Krishank: విద్యుత్ కొనుగోళ్ల విషయంలో మాజీ సీఎం కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడంపై స్పందించారు బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇంఛార్జి క్రిశాంక్. ఆయన సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వానికి కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ, ఛత్తీస్ గఢ్ మధ్యలో జరిగింది రెండు ప్రభుత్వాల విద్యుత్ ఒప్పందం అని అన్నారు.
ఇదే కేసులో కేసీఆర్ నోటీసు ఇచ్చినప్పుడు, మరి అప్పటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి భూపేష్ బగేల్ కు ఎందుకు నోటీసులు ఇవ్వలేదని నిలదీశారు. రెండు రాష్ట్రాల మధ్య జరిగిన ఒప్పందానికి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు బాధ్యత ఉంటుందని.. కేసీఆర్ తో పాటు ఆనాటి సీఎం భూపేష్ బగేల్ కు కూడా నోటీసులు ఇచ్చి విచారణ జరపాలని బీఆర్ఎస్ శ్రేణులు డిమాండ్ చేస్తున్నారు. ఇదంతా సీఎం రేవంత్ రెడ్డి, పొలిటికల్ స్ట్రాటెజిస్ట్ సునీల్ కనుగోలు ఆడుతున్న కొత్త నాటకం స్క్రిప్ట్ అని క్రిశాంక్ ఎద్దేవా చేశారు.
కేసీఆర్ కు రెండోసారి నోటీసులు..
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కు ఉహించకని షాక్ తగిలింది. ఛత్తీస్ గఢ్ విద్యుత్ కొనుగోలు విషయంలో కేసీఆర్‌కు నోటీసులు అందాయి. జస్టిస్ నర్సింహా రెడ్డి ఆయనకు నోటీసులు ఇచ్చారు. ఇచ్చిన నోటీసులపై ఈ నెల 15 లోపు వివరణ ఇవ్వాలని నోటీసుల్లోపేర్కొన్నారు. కాగా ఇటీవల ఇదే అంశంపై గతంలో నోటీసులు పంపగా ఎన్నికల దృష్ట్యా జులై 30 వరకు వివరణ ఇచ్చేందుకు సమయం ఇవ్వాలని కేసీఆర్ కోరిన విషయం తెలిసిందే.