తెలంగాణ రైతులకు వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన కారణంగా రాష్ట్రంలో మరో మూడు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. వర్షాల కోసం ఎంతో ఎదురుచూస్తున్న అన్నదాతలకు కొంత ఉపశమనం దొరికింది.
తెలంగాణలో నేడు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే అవకాశం ఉంది. ఈనెల 20న రాష్ట్ర వ్యాప్తంగా కొమురంభీం, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.
నిన్న (బుధవారం) ఆవర్తన ఈశాన్యాన్ని ఆనుకొని ఉన్న తూర్పు మధ్య బంగాళాఖాతం మీద సముద్రమట్టం నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తు మధ్యలో ఉండడంతో రానున్న రెండు రోజులపాటు తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలు ఉందని వాతావరణ శాఖ చెప్పింది. ఇది ఎత్తుకు వెళ్లే కొద్ది దక్షిణం వైపు వంగి ఉంటుందని పేర్కొన్నారు, అంతేకాకుండా కొద్దిరోజులుగా రాష్ట్రంలో పొడి వాతావరణం కనిపిస్తోంది. భాగ్యనగర్‌లో అప్పుడప్పుడు మోస్తారు వర్షం పడినప్పటికీ.. ఇతర జిల్లాలలో మాత్రం పొడి వాతావరణం మాత్రమే కనిపిస్తోంది. ఎండ తీవ్రత కూడా కొద్దిగా ఎక్కువగానే ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు తెలంగాణ జిల్లాలు ఉక్కపోత వాతావరణం కూడా కొద్దిగా కొనసాగుతోంది. తాజాగా వాతావరణ శాఖ తీపి కబురు చెప్పటంతో ప్రజల కష్టాలు దూరం అవుతున్నాయి.
తెలంగాణలో వర్షాకాలం మొదలై ఇప్పటికీ 3 నెలలు అయింది. కానీ రైతులకు అవసరమైన సమయంలో వానలు పడలేదనే చెప్పాలి. అయితే జూన్‌లో వర్షపాతం నమోదై విత్తనాలు మొలకెత్తలేదు.. ఫలితంగా రైతులకు చాలా నష్టం చేసిందనే చెప్పాలి. జులైలో భారీ వర్షాలతో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఇక ఆగస్టు నెలలోను జూన్ నెల నాటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఇప్పటికే నెలలో సగం రోజులు గడిచినా.. పెద్దగా వర్షాలు కురిసిన దాఖలు లేవు. ఇప్పుడు వాతావరణ శాఖ అధికారులు ఈ తీపి కబురు చెప్పడంతో రైతన్నలకు కొంత ఊరట లభించింది.