MLC Kavitha: లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితకు మరోసారి నిరాశే ఎదురైంది. తనకు అనారోగ్యం కారణంగా ఈడీ, సీబీఐ కేసుల్లో బెయిల్ ఇవ్వాలని కోరుతూ కవిత దాఖలు చేసిన పిటిషన్ పై విచారణను సుప్రీం కోర్టు వాయిదా వేసింది. ఈ కేసులో కవిత బెయిల్ కు వ్యతిరేకంగా సీబీఐ కౌంటర్ పిటిషన్ దాఖలు చేయగా.. ఈడీ చేయలేదు. తమకు కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం ఇవ్వాలని ధర్మాసనాన్ని కోరగా.. ఈడీ అభ్యర్థన మేరకు కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం ఇచ్చింది సుప్రీం కోర్టు. గురువారంలోపు కౌంటర్ దాఖలు చేయాలని ఈడీని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది.
బీఆర్ఎస్ శ్రేణులకు నిరాశ..
ఇటీవల లిక్కర్ స్కామ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. కాగా ఈరోజు కవిత బెయిల్ పిటిషన్ పై సుప్రీం కోర్టులో విచారణ జరగనున్న తరుణంలో కవితకు ఖచ్చితంగా బెయిల్ వస్తుందని బీఆర్ఎస్ నేతలతో పాటు కార్యకర్తలు ఆశతో ఉన్నారు. తాజాగా సుప్రీం కోర్టు బెయిల్ పిటిషన్ పై విచారణను వాయిదా వేయడంతో మరోసారి కవిత బెయిల్ పై ఉత్కంఠ నెలకొంది. లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితను మార్చి 15న ఈడీ అరెస్ట్ చేసింది. దాదాపు ఐదు నెలలుగా కవిత జైలులోనే ఉన్నారు. పలు మార్లు బెయిల్ కోసం ప్రయత్నాలు చేయగా అన్ని ప్రయత్నాలు విఫలం అయ్యాయి. మరి కవిత బెయిల్ పై సుప్రీం కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందో వేచి చూడాలి.