Metro : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'మహాలక్ష్మీ పథకం'లో ఒకటైన ఆర్టీసీలో ఉచిత ప్రయాణం హైదరాబాద్ మెట్రోపై తీవ్ర ప్రభావం చూపుతోంది. గతంలో ట్రాఫిక్ సమస్య కారణంగా మెట్రోను ఎంచుకునే జనాలు ఇప్పుడంతా ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణిస్తున్నారు. మహిళలు ఫ్రీ టికెట్ కావడంతో భర్తలు, పిల్లలను కూడా తమ వెంట తీసుకెళ్తున్నారు. దీంతో గతేడాది దాదాపు 5 లక్షలకు పైగా ఉన్న మెట్రో ప్రయాణికుల సంఖ్య 5 శాతం తగ్గినట్లు మెట్రో అధికారులు వెల్లడించారు. అయితే ఆర్టీసీలో మాత్రం ప్రయాణిస్తున్న మహిళల సంఖ్య మాత్రం 12 లక్షలకు చేరడం విశేషం.
5 నుంచి 4 లక్షలకు పడిపోయింది..
ఈ మేరకు 2017లో మొదలైన మెట్రోలో క్రమంగా ప్రయాణికుల సంఖ్య పెరిగింది. మొదట్లో రెండు లక్షలకు పైగా ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరేవారు. మహిళా ఉద్యోగులు, కాలేజీ అమ్మాయిలు మెట్రో ట్రైన్ లోనే ప్రయాణం చేసేవారు. రోజుకు సగటున 5.10 లక్షల మంది మెట్రోలో ప్రయాణించగా.. గతేడాది నవంబర్ నెలలో ఒకే 5.47 లక్షల మంది ప్రయాణించినట్లు లెక్కలు వెల్లడించారు. అయితే డిసెంబర్ లో మహాలక్ష్మీ స్కీమ్ మొదలవగానే మెట్రోలో ప్రయాణించేవారి సంఖ్య క్రమంగా తగ్గిందని, రోజుకు 4.80 లక్షల మంది ప్రయాణిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: India: 2025 నాటికల్లా భారతీయులందరికీ కనీస వేతనాలు!
సిటీ బస్సుల్లో 12 లక్షలు..
ఇక మహాలక్ష్మీ పథకం ఎఫెక్టుతో సిటీ ఆర్టీసీ బస్సుల్లో భారీగా రద్దీ పెరిగింది. ప్రస్తుతం సిటీలో 2800 ఆర్టీసీ బస్సులు నడుస్తుండగా.. మెట్రో లగ్జరీ, మెట్రో డీలక్స్ బస్సులు పోను 2500 బస్సులు అందుబాటులో ఉంటున్నాయి. అయితే మహాలక్ష్మి స్కీమ్ కు ముందు ప్రతి రోజు సగటున 15 లక్షల మంది ప్రయాణించగా.. ఇప్పుడు ఆ సంఖ్య 21 లక్షలకు చేరినట్లు తెలిపారు. ఇందులో 12 లక్షల మంది జీరో టికెట్ ద్వారానే ప్రయాణించిచడం విశేషం.