గన్నవరంలో వేడెక్కిన రాజకీయం.. దుట్టా.. యార్లగడ్డ వైపు వెళ్తారా? వంశీకి సపోర్ట్ చేస్తారా?

గన్నవరం రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. లోకేష్ సభ, గన్నవరం నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ గా యార్లగడ్డ నియామకంతో కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి. టీడీపీ నుంచి వైసీపీకి వచ్చిన వల్లభనేని వంశీకి వచ్చే ఎన్నికల్లో గెలుపు ప్రతిష్ఠాత్మకంగా మారుతోంది. యార్లగడ్డకు బాధ్యతలు ఇవ్వటం ద్వారా కలిసి వస్తుందని టీడీపీ అంచనా వేస్తోంది. దీంతో అలర్ట్ అయిన వైసీపీ అధిష్టానం కొత్త గేమ్ మొదలుపెట్టింది.

గన్నవరంలో వేడెక్కిన రాజకీయం.. దుట్టా.. యార్లగడ్డ వైపు వెళ్తారా? వంశీకి సపోర్ట్ చేస్తారా?
New Update

వైసీపీ దిద్దుబాటు చర్యలు.. 

గన్నవరం రాజకీయం రోజురోజుకు రసవత్తరంగా మారుతుంది. 2024 ఎన్నికల్లో గెలుపు తీరం చేరేందుకు ఎవరికి వారు పక్కా ప్రణాళికలు రచ్చించుకుంటున్నారు. నిన్నటి వరకు వైసీపీ లీడర్‌గా ఉన్న యార్లగడ్డ వెంకట్రావు టీడీపీలో చేరటంతో వెంటనే దిద్దుబాటు చర్యలకు దిగింది జగన్ పార్టీ. గన్నవరంలో పార్టీ సీనియర్ నాయకుడిగా ఉన్న మరో నేత దుట్టా రామచంద్రరావుతో ఎంపీ బాలశౌరి మంతనాలు జరిపారు. ఆయన పార్టీలోనే కొనసాగాలని అధిష్టానం నిర్ణయాన్ని తెలియజేశారు. గన్నవరంలో వైసీపీ నుంచి వంశీ పోటీ చేయటం ఖాయమైందని దీంతో సహకారం అందించాలని కోరారు. ఇదే సమయంలో దుట్టాకు పార్టీలో కీలక బాధ్యతలు అప్పగిస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి సపోర్ట్ చేస్తే ఎమ్మెల్సీ లేదా రాజ్యసభతో పాటు దుట్టా కూతురుకి జిల్లా పరిషత్ చైర్మన్ పదవి ఇస్తామని హమీ ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం.

దుట్టాకు అన్యాయం జరిగిందంటున్న యార్లగడ్డ..

వంశీ ఇప్పటి నుంచే పూర్తిగా రానున్న ఎన్నికల కోసం రంగంలోకి దిగారు. వంశీకి ఉన్న అనుచర వర్గం, మద్దతుతో పాటుగా సంక్షేమ పథకాల ఓట్ బ్యాంక్ కలిసి వస్తుందని లెక్కలు వేసుకుంటున్నారు. టీడీపీ నుంచి గతంలో ఎమ్మెల్యేగా పని చేసిన దాసరి బాలవర్ధన్ రావు కొద్ది రోజుల క్రితం చంద్రబాబుతో సమావేశం అయ్యారు. అయితే వెంకట్రావుకు టీడీపీ టికెట్ ఇస్తే దాసరి సోదరులు సహకరిస్తారా లేదా అనేది సందేహమే. మరోవైపు వంశీ రాకతో అలకబూనిన వైసీపీ కేడర్ యార్లగడ్డ వైపు మొగ్గు చూపుతుంది. అధికార పార్టీ కేడర్‌ పైనే వంశీ కేసులు పెట్టించి ఇబ్బందులకు గురిచేశారని అందుకే తామంతా పార్టీ వీడాల్సి వస్తుందని బహిరంగంగానే విమర్శలు చేశారు. గన్నవరంలో యార్లగడ్డ ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో దుట్టాకు గన్నవరంలో జరిగిన అన్యాయం చెబుతూనే తనకు దుట్టా మద్దతు ఉందని యార్లగడ్డ ప్రకటించారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన దుట్టాకు ఎమ్మెల్సీ పదవి ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.

దుట్టాపై వైసీపీ ఫోకస్..

యార్లగడ్డ వెంకట్రావు వైసీపీకి గుడ్ బై చెప్పడంతో దుట్టా రామచంద్రరావుపై వైసీపీ అధిష్టానం ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే దుట్టా రామచంద్రరావుతో వైసీపీ ఎంపీ బాలశౌరి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు. గన్నవరంలో వల్లభనేని వంశీని దుట్టా రామచంద్రరావు వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో కూడా అదే అంశం ప్రధానంగా చర్చకు వచ్చినట్టుగా తెలుస్తోంది.

వైసీపీలోకి వీర విధేయుడిగా ఉంటారు..

దుట్టా రామచంద్రరావు వైసీపీకి వీరవిధేయుడని, గన్నవరంలో వైసీపీకి దుట్టా రామచంద్రరావు సహాయ సహకారాలు ఉంటాయని బాలశౌరి తెలిపారు. వైసీపీ ఆవిర్భావం నుంచి దుట్టా పార్టీలోనే ఉన్నారని.. గన్నవరంలో వైసీపీ బ్రహ్మాండమైన మెజారిటీతో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. సీఎం జగన్ కోసం, వైసీపీ కోసం దుట్టా రామచంద్రరావు పనిచేస్తారని ఇందులో ఎలాంటి అనుమానం లేదని క్లారిటీ ఇచ్చారు.

బాలశారితో అదే విషయాలు చెప్పా..

వైసీపీకి విధేయుడిగా ఉంటానని దుట్టా మాత్రం చెప్పకపోవడం గమనార్హం. నియోజకవర్గంలో పార్టీ విషయాలు మాట్లాడేందుకు మూడు నెలల క్రితమే సీఎం జగన్ తనను పిలిచారని, ఆ సమయంలో తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా జగన్‌కు చెప్పడం జరిగిందన్నారు దుట్టా. బాలశౌరితో భేటీలో కూడా అదే విషయాలు చెప్పానని స్పష్టం చేశారు.

యార్లగడ్డ వైపు వెళతారా? వంశీకి సపోర్ట్ చేస్తారా?

ఇక గత అసెంబ్లీ ఎన్నికల్లో గన్నవరంలో టీడీపీ నుంచి విజయం సాధించిన వల్లభనేని వంశీ.. ఆ తర్వాత వైసీపీకి మద్దతుగా మారారు. వంశీని మొదట్నుంచీ యార్లగడ్డ వెంకట్రావు, దుట్టా రామచంద్రరావు వ్యతిరేకిస్తూ వచ్చారు. వీరిద్దరు కూడా గతంలో వంశీపై వైసీపీ అభ్యర్థులుగా పోటీ చేసి ఓడినవారే. ఈ క్రమంలోనే ఇద్దరు వంశీకి వ్యతిరేకంగా కలిసికట్టుగా పనిచేశారు. అయితే కొంతకాలంగా వైసీపీ అధిష్టానం తీరుపై అసంతృప్తిగా ఉన్న యార్లగడ్డ వెంకట్రావు.. టీడీపీ గూటికి చేరాతే, దుట్టా రామచంద్రరావు మాత్రం వైసీపీలోనే ఉండిపోయారు. దుట్టా పార్టీ మారకుండా వైసీపీ పెద్దలు సామ వేద దండోపాయాలను ఉపయోగిస్తున్నారు. మరి యార్లగడ్డ వైపు వెళతారా? లేదా వైసీపీలో వంశీకి సపోర్ట్ చేస్తారా? అనేది వేచి చూడాల్సిందే.

#dutta-ramchandra-rao #ex-ycp-leader-yarlagadda-venkatrao #mla-vallabhaneni-vamsi #tdp #gannavaram #ycp
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe