Actor Govinda Joins Shiv Sena: బాలీవుడ్ సీనియర్ నటుడు గోవిందా (Govinda) పొలిటికల్ రీ ఎంట్రీకి సిద్ధమయ్యాడు. 2004 లోక్‌సభ ఎన్నికల్లో నార్త్ ముంబై నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి గెలుపొందిన విషయం తెలిసిందే. కాగా ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకే కాదు రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అయితే 2024 లోక్ సభ ఎన్నికల (Lok Sabha Elections) నేపథ్యంలో మరోసారి రంగలోకి దిగబోతున్నారు.
నార్త్ వెస్ట్ ముంబై నుంచి..
ఈ మేరకు గురువారం మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ శిండే (CM Eknath Shinde) సమక్షంలో శివసేన పార్టీలో చేరారు. గోవిందకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు శిండే. దీంతో నార్త్ వెస్ట్ ముంబై లోక్‌సభ స్థానం నుంచి గోవిందా పోటీ చేయబోతున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇదే క్రమంలో శివసేన అధికార ప్రతినిధి క్రిష్ణ హెగ్డే గోవిందాను ఆయన నివాసంలో కలిసి పార్టీలోకి ఆహ్వానించిన విషయం తెలిసిందే.
మొత్తం 48 లోక్‌సభ స్థానాలు..
ఇదిలావుంటే.. మహారాష్ట్రలో బీజేపీ, శివసేన, ఎన్సీపీ పార్టీలు ‘మహాయుతి’ కూటమిగా ఏర్పడి పోటీ చేస్తున్నాయి. 3 పార్టీల మధ్య సీట్ల సర్దుబాటుపై చర్చలు కొనసాగుతున్నాయి. మరోవైపు, కాంగ్రెస్- శివసేన (యూబీటీ), ఎన్సీపీ (శరద్ పవార్) పార్టీలు ‘మహా వికాస్ అఘాడీ’ కూటమిగా ఏర్పడ్డాయి. రాష్ట్రంలో మొత్తం 48 లోక్‌సభ స్థానాలుండగా.. వీటిలో 44 స్థానాలకు ఈ కూటమి పార్టీల మధ్య సర్దుబాటు జరిగింది. ఇందులో భాగంగా శివసేన (యూబీటీ) 19, కాంగ్రెస్ 16, శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ పార్టీకి 9 సీట్లను కేటాయించారు. మిగతా నాలుగు స్థానాలకు చర్చలు జరుగుతున్నాయి.
Also Read: రామేశ్వరం పేలుడు కేసులో షరీఫ్ అరెస్ట్