామెడీ, సీరియస్, ఎమోషనల్, యాక్షన్ ఇలా జోనర్ తో పనిలేదు. క్యారెక్టర్ ఏదైనా సరే ఒదిగిపోయి.. క్యారెక్టర్ తప్ప తాను కనిపించకుండా నటించే సత్తా ఉన్న నటి అంజలి. 

సినిమా జర్నీ..

అంజలి ఆంధ్రప్రదేశ్‌ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజోలులో 1986 జూన్ 16న పుట్టింది. బాల త్రిపుర సుందరి అసలు పేరు. పదో తరగతి వరకూ రాజోలులోనే చదివిన అంజలి తండ్రి ఉద్యోగరీత్యా చెన్నై వెళ్లడంతో డిగ్రీ అక్కడ చదువుకుంది. ఆ సమయంలోనే చాలా షార్ట్ ఫిలిమ్స్ లో చేసింది. హీరోయిన్ అవ్వాలనేది ఆమె కల. దానికి ఆమె షార్ట్ ఫిలిమ్స్ మంచి సపోర్ట్ చేశాయి. దీంతో ఆమె చెన్నైలో నిర్మాతలు దృష్టిలో పడింది. హీరోయిన్ ఛాన్స్ వెతుక్కుంటూ వచ్చింది. హీరో జీవాతో "కాట్రాదు తమిళ్" అనే తమిళ సినిమా(ఇదే సినిమా తరువాత డేర్ పేరుతొ తెలుగులో డబ్ అయింది)తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది అంజలి. ఆ తరువాత 2006లో ఫోటో అనే సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. వెంటనే ప్రేమలేఖ రాశా అనే సినిమా కూడ చేసింది. కానీ, ఈ రెండు సినిమాలు అంజలికి బ్రేక్ ఇవ్వలేదు.

publive-image

సరిగ్గా ఇదే సమయంలో కోలీవుడ్ లో ఆమె చేసిన ఒక సినిమా షాపింగ్ మాల్ తెలుగులోకి డబ్ అయింది. ఆ సినిమాలో అంజలి నటనకు తెలుగునాట మంచి పేరు వచ్చింది. ప్రేక్షకులను ఆ సినిమాతో ఆకట్టుకుంది. ఈ సినిమాలో ఆమెను చూసిన మురుగదాస్ తన సినిమా జర్నీ లో హీరోయిన్ గా తీసుకున్నారు. ఆ సినిమా సూపర్ హిట్. ఆ తరువాత తెలుగులో వెంకటేష్ సరసన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో ఛాన్స్ దొరికింది. ఆ సినిమాలో అచ్చ తెలుగు అమ్మాయిగా అందరినీ ఆకట్టుకుని తెలుగులో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఆ తరువాత రవితేజ తో బలుపు సినిమాలో ఎమోషనల్ యాక్టింగ్ తో అదరగొట్టి.. మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకుంది. తరువాత గీతాంజలి అనే హారర్ థ్రిల్లర్ లో డబుల్ యాక్షన్ చేసింది. అది కూడా సూపర్ హిట్. అంతేకాదు, ఈ సినిమాకి నంది అవార్డు కూడా అందుకుంది అంజలి. 

సెకండ్ ఇన్నింగ్స్..

ఆ తరువాత ఆమె వివాదాల్లో చిక్కుకుంది. కిడ్నాప్ అయిందనే వార్తలు వచ్చాయి. చాలా రోజులు ఆమె సినిమాల్లో కనిపించలేదు. కొన్నాళ్ల తరువాత మళ్ళీ పవన్ కళ్యాణ్ తో వకీల్ సాబ్ సినిమాలో ఓ కీలక పాత్రలో మెరిసింది. ఇప్పుడు తాజాగా గీతాంజలి 2, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు మళ్ళీ అంజలి మార్కును చూపిస్తోంది. ఇప్పుడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ సరసన గేమ్ చెంజర్ సినిమాలో కనిపించబోతోంది. ఈ సెకండ్ ఇన్నింగ్స్ మొదటి ఇన్నింగ్స్ కంటే కూడా మంచి ఛాన్స్ లు తీసుకు వస్తొందని చెప్పవచ్చు. 

publive-image

ప్రతిభ ఆమె సొంతం.. అందుకే అవార్డులకూ ఆమె అంటే ఇష్టం..

అవును అంజలి ఏ రకమైన పాత్రనైనా.. ఎటువంటి భావాన్ని అయినా చక్కగా పలికించగలదు. అందుకే అవార్డులు ఆమెకు చాలానే వచ్చాయి. మొదటి సినిమాకే ఎన్నో ప్రశంసలు పొందిన అంజలి.. ఉత్తమ డెబ్యూ ఆ నటిగా ఫిలిం ఫేర్ అవార్డ్ అందుకుంది. ఆ తరువాత అంగడి తెరు అనే తమిళ సినిమాకి కూడా ఫిలిం ఫేర్ అవార్డు దక్కింది. ఇక తెలుగులో రెండు నంది అవార్డులు అందుకుంది. ఒకటి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు.. రెండు గీతాంజలి. ఈ అవార్డులు చాలు అంజలి ప్రతిభ ఎలాంటిదో చెప్పడానికి. 

publive-image

సినిమా ఇండస్ట్రీలో వివాదాలు మామూలే. అందులోనూ హీరోయిన్స్ కి వివాదాలు నీడలానే ఉంటాయి. అంజలి కూడా అలా ఎదో వివాదంలో చిక్కింది. ఇప్పుడు బయటపడింది. మళ్ళీ తెలుగు సినిమాల్లో తన మార్క్ తో అదరగొట్టేస్తోంది. అంతేకాకుండా.. చాలా వెబ్ సిరీస్ లలో కూడా అంజలి నటించింది. ఆమె నటించిన వెబ్ సిరీస్ లు కూడా చాలా సక్సెస్ సాధించాయి. అటు వెండితెరపై.. ఇటు బుల్లితెరపై అంజలి ప్రయాణం సాఫీగా సాగిపోవాలనీ.. మరిన్ని విజయాలు సాధించాలని.. తెలుగులో హీరోయిన్ అవ్వాలని అనుకునేవారికి స్ఫూర్తిగా నిలవాలని కోరుకుంటూ హ్యాపీ బర్త్ డే అంజలి! 

#anjali #tollywood
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe