AP News: అచ్యుతాపురం ఎస్ఈజెడ్‌లోని ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదం చాలా బాధ కలిగించిందని ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ అన్నారు. ఈ రోజు ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడారు. ఈ ప్రమాదంలో దాదాపు 17 మంది ప్రాణాలు కోల్పోవడం, అనేక మంది క్షతగాత్రులు కావడంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించిందన్నారు. వెంటనే సీఎం అక్కడికి అధికారులను పంపారన్నారు. సంబంధిత అధికారులు అక్కడ సహాయక చర్యలు చేపట్టారని మంత్రి తెలిపారు.
35 మంది వివిధ ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారని సత్యకుమార్ అన్నారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఇటువంటి ప్రమాదాల వల్ల పాఠాలు నేర్చుకుని మళ్లీ జరగకుండా చూడాలన్నారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేలను ప్రధాని ప్రకటించారన్నారు.
ప్రభుత్వం మృతుల కుటుంబాలకు అండగా ఉంటుందని ఆయన వివరించారు. సీఎం చంద్రబాబు స్వయంగా అక్కడకు చేరుకుని వారితో మాట్లాడుతున్నారని, ఇటువంటి ఘటనలు జరగకుండా అవసరమైన చర్యలు ప్రభుత్వం తీసుకుంటుందని మంత్రి తెలిపారు.