Balapur Ganesh: తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి వేడుకలు ప్రారంభమైయ్యాయి. ఇప్పటికే మండపాల వద్దకు గణనాథులు చేరుకోగా.. మరికొన్ని చేరుకుంటున్నాయి. వినాయకుడి పాటలతో పల్లెలు, పట్టణాలు మోత మోగిపోతున్నాయి. ఏ గల్లీలో చూసిన వినాయకుడి విగ్రహాలే కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే హైదరాబాద్ మహానగరంలో వినాయక చవితి అనగానే ముందుగా గుర్తొచ్చేది ఖైరతాబాద్, బాలాపూర్ వినాయకులే. కాగా ప్రఖ్యాత గాంచిన ఖైరతాబాద్, బాలాపూర్ వినాయకులను చూసేందుకు పెద్ద ఎత్తున భక్తులు చేరుకుంటున్నారు.
బాలాపూర్ లడ్డూ వేలంలో కొత్త నిబంధనలు..
కాగా ఈసారి బాలాపూర్ లడ్డూ వేలంలో కొత్త నిబంధనలను బాలాపూర్ గణేశ్ కమిటీ ప్రవేశపెట్టింది. ప్రతీ ఏడాది బాలాపూర్ లడ్డు కొనుగోలు చేసుకోవాలి అని అనుకునే బయట వారు ముందుగా గత ఏడాది కొనుగోలు చేసిన డబ్బులను ముందుగా చెల్లించి వేలంలో పాల్గొనే వారు. కాగా ఈసారి ఈ పద్ధతిలో స్వల్ప మార్పులు చేసింది బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి. ఈ ఏడాది నుంచి స్థానికులు కూడా మునుపటి ఏడాది లడ్డూ విలువను ముందుగా చెల్లించి పేరు నమోదు చేసుకున్న తర్వాతే వేలంలో పాల్గొనేలా నిర్ణయం తీసుకుంది. కాగా.. గతేడాది బాలాపూర్ లడ్డూ రూ.27 లక్షల రూపాయలు పలికిన సంగతి తెలిసిందే.