CM Revanth Reddy Brother: చెరువుల కబ్జాలపై తెలంగాణ సర్కార్ ఫోకస్ పెట్టింది. తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. సీఎం రేవంత్‌రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి ఉంటున్న ఇంటికి నోటీసులు అందించింది. మాదాపూర్ అమర్ కో-ఆపరేటివ్ సోసైటీలో తిరుపతి రెడ్డి ఉంటున్న అద్దె ఇంటికి, కార్యాలయానికి నోటీసులు అందించారు GHMC అధికారులు. ఆయన ఉంటున్న ఇల్లు దుర్గం చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉన్నట్లు రెవెన్యూ అధికారుల గుర్తించారు.
కట్టడాలను తొలగించాలని 30 రోజుల గడువు ఇచ్చారు అధికారులు. దుర్గం చెరువుకు ఆనుకున్న ఉన్న నెక్టర్స్ కాలనీ, డాక్టర్స్ కాలనీ, కావూరిహిల్స్, అమర్ సోసైటీవాసులకు కూడా నోటీసులు ఇచ్చారు. మొత్తం 204 ఇళ్లకు జీహెచ్‌ఎంసీ అధికారుల నోటీసులు ఇచ్చారు. పలువురు ఐఏఎస్, ఐఆర్‌ఎస్ అధికారులు, సినీ, రాజకీయ ప్రముఖులకు నోటీసులు ఇచ్చారు. మరోవైపు కూల్చివేతలపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. నా కుటుంబ సభ్యులకు ఆక్రమణలున్నాయని, ఎవరైనా ఆధారాలు చూపిస్తే..వాటినీ కూల్చివేస్తాం అని ఆయన అన్నారు. ఈ క్రమంలో సీఎం రేవంత్ సోదరుడు తిరుపతి రెడ్డి ఇంటికి నోటీసులు ఇచ్చారు.