Telangana Rains: తెలంగాణలో వర్షాలపై హైదరాబాద్ వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. పశ్చిమ మధ్య పరిసర వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు పేర్కొంది. దీనికి అనుబంధ ఆవర్తనం సముద్రమట్టం నుంచి 7.6 కి.మీ ఎత్తు వరకు విస్తరించిందని పేర్కొంది. దీంతో తెలంగాణలో ఈరోజు నుంచి మరో నాలుగు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ క్రమంలో దీనికి సంబంధించి ఓ ప్రకటన విడుదల చేసింది. అలాగే ఏపీలోని పలు జిల్లాలో వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది.
ఈరోజు కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. అలాగే రేపు అదిలాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది. ఈ క్రమంలో కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.