Gold Rates Hike: మళ్ళీ బంగారం ధరల పరుగులు.. ఎందుకలా?

కొన్నిరోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం, వెండి ధరలు మళ్ళీ పెరుగుతున్నాయి. యూఎస్ ఫెడ్ రేట్స్ తగ్గిస్తుందనే వార్తలు అంతర్జాతీయంగా బంగారం ధరల పెరుగుదలకు కారణంగా నిపుణులు చెబుతున్నారు. స్టాక్ మార్కెట్ పడిపోతూ ఉండడం కూడా బంగారం ధరలపై ప్రభావాన్ని చూపిస్తోందని వారంటున్నారు. 

New Update
Gold Rates : బంగారం ప్రియులకు తీపి కబురు..తగ్గిన పసిడి, వెండి ధరలు

Gold Rates Hike: బంగారం ధరలు మనల్ని నిత్యం వెంటాడుతూనే ఉంటాయి. బంగారం ధరల్లో వచ్చే మార్పులు అనూహ్యంగా ఉంటాయి. స్టాక్ మార్కెట్ ఎలా అయితే అనిశ్చితంగా కదులుతూ ఉంటుందో.. బంగారం కూడా అలానే ఒడిదుడుకుల ప్రయాణం చేస్తూ ఉంటుంది. అంతర్జాతీయ పరిస్థితులు.. స్థానిక అంశాలు.. డిమాండ్ బంగారం ధరలను ప్రభావితం చేస్తాయి. కొన్నిరోజుల క్రితం వరకూ రికార్డు స్థాయికి చేరుకొని… సామాన్యులకు బంగారం పేరు చెబితేనే భయం పుట్టేలా పరిస్థితి ఉంది. అయితే, ఈ ఏడాది బడ్జెట్ లో బంగారంపై దిగుమతి సుంకాన్ని 15 శాతం నుంచి 6 శాతానికి తగ్గించారు. దీంతో ఒకేసారి బంగారం ధరలు భారీగా పడిపోయాయి. ఆ తరువాత కొన్నిరోజులు బంగారం ధరలు తగ్గుదల బాటలో ప్రయాణించాయి. బంగారం ధరలు ఒకేసారి ఎంతగా పడిపోయాయంటే.. వారం రోజుల వ్యవధిలో 10 గ్రాములకు ఆరువేల రూపాయలకు పైగా దిగివచ్చింది. అక్కడ నుంచి కొంచెం పెరగడం.. కొంచెం తగ్గడం అన్నట్టుగా బంగారం ధరల ధోరణి ఉంది. అయితే.. మళ్ళీ ఈవారంలో బంగారం ధరలు పెరుగుదల బాటలోకి వెళ్లిపోయాయి. మూడురోజుల వ్యవధిలోనే 1000 రూపాయలకు పైగా బంగారం ధరలు పెరిగాయి. 

Gold Rates Hike: మరోవైపు వెండి ధరలు కూడా పెరుగుతూనే వస్తున్నాయి. కేజీ వెండి ధర లక్షరూపాయాలకు చేరుకుంది కొన్ని నెలల క్రితం. బడ్జెట్ తరువాత బంగారంతో పాటు వెండిధరలు కూడా బాగా పడిపోయాయి. ఒక సమయంలోనైతే దాదాపు 70 వేల రూపాయలకు దగ్గరకు వెండి ధర చేరిపోతుంది అనిపించింది. కానీ, కొన్నిరోజులుగా వెండి ధరలు పైకి కదులుతూ వస్తున్నాయి. అంతకుముందు రెండు సెషన్స్ లో వెండి దాదాపుగా 1600 రూపాయాల వరకూ పెరిగింది. మొన్న  600 రూపాయలు తగ్గింది. నిన్న మళ్ళీ 1000రూపాయలు పెరిగింది. వెండి ధర ఇప్పుడు కేజీకి 88 వేల రూపాయల దగ్గర కదులుతోంది. 

కారణాలేమిటి?
Gold Rates Hike: అకస్మాత్తుగా బంగారం, వెండి ధరల పరుగులకు కారణాలేమిటి? ఈ విషయంపై బులియన్ మార్కెట్ నిపుణులు బంగారం వెండి ధరల పెరుగుదల ఊహించిందే కానీ, ఇంత ఎక్కువగా జరుగుతుంది అని అనుకోలేదన్నారు. అంతర్జాతీయంగా బంగారం పెరుగుదలకు కారణం మాత్రం.. యూఎస్ ఫెడ్ వడ్డీరేట్లు తగ్గే అవకాశం ఉందని వస్తున్న వార్తలే అని చెబుతున్నారు.  ఫెడ్ వడ్డీరేట్ల తగ్గుదల వార్తల నేపథ్యంలో ఇన్వెస్టర్స్ బంగారంలో పెట్టుబడులను పెంచుతున్నారు. దానివలన డిమాండ్ పెరుగుతూ వస్తోంది. దీంతో ధరలు కూడా పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్న మాట. ఇక స్థానికంగా కూడా బంగారానికి డిమాండ్ పెరుగుతూ వస్తోంది. శ్రావణమాసం.. పెళ్లిళ్ల సీజన్ తో పాటు మరో కారణం కూడా కనిపిస్తోందని నిపుణులు అంటున్నారు. స్టాక్ మార్కెట్ అనిశ్చితంగా కదులుతోంది. మార్కెట్ తరుచు కిందికి పడిపోతోంది. ఈ నేపథ్యంలో ఇన్వెస్ట్మెంట్ కి గోల్డ్ సేఫ్ అని భావిస్తున్న పెట్టుబడిదారులు బంగారం కొనుగోలుపై ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో బంగారం ధరలపై ప్రభావం కనిపిస్తోందని చెబుతున్నారు. 

Gold Rates Hike: మొత్తంగా చూసుకుంటే.. బంగారం ధరల్లో పెరుగుదల వరుసగా కనిపిస్తోంది. నిపుణుల అంచనా ప్రకారం కొన్నిరోజుల పాటు ఇది కొనసాగే అవకాశం ఉంది. ఈరోజు అంతర్జాతీయంగా బంగారం ధరలు కాస్త పెరిగాయని చెప్పవచ్చు. ఉదయం 7 గంటల సమయానికి పదిగ్రాముల బంగారం మన రూపాయల్లో చెప్పుకుంటే 137 రూపాయల పెరుగుదల కనబరిచింది. అదేవిధంగా వెండి విషయానికి వస్తే.. స్వల్ప పెరుగుదల కనబరిచింది. 

ఇక హైదరాబాద్ లో ఈరోజు మార్కెట్ ప్రారంభ సమయానికి బంగారం ధరలు ఇలా ఉన్నాయి.. 

22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 950 రూపాయల పెరుగదలతో 65,650 రూపాయల వద్దకు చేరుకుంది. అలాగే 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 1040 రూపాయలు పెరిగింది. దీంతో 71,620 రూపాయలకు ఎగబాకింది. 

హైదరాబాద్ లో వెండి ధరలు కేజీకి 1000 రూపాయలు పెరిగాయి. దీంతో కేజీ వెండి ధర 88,500కు చేరుకుంది.

గమనిక :  బంగారం ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు వస్తుంటాయి .  అలాగే ,  స్థానికంగా బంగారం ధరలపై అనేక ప్రభావాలు ఉంటాయి .  ఇక్కడ ఇచ్చిన ధరలు మార్కెట్ ప్రారంభ సమయానికి ఉన్నవి. బంగారం, వెండి కొనాలని అనుకున్నపుడు మార్కెట్ ధరలను పరిశీలించి కొనుక్కోవాలని RTV సూచిస్తోంది .

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు