Gaddars Final Journey : ప్రజా గాయకుడు, వాగ్గేయకారుడు గద్దర్ భౌతిక కాయానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళి అర్పించారు. ఇందుకోసం కేసీఆర్ ప్రగతి భవన్ నుంచి ఆల్వాల్ లోని గద్దర్ ఇంటికి వెళ్లారు. ఆయన భౌతిక కాయానికి పుష్పాంజలి ఘటించారు. ఇక హైదరాబాద్‌లోని ఎల్బీస్టేడియం నుంచి ప్రారంభమైన గద్దర్ అంతిమయాత్ర ముగిసింది.
తొలుత గన్‌పార్క్‌కు (Gun Park) భౌతికకాయం తరలించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహం, అమరవీరుల స్థూపం నుంచి ట్యాంక్‌బండ్ మీదుగా అల్వాల్ వరకు అంతిమయాత్ర సాగింది.
తర్వాత గద్దర్ నివాసంలో కాసేపు పార్థివదేహం ఉంచిన తర్వాత మహాబోధి స్కూల్ గ్రౌండ్‌లో అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. గద్దర్ అంత్యక్రియలకు సీఎం కేసీఆర్ (CM KCR) హాజరై ఆయనకు నివాళులర్పించారు. అంతిమయాత్ర వెంట వేలాది మంది జనం తరలివచ్చారు.
ఎల్బీ స్టేడియంలో ప్రజాగాయకుడు గద్దర్ పార్థివదేహానికి మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇంద్రకరణ్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, టీబీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి, ఏపీ మంత్రి బొత్స సత్యనారాయాణ, సినీ నటులు మంచు మోహన్ బాబు, మనోజ్, పరుచూరి గోపాలకృష్ణ, కాంగ్రెస్ నేత వీహెచ్, బీజేపీ సీనియర్ నేత స్వామిగౌడ్, గాయని మధుప్రియ తదిరతులు నివాళుర్పించారు. ఆదివారం రాత్రి మంత్రి కేటీఆర్ (KTR), టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy) , జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో (Pawan Kalyan) పాటు మరికొంతమంది ప్రముఖులు నివాళులు అర్పించారు.
మరోవైపు గద్దర్ మృతితో తన సొంత స్వగ్రామం మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణంలో విషాదఛాయలు అలుముకున్నాయి. తూప్రాన్ పట్టణంలో గద్దర్ మృతికి సంతాపంగా స్వచ్ఛందంగా షాపులు మూసివేశారు. తెలంగాణ ఉద్యకారులు, గాయకులు, కళాకారులు తూప్రాన్లో ర్యాలీ నిర్వహించి గద్దర్‌కు నివాళులర్పించారు. ఉదయం నుంచే వ్యాపార సంస్థలు, విద్యా సంస్థలు స్వచ్ఛందంగా మూసివేశారు.
తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం ఏరూరు ప్రాంతానికి చెందిన సైకత శిల్పి మంచాల సనత్ కుమార్ తన సైకత శిల్పంతో గద్దర్‌కు ఘన నివాళులర్పించారు. సుమారు మూడు గంటల పాటు శ్రమించి గద్దర్ సైకత శిల్పానికి రూపునిచ్చారు. అనేక ప్రాంతాల్లో గద్దర్ తన గళాన్ని విప్పి ప్రజా చైతన్య కల్పించారని సనత్ కుమార్ తెలిపారు. ఆయన లేని లోటు పూడ్చలేనిది అన్నారు.
ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో గద్దర్ అంత్యక్రియలు చేయాలని నిర్ణయించడంపై యాంటి టెర్రరిజం ఫోరం(ATF) తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. నక్సలైట్ వ్యతిరేక పోరాటంలో అమరులైన పోలీసులు, పౌరుల త్యాగాలను అవమానించడమే అని మండిపడింది. ప్రజాస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా సాయిధ పోరాటాలు చేయడానికి తన సాహిత్యం ద్వారా యువతను దేశ ద్రోహులుగా తయారు చేసిన గద్దర్ లాంటి వ్యక్తికి అధికార లాంఛనాలతో అంత్యక్రియలను చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ప్రకటించింది.
Also Read: ప్రజాకవి గద్దర్ మృతిపై ప్రముఖుల సంతాపం.. ఎవరెవరు ఏమన్నారంటే?