రానున్న ఎంపీ ఎన్నికల్లో తెలంగాణలో మెజారిటీ సీట్లలో గెలుపే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) వ్యూహాలు రచిస్తున్నారు. ముఖ్యంగా గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ వెనకబడ్డ జీహెచ్ఎంసీ పరిధిలోని ఎంపీ సీట్లపై ఫోకస్ చేశారు. ఇందులో భాగంగా ఆయన చేరికలపై దృష్టిసారించినట్లు తెలుస్తోంది. ఈ రోజు రాష్ట్ర కాంగ్రెస్ ఇంఛార్జి దీపాదాస్ మున్షి బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు, ఆ పార్టీ సెక్రటరీ జనరల్ కే.కేశవరావు నివాసానికి వెళ్లి చర్చలు జరపడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. దీంతో కేశవరావు కూతురు, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కాంగ్రెస్ లో చేరనుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. తనను కాంగ్రెస్ లోకి రావాలని మున్షి ఆహ్వానించినట్లు విజయలక్ష్మి చెప్పారు. అయితే.. కార్యకర్తలతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని ఆమె చెప్పడం బీఆర్ఎస్ వర్గాల్లో కలకలం సృష్టిస్తోంది.
ఇది కూడా చదవండి: Telangana: బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన బొంతుకు షాక్
గత అసెంబ్లీ ఎన్నికల్లో జీహెచ్ఎంసీ (GHMC) పరిధిలో కాంగ్రెస్ ఖాతా తెరవలేదు. దీంతో ఎంపీ ఎన్నికల్లో ఆ పరిస్థితి రాకూడదని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఇందులో భాగంగా బలమైన నేతలను తమవైపు తిప్పుకునే పనిలో పడ్డారు కాంగ్రెస్ నేతలు. ఈ నేపథ్యంలోనే చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి బీఆర్ఎస్ ను వీడి హస్తం గూటికి చేరిపోయారు. ఆయనకు టికెట్ కూడా ఇచ్చింది.
ఖైరతాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ను చేర్చుకుని ఆయనకు సికింద్రాబాద్ ఎంపీ టికెట్ ఇచ్చింది కాంగ్రెస్. వికారాబాద్ జడ్పీ చైర్ పర్సన్, మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి సతీమణి సునీతారెడ్డిని పార్టీలో చేర్చుకుని మల్కాజ్ గిరి టికెట్ ను కేటాయించింది కాంగ్రెస్. ఎంపీ ఎన్నికల్లో గ్రేటర్ లో సత్తా చాటేందుకు కాంగ్రెస్ రచిస్తున్న వ్యూహాలు ఫలిస్తాయో.. లేదో తెలియాలంటే ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు ఆగాల్సిందే!