మొదటి ప్రమాద హెచ్చరిక
భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో కొద్ది రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వాగులు వంకలు పొంగిపొర్లుతూ ప్రాజెక్టులు నిండుకుండలను తలపిస్తున్నాయి. ప్రాజెక్టుల సామర్థ్యానికి మించి వరద నీరు వచ్చి చేరుతుండడంతో గేట్ల ద్వారా నీటిని దిగువకు వదులుతున్నారు. దీంతో పాటు ఎగువ నుంచి భారీ ఎత్తున వరద నీరు వచ్చి చేరుతుండడంతో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తూ ప్రమాదస్థాయికి చేరుకుంటుంది. ఈ క్రమంలో భద్రాచలం దగ్గర మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 43అడుగులు దాటడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
ఇది రేపు తెల్లవారుజాము నాటికి 48 అడుగులకు చేరే అవకాశముంది. అప్పుడు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేయాల్సి ఉంటుంది. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ముంపు ప్రాంతాల్లోకి వరద నీరు చేరకముందే సురక్షిత ప్రాంతాలకు లేదా పునరావాస క్రేంద్రాలకు తరలివెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు. సహాయం కోసం అన్ని తహసిల్దార్ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసినట్లు సహాయం కోరిన వారు కంట్రోల్ రూమ్ నెంబర్లకు ఫోన్ చేసి సమాచారం అందించాలని జిల్లా కలెక్టర్ ప్రజలను కోరారు. భద్రాచలంలో 43 అడుగులకు మొదటి ప్రమాద హెచ్చరిక, 48 అడుగులకు రెండో ప్రమాద హెచ్చరిక, 53 అడుగులకు మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు అధికారులు. అయితే ప్రస్తుతం మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది.
నిలిచిపోయిన రాకపోకలు
జగిత్యాల జిల్లాలో చెరువులు, వాగులు వంకలు పొంగిపోర్లుతున్నాయి. భారీగా వరదనీరు రహదారులపై వచ్చి రాకపోకలన్నీ నిలిచిపోయాయి. జిల్లాలో రాత్రి కురిసిన వర్షాలతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. జగిత్యాల గ్రామీణ మండలం జాతీయ రహదారి వంతెనపై నుంచి నీరు ప్రవహిస్తోంది. దీంతో జగిత్యాల ధర్మపురి, మంచిర్యాల వైపు వెళ్లే రాకపోకలు నిలిచిపోయాయి.
భారీ వర్షాలు
రాష్ట్రంలో అనేక జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని అధికారులు చెప్పారు. ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, యదాద్రి భువనగిరి జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొమరంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్, ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో కొన్ని చోట్ల కూడా వర్షం కురిసే అవకాశం ఉంది. రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
రెడ్ అలెర్ట్ జారీ
నిన్నటి నుంచి తీవ్ర అల్పపీడనం ఏర్పిడింది. ఈ రోజు కూడా ఉత్తర ఆంధ్రప్రదేశ్-దక్షిణ ఒడిశా తీరాల్లోని, పశ్చిమ మధ్య పరిసరాల్లోని వాయువ్య బంగాళాఖాతంలో స్థిరంగా ఉంది. తీవ్ర అల్పపీడనంకి అనుబంధంగా ఉన్న ఆవర్తనం సగటు సముద్ర మట్టం నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు స్థిరంగా కొనసాగుతుంది. ఈ అల్పపీడనం వాయువ్య దిశగా నెమ్మదిగా కదులుతూ ఉత్తర ఆంధ్రప్రదేశ్- దక్షిణ ఒడిశా తీరాలను చేరుకునే అవకాశం ఉంది. దీంతో వాతావరణశాఖ అధికారులు మరో రెండు రోజులు రెడ్ అలెర్ట్ జారీ చేశారు.