రానున్న 24 గంటల్లో భారీ తుపాను.. నెల్లూరు-మచిలీపట్నం మధ్య తీరం దాటే ఛాన్స్!

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం భారీ తుపానుగా మారింది. దీంతో రానున్న 24 గంటల్లో నెల్లూరు - కృష్ణా జిల్లా మచిలీపట్నానికి సమీపంలో తీరాన్ని దాటే అవకాశం ఉందని, 100 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు విస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

New Update
రానున్న 24 గంటల్లో భారీ తుపాను.. నెల్లూరు-మచిలీపట్నం మధ్య తీరం దాటే ఛాన్స్!

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కొన్నిగంటల్లోనే తీవ్రరూపం దాల్చి 'మిచాంగ్‌' తుపానుగా మారింది. దీంతో కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. అంతేకాదు తుపాను తీరం దాటే సమయంలో గంటకు దాదాపు వంద కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని, ఈ తుపాను రానున్న 24 గంటల్లో నెల్లూరు - కృష్ణా జిల్లా మచిలీపట్నానికి సమీపంలో తీరాన్ని దాటే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది.

అయితే ఈ తుపాను ప్రభావంతో ఇప్పటికే నెల్లూరు జిల్లాలో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తుండగా ఐఎండీ రెడ్ అలర్ట్ ప్రకటించింది. భారీ వర్షాల కారణంగా నెల్లూరు కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేయడంతో పాటు, లోతట్టు ప్రాంతాలవారిని అప్రమత్తం చేశారు. ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం.. ఆదివారానికి తుపానుగా బలపడనుంది. ఇది 5వ తేదీ మంగళవారం ఉదయం నెల్లూరు-మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉంది. తుపాను తీరం దాటే సమయంలో గంటకు 80-100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది.

అలాగే ఈ తుపాను సోమవారం ఉదయానికి దక్షిణ ఆంధ్రప్రదేశ్‌, ఉత్తర తమిళనాడు తీరానికి చేరుతుందని సంచాలకులు స్టెల్లా తెలిపారు. అనంతరం ఇది దక్షిణ ఆంధ్రప్రదేశ్‌ తీరానికి సమాంతరంగా వస్తుందని, మంగళవారం ఉదయం నెల్లూరు-మచిలీపట్నం మధ్య తీరం దాటుతుందని పేర్కొన్నారు. తుపాను హెచ్చరికల నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని, రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ అంబేడ్కర్‌ కోరారు. తీరగ్రామాల ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారుల్ని సీఎం జగన్‌ ఆదేశించారు. తుపాను పరిస్థితిపై శనివారం సాయంత్రం ఆయన అధికారుల నుంచి వివరాలు తీసుకున్నారు. 'సహాయ పునరావాస కార్యక్రమాల అమలుకు కలెక్టర్లు సర్వసన్నద్ధంగా ఉండాలి. విద్యుత్తు, రవాణా వ్యవస్థలకు అంతరాయం ఏర్పడితే.. పునరుద్ధరణకు వెంటనే చర్యలు తీసుకోవాలి. అవసరమైన చోట సహాయశిబిరాలు ఏర్పాటుచేసుకోవాలి. రక్షిత తాగునీరు, ఆహారం, పాలు అందుబాటులో ఉంచాలి' అని సూచించారు.

Also read :అత్తపై అత్యాచారం కేసు పెట్టిన కోడలు.. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే!

సీఎం ఆదేశాల మేరకు తిరుపతి జిల్లాకు రూ.2కోట్లు, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, కృష్ణా, పశ్చిమగోదావరి, అంబేడ్కర్‌ కోనసీమ, కాకినాడ జిల్లాలకు రూ.కోటి చొప్పున నిధుల్ని విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. ఇక శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, అంబేడ్కర్‌ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, నెల్లూరు, తిరుపతిలో భారీవర్షాలు కురియనుండగా.. అల్లూరి సీతారామరాజు, ఏలూరు, ఎన్టీఆర్‌, గుంటూరు, బాపట్ల, పల్నాడు ప్రాంతాల్లో ఓ మోస్తరు వానలు కురుస్తాయని తెలిపారు.

ఇక ఈ తుపాన్ ఎఫెక్ట్ తో రేణిగుంట విమానాశ్రయం నుంచి శనివారం పలు విమానాలు రద్దు కాగా.. మరికొన్ని ఆలస్యమయ్యాయి. అలాగే తొలి జాబితాలో 142 రైళ్లు, రెండో జాబితాలో మరో 10 రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణమధ్య రైల్వే తెలిపింది. అలాగే ఈ తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యేక రైళ్లను మూడు రోజులపాటు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.

Advertisment
తాజా కథనాలు