Migraine Symptoms And Treatment: ప్రపంచవ్యాప్తంగా చాలా మందిని వేధిస్తున్న సమస్యల్లో మైగ్రేన్ ఒకటి. ఇది పురుషుల కంటే మహిళలను ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. ఇది ఒక సాధారణ నాడీ సంబంధిత రుగ్మత. తలలో ఒక వైపు తీవ్రమైన నొప్పి, లైట్, సౌండ్‌ను భరించలేకపోవడం, వికారం, వాంతులు వంటి లక్షణాలు ఉంటాయి. బాధితులు అలసట, చిరాకు, ఏకాగ్రత లేక ఇబ్బంది పడతారు. అయితే ఈ సమస్య ఉన్నవారిలో సగం మంది మాత్రమే వైద్య సహాయం తీసుకుంటారని నివేదికలు చెబుతున్నాయి. చాలామంది డాక్టర్‌ను సంప్రదించకుండా నిర్లక్ష్యంగా ఉంటారు. చాలా తక్కువ మంది చికిత్సతో కోలుకుని మైగ్రేన్ నుంచి బయటపడతారు.
మైగ్రేన్‌ను కొందరు తప్పుగా అంచనా వేస్తారు. ఈ వ్యాధి తప్పుగా నిర్ధారణ కావడానికి, రోగనిర్ధారణ జరగకపోవడానికి, సరిగ్గా చికిత్స చేయకపోవడానికి జెండర్ బయాస్ కూడా ఒక పెద్ద కారణమని కొందరు నిపుణులు చెబుతారు. యేల్ మెడిసిన్ హెడ్ & ఫేషియల్ పెయిన్ సెంటర్ డైరెక్టర్, ఎండీ, న్యూరాలజిస్ట్ క్రిస్టోఫర్ గోట్స్‌చాక్ webmdతో మాట్లాడుతూ.. ఇది స్త్రీ ద్వేషానికి మరొక ఉదాహరణ అన్నారు.
Also Read: కప్ కొట్టడంకంటే వారికి పార్టీలమీదే ధ్యాస ఎక్కువ.. రైనా షాకింగ్ కామెంట్స్
* ప్రాబ్లం ఉందంటే నమ్మరు!
తలనొప్పుల (Headache) గురించి స్త్రీలు కంప్లైంట్ చేస్తే, వారిని సక్రమంగా పని చేయలేని వారిగా, సోమరితనం, న్యూరోటిక్ లేదా ఫేక్ పర్సన్స్‌గా భావిస్తున్నట్లు క్రిస్టోఫర్ చెప్పారు. కానీ నిజంగానే వారికి వైద్యపరమైన సమస్య ఉన్నట్లు చాలామంది నమ్మరని తెలిపారు. జాతి లేదా లింగంతో సంబంధం లేకుండా తరచూ తలనొప్పి తలనొప్పితో బాధపడుతుంటే డాక్టర్‌ను తప్పకుండా సంప్రదించాలని సూచించారు. ఎందుకంటే మైగ్రేన్‌కి ప్రత్యేక చికిత్స అవసరం కావచ్చని, డాక్టర్ మాత్రమే దాన్ని సూచించగలరని క్రిస్టోఫర్ వివరించారు.
* మైగ్రేన్ ప్రభావాలు
మైగ్రేన్ వచ్చే సమయంలో వికారం అనిపించవచ్చు లేదా విసుగు చెందవచ్చు. లైట్, సౌండ్ కూడా ఇబ్బందిగా అనిపిస్తాయి. ఏ పని చేయకపోయినా అలసిపోయినట్లు అనిపించవచ్చు, స్పష్టంగా ఆలోచించలేకపోతారు. మీ చర్మం కూడా దెబ్బతింటుంది. సరైన చికిత్స తీసుకోకపోతే ఈ లక్షణాలు కొన్ని గంటలు లేదా రోజులు కూడా ఉంటాయి. కొన్నిసార్లు మైగ్రేన్ లేనప్పటికీ, బ్రెయిన్ ఫాగ్, చర్మం నొప్పి లేదా లైట్‌ని భరించలేకపోవడం వంటి కొన్ని ప్రభావాలు ఉండవచ్చు. మైగ్రేన్ సమయంలో సాధారణ పనులు కూడా చేసుకోలేరు. అందుకే మైగ్రేన్ కారణంగా మీ జీవితంలో ఎదురవుతున్న అన్ని అంశాలను వైద్యులకు వివరించాలి.
* డాక్టర్‌తో ఎలా మాట్లాడాలి?
మైగ్రేన్ గురించి వైద్యులతో మాట్లాడుతున్నప్పుడు, అవి మీ జీవితాన్ని ఎంత ప్రభావితం చేస్తున్నాయో నొక్కి చెప్పడం ముఖ్యం. కేవలం తలనొప్పి అని చెప్పడానికి బదులుగా, ఎన్ని గంటలు, రోజులు పని చేసుకోనివ్వకుండా ఇబ్బంది పెడుతుందో వివరించండి. ఈ నొప్పిని భరించలేకపోతున్నాను, రోజువారీ పనులు చేసుకోలేకపోతున్నాను వంటి మాటలు ఉపయోగించండి. వీటితో వైద్యులు మీ పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోగలరు. తద్వారా వారు మెరుగైన చికిత్స అందించేందుకు ప్రయత్నిస్తారు.