ఈ వేసవిలో ఎండల తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని చాలా జిల్లాల్లో 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వడగాలుల కారణంగా బయట పని చేసేవారు ఇబ్బంది పడుతున్నారు. ఎంతోమంది వడదెబ్బ (హీట్ స్ట్రోక్) బారిన పడుతున్నారు. ఇది వేడి అలసటతో కూడిన తీవ్రమైన పరిస్థితి. తక్షణమే చికిత్స అందించకపోతే ప్రాణాంతకమం కావచ్చు. వడదెబ్బకు గురైతే, సహజ శీతలీకరణకు కారణమయ్యే చెమట శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడంలో విఫలమవుతుంది. దీంతో శరీర ఉష్ణోగ్రత పెరిగిపోతుంది.
శరీరం వడదెబ్బకు గురైతే కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. తీవ్రమైన తలనొప్పి వేధిస్తుంది. మైకం కమ్ముకొస్తుంది. శరీరం వేడిగా ఉన్నప్పటికీ చెమట పట్టకపోవడం, చర్మం పొడిబారడం, ఎరుపెక్కడం, వేడిగా మారవచ్చు. కండరాల తిమ్మిరి, బలహీనత, వాంతులు, వికారం, గుండె కొట్టుకునే వేగం మరింత పెరగడం, శ్వాస ప్రక్రియలో హెచ్చుతగ్గులు ఉంటాయి. అయోమయం, గందరగోళం, మూర్ఛపోవడం, స్పృహ కోల్పోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
* వడదెబ్బకు చికిత్స
మండే వేసవిలో వడదెబ్బ బారిన పడితే బాధితుడికి చన్నీటి స్నానం చేయించాలి. ఇది శరీర ఉష్ణోగ్రతను చాలావరకు తగ్గిస్తుంది. మరణం, అవయవ నష్టం ముప్పును నివారిస్తుంది.వడదెబ్బ బారినపడినవారు వీపు, మెడ, గజ్జలు, చంకలు వంటి ప్రదేశాల్లో ఐస్ ప్యాక్‌లతో మర్దన చేసుకోవాలి. లేదా శీతలీకరణ ప్రభావం ఉండే దుప్పటితో కప్పుకోవాలి. ఇలా చేయడం వల్ల శరీర ఉష్ణోగ్రతను చాలా వరకు తగ్గించవచ్చు. వడదెబ్బ బారినపడిన వారిని వెంటనే చల్లగా గాలి తగిలే ప్రదేశానికి చేర్చాలి. ఉప్పు కలిపిన మజ్జిగ లేదా గ్లూకోజ్ వాటర్, ఓఆర్ఎస్ తాగించాలి. దీంతో వేడి నుంచి ఉపశమనం లభిస్తుంది. వడదెబ్బ తగిలి అపస్మారక స్థితిలోకి వెళ్లిన వారికి బీపీ హెచ్చుతగ్గులతో కార్డియాక్ అరెస్ట్ రిస్క్ ఎక్కువగా ఉంటుంది. అందుకే వెంటనే ఆస్పత్రికి తరలించాలి.
వడదెబ్బకు సకాలంలో చికిత్స తీసుకోకపోతే తీవ్ర పరిమాణాలకు దారితీయవచ్చు. శరీరంలో ఏదైన అవయవానికి నష్టం వాటిల్లవచ్చు. కొన్ని సందర్భాల్లో మరణం సంభవించవచ్చు. అందుకే ప్రతి ఒక్కరూ కొన్ని ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. వడదెబ్బ ముప్పు తప్పించుకోవడానికి వేసవిలో తరచుగా నీళ్లు తాగుతు శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుకోవాలి. పగటి సమయంలో నీడ పాటున ఉండాలి. ఇంట్లో కూలర్, ఏసీ వంటి వాటిని ఉపయోగించుకోవాలి.
ఈ వేసవిలో ఎక్కువ తీవ్రత ఉండే పనులకు దూరంగా ఉండాలి. సహజ శీతలీకరణ కోసం మజ్జిగ, కొబ్బరినీరు, నిమ్మరసం, పుదీనా వాటర్, సబ్జా వాటర్ వంటివి తరచూ తాగాలి. వేసవిలో లేత రంగులో వదులుగా ఉండే కాటన్ దుస్తులు ధరించాలి. ఇవి శరీరం చెమటను త్వరగా పీల్చుకుని చికాకును నివారిస్తాయి. ఎండలకు తిరిగేటప్పుడు కళ్లకు కూలింగ్ గ్లాసెస్, తలకు టోపీ ధరించాలి. ఎండ అధికంగా ఉండే మధ్యాహ్న సమయంలో బయటకు వెళ్లకపోవడమే మంచిది.