భారతీయ మార్కెట్లతో దూకుడు కనిపిస్తోంది. గత కొన్ని నెలలుగా బుల్ ట్రెండ్ నడుస్తుండటంతో షేర్ల రేట్లు పైపైకి పోతున్నాయి. దీంతో ఇన్వెస్టర్లు షేర్లు కొనేందుకు ఎగబడుతున్నారు. గత ఏడాదితో పోల్చితే స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టేవారి సంఖ్య బాగా పెరిగింది.షేర్ మార్కెట్ అనగానే భయపడేవారు చాలామందే ఉంటారు. కానీ షేర్లు కొని లాంగ్ టర్మ్‌లో ఇన్వెస్ట్ చేస్తే అద్భుతాలు జరుగుతుంటాయి. షేర్లలో పెట్టుబడి అనేది కొన్ని సందర్భాల్లో స్థిరాస్తి, బంగారం కంటే ఎక్కువ రాబడి అందిస్తుంటాయి. అంతేకాదు ఇల్లు, బంగారంపై లోన్లు ఇచ్చినట్లుగానే షేర్లపై కూడా లోన్స్ ఇస్తారనే విషయం కొందరికే తెలుసు.
మీ వద్ద ప్రస్తుతం ఉన్న షేర్లను తాకట్టు పెట్టి బ్యాంక్ లేదా ఆర్థిక సంస్థ నుండి డబ్బు తీసుకోవచ్చు. అంటే మీ షేర్లపై లోన్ వస్తుందన్నమాట. భారతదేశంలో, బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలతో సహా వివిధ ఆర్థిక సంస్థలు అందించే సాధారణ పద్ధతిలో షేర్లపై రుణం తీసుకోవచ్చు. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లకు ఇది ఓ వరం లాంటిది.మీ సెక్యూరిటీలను (స్టాక్‌లు, మ్యూచువల్ ఫండ్‌లు, బాండ్‌లు మొదలైనవి) తాకట్టు పెట్టి ఆర్థిక సంస్థ నుండి లోన్ పొందడం సులభం. డీమ్యాట్ ఖాతాలో షేర్లను కలిగి ఉన్న వ్యక్తులు షేర్లపై రుణం పొందేందుకు అర్హులు. లోన్ ఇచ్చే బ్యాంకును బట్టి మీరూ పొందే డబ్బులో కొద్దిపాటి తేడా ఉండొచ్చు.
మీరు తాకట్టు పెట్టిన షేర్లు, సెక్యూరిటీల రకాన్ని బట్టి 50% నుండి 70% లేదా అంతకంటే ఎక్కువ లోన్ వస్తుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే మీ షేర్లపై రూ. 20 లక్షల వరకు లోన్ అందిస్తోంది. ఈ లోన్ వ్యక్తిగత అవసరాలతో పాటు కొత్త షేర్ల ఇష్యూలకు సబ్‌స్క్రయిబ్ చేయడానికి ఉపయోగించుకోవచ్చు.కాగా.. షేర్లు తాకట్టు పెట్టి లోన్ తీసుకునేవారికి కనిష్టంగా 50 వేలు, గరిష్టంగా 20 లక్షల వరకు లోన్ అనుమతిస్తారు. ఐపీఓలకు సబ్‌స్క్రయిబ్ చేయడం కోసం అయితే షేర్లపై రుణాలు రూ. 10 లక్షల వరకే ఇస్తారు. ఇందుకు గాను ప్రాసెసింగ్ ఫీజు OD: లోన్ మొత్తంలో 0.75% + వర్తించే GST కనిష్టంగా రూ.1000 ఉంటుంది.