CM Revanth Reddy: అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీ అధ్యాపకుల(Harvard University faculty members) బృందం డాక్టర్ డొమినిక్ మావో నేతృత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఉస్మానియా యూనివర్సిటీలో జనవరి 7వ తేది నుండి నిర్వహిస్తున్న ప్రోగ్రాం ఫర్ సైంటిఫిక్లీ ఇన్‌స్పైర్డ్ లీడర్‌షిప్ (PSIL-24) కార్యక్రమం గురించి సీఎంకు వివరించారు.పేద విద్యార్థుల కోసం రాష్ట్రంలోని రెసిడెన్షియల్ పాఠశాలలను బలోపేతం, సుసంపన్నం చేయడానికి ఏడాదిపాటు విద్యా కార్యక్రమాలను నిర్వహించేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించాలని హార్వర్డ్ యూనివర్సిటీ అధ్యాపకుల బృందాన్ని సీఎం కోరారు.
జనవరి 7వ తేదీ నుంచి 12వ తేదీ వరకు ఉస్మానియా యూనివర్సిటీ(Osmania University)లో తెలంగాణ పాఠశాల విద్యాశాఖ సహకారంతో హార్వర్డ్ యూనివర్సిటీ అధ్యాపకుల బృందం 40 ప్రభుత్వ పాఠశాలల్లోని 100 మంది 10 నుంచి 12వ తరగతి విద్యార్థులకు, 33 జిల్లాల నుండి ఉన్నత పాఠశాలల ఆంగ్ల ఉపాధ్యాయులకు 5 రోజులపాటు సైంటిఫిక్లీ ఇన్‌స్పైర్డ్ లీడర్‌షిప్ (PSIL-24) శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నదని అధ్యాపకులు ముఖ్యమంత్రికి వివరించారు.
విద్యా శాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం(Burra Venkatesham) ఈ కార్యక్రమం గురించి వివరాలను ముఖ్యమంత్రికి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ డి.రవీందర్, విద్యాశాఖ కమిషనర్ దేవసేన, ఎంఎస్ షెఫాలీ ప్రకాష్, డాక్టర్ ఎండీ రైట్ తదితరులు పాల్గొన్నారు.