Gannavaram Police changed the route map of Nara Lokesh Yuvagalam Padayatra: తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర గన్నవరంలో కొనసాగుతోంది. నారా లోకేష్ పాదయాత్ర రూట్ ను పోలీసులు మార్చడంతో గన్నవరంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో హై టెన్షన్ నెలకొంది. ముందు రూట్ మ్యాప్ ప్రకారం ఎమ్మెల్యే వల్లభనేని ఆఫీసు ముందుగా లోకేష్ పాదయాత్ర వెళ్లాల్సి ఉంది. అయితే ఎమ్మెల్యే వంశీ.. ఆఫీసులోనే ఉండటంతో నారా లోకేష్ పాదయాత్ర అటువైపు వెళ్లకుండా పోలీసులు బార్కేడ్లు అడ్డుపెట్టారు.
తమ రూట్ మ్యాప్ ప్రకారం తాము వెళ్లాల్సిందేనంటూ తెలుగు దేశం పార్టీ నేతలు స్పష్టం చేశారు. దీంతో పోలీసులకు, టీడీపీ నేతలకు మధ్య వాగ్వాదం తలెత్తింది. వంశీ కార్యాలయంలో ఉన్న కారణంగా వేరే మార్గం గుండా వెళ్లాలంటూ పోలీసులు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం గన్నవరం సమీపంలోని హెచ్‌సీఎల్ వద్ద లోకేష్ పాదయాత్ర కొనసాగుతోంది.
ఐటీ మంత్రిగా రాష్ట్రానికి హెచ్‌సీఎల్ కంపెనీని తానే తెచ్చానంటూ లోకేష్ సెల్ఫీ ఛాలెంజ్ విసిరారు. కాసేపట్లో పోలీసులు దిగ్బంధించిన మార్గం వద్దకు యువగళం పాదయాత్ర చేరుకోనుంది. లోకేష్ పాదయాత్ర కొనసాగే రహదారిపై పోలీసులు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. సైకో పోవాలి - సైకిల్ రావాలి అంటూ తెలుగుదేశం శ్రేణులు పెద్ద ఎత్తున డీజీ ప్లే చేస్తున్నారు. ఈ క్రమంలో పోలీసుల ఆంక్షలపై లోకేష్ ఎలాంటి స్టెప్ తీసుకోనున్నారో తెలియాల్సి ఉంది.