Crime: పరాయి పురుషుడితో సన్నిహితంగా ఉంటుందనే అనుమానంతో భార్యను హతమార్చిన భర్తను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. అనుమానమే పెను భూతంగా మారి హత్యకు కారణంగా మారిందని మదనపల్లి డీఎస్పీ ప్రసాద్ రెడ్డి వెల్లడించారు. భార్య హత్య ను చేసిన కేసులో నిందితుడైన భర్తను మంగళవారం మదనపల్లె రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు డిఎస్పి ప్రసాద్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. పలమనేరు పట్టణానికి చెందిన గణపతి అలియాస్ వెంకటేష్ తొమ్మిదేళ్ల క్రితం పెనుమూరు కార్తికేయపురంకు చెందిన భారతి(26)ని వివాహం చేసుకొన్నాడు. వీరికి ఇద్దరుకుమారులు. గణపతి కూలి పనులు చేస్తుండగా భారతి పలమనేరులో పూలు అమ్ముతూ కుటుంబాన్ని పోషించుకునేవారు. ఈక్రమంలో చెడు వ్యసనాలకు బానిసైన గణపతి భార్యపై అనుమానం పెంచుకొని పలుమార్లు చిత్రహింసలు పెట్టేవాడు. భర్తతో భరించలేక భారతి ఏడాదిన్నర క్రితం నెల్లూరు పట్టణం కోవూరు వద్ద ఉన్నతల్లిదండ్రుల వద్దకు వెళ్లిపోయింది.
అక్కడ రవి అనే వ్యక్తితో సన్నిహితంగా ఉండేది. భార్యపైకక్ష పెంచుకున్న భర్త గణపతి ఎలాగైనా భార్యను అంతమొందించాలని పథకం పన్నాడు. ఈ నేపథ్యంలో జూన్ 27వ తేదీ బిడ్డలను ఇస్తానని భార్యకు ఫోన్ ద్వారా సమాచారం అందించి తన వద్దకు పిలిపించుకున్నాడు. బిడ్డల కోసం వచ్చిన భార్యని నమ్మించి నిమ్మనపల్లి మండలంలోని దివిటివారిపల్లె సమీపంలోని వ్యవసాయ పొలాల వద్దకు తీసుకెళ్లి తన వెంట తెచ్చుకున్న కత్తితో భార్య గొంతు కోసి హత్య చేశాడు. అదే సమయంలో పొలం వద్దకు వచ్చిన రామాంజులు సంఘటనను చూసి కేకలు వేయడంతో గణపతి అతనిపై కూడా దాడి చేసే గాయపరిచి పరారయ్యడు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు కోసం గాలింపుచేపట్టి మంగళవారం స్థానిక నిమ్మనపల్లి సర్కిల్ వద్ద గణపతిని అదుపులోకి తీసుకుని విచారించడంతో తానే భార్య భారతిని హత్య చేసినట్లు నేరం ఒప్పుకోవడంతో అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ తెలిపారు.