Heavy Rains: రాజధాని చెన్నై సహా తమిళనాడులోని పలు జిల్లాల్లో భారీ వర్ష హెచ్చరికలు జారీ చేశారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. ఐఎండీ హెచ్చరికతో ప్రభుత్వం అప్రమత్తమైంది. చెన్నై, చెంగల్పట్టు, రాణిపేట, కాంచీపురం జిల్లాల్లోని పాఠశాలలు, తిరువళ్లూరులోని పాఠశాలలు, కళాశాలలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది.
బుధవారం, గురువారం తమిళనాడులోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు(Heavy Rains) కురిశాయి. దీంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. వీధులు మోకాలి లోతు నీటితో నిండిపోయిన దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. రాకపోకల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అదే సమయంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పలుచోట్ల ట్రాఫిక్ జామ్ అయింది. రైళ్లు గంటల తరబడి ఆలస్యంగా నడుస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో చెన్నై కార్పొరేషన్ అవసరమైన వారి కోసం హెల్ప్ లైన్ నంబర్లను అందుబాటులోకి తీసుకువచ్చింది.
Also Read: మన చుట్టూ ఉన్న గాలి ఏటా ఎంతమందిని చంపేస్తోందో తెలిస్తే షాక్ అవుతారు
డిసెంబర్ 2, 3 తేదీల్లో ఆరెంజ్ అలర్ట్..
డిసెంబర్ 2, 3 తేదీల్లో వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ సమయంలో రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. . ఆగ్నేయ బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న దక్షిణ అండమాన్ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ వాయవ్య దిశగా పయనించి బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఈ అల్పపీడనం డిసెంబర్ 2న తుఫానుగా మారే అవకాశం ఉందని ఐఎండీ విడుదల చేసిన బులెటిన్లో పేర్కొంది.
ఎన్డీఆర్ఎఫ్ బృందాలను మోహరించారు..
అదే సమయంలో వర్షాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది. తుపాను హెచ్చరికల నేపథ్యంలో చెన్నై, చెంగల్పట్టు, విల్లుపురం జిల్లాల్లో ఐదు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను మోహరించారు. వర్షాల ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందించాలని అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్, కేరళ, పుదుచ్చేరి, కరైకల్ వంటి ఇతర దక్షిణాది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో డిసెంబర్ 4 వరకు ఓకే ఏ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది.
Watch this interesting Video: