దీపావళికి తమ యజమాని బోనస్ డబ్బులు ఇవ్వలేదనే కోపంతో దారుణానికి పాల్పడ్డారు ఇద్దరు ధాబా వర్కర్లు. పండగపూట పైసలు ఇస్తానని చెప్పిన సదరు ఓనర్ మాటతప్పాడనే ఆవేశంలో ఘోరంగా హతమార్చారు. రాత్రి తిని పడుకున్న ఓనర్ ధేంగ్రే మెడకు తాడును బిగించి, తలపై బండరాయితో కొట్టడంతోపాటు ఆయుధాలతో అతడి ముఖాన్ని ఎవరూ గుర్తించకుండా ఛిద్రం చేసి చంపేశారు.
ఈ దారుణమైన ఘటన మహారాష్ట్రలోని నాగ్‌పుర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కుహి ఫటా సమీపంలోని ధాబాలో శనివారం తెల్లవారు జామున జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ మేరకు నిందితులిద్దరూ మధ్యప్రదేశ్‌లోని మండ్లాకు చెందిన ఛోటు, ఆదిగా గుర్తించినట్లు తెలిపారు. ‘దాదాపు నెల రోజుల క్రితమే మధ్యప్రదేశ్‌లోని ఓ లేబర్ కాంట్రాక్టర్ ద్వారా వీరిద్దరినీ రాజు ధెంగ్రే అనే మాజీ సర్పంచ్ తన ధాబాలో చేర్చుకున్నారు. ఈ క్రమంలోనే యజమానితో కలిసి భోజనం చేస్తున్నప్పుడూ నిందితులిద్దరూ దీపావళి బోనస్ కావాలని అడిగారు. దీంతో ప్రస్తుతం తన దగ్గర లేవని మరోరోజు రోజు డబ్బులు ఇస్తానని ధెంగ్రే వాళ్లకు నచ్చచెప్పేందుకు ప్రయత్నించినట్లు సమాచారం. కానీ తాము అడిగిన వెంటనే యజమాని డబ్బులు ఇవ్వలేదన్న అక్కసుతో అతన్ని హతమార్చేందుకు ప్లాన్ చేశారు. అదేరోజు రాత్రి తిని పడుకున్న ధెంగ్రే నిద్రలోకి జారుకోగానే మెడకు తాడును బిగించి, తలపై బండరాయితో కొట్టడంతో పాటు ఆయుధాలతో అతడి ముఖాన్ని ఎవరూ గుర్తించకుండా ఛిద్రం చేసి చంపేశారు’ అని పోలీసులు వెల్లడించారు.
Also read :Army helicopter: సముద్రంలో కుప్పకూలిన హెలికాఫ్టర్..ఐదుగురు సైనికులు మృతి
ఈ క్రమంలోనే ధెంగ్రే కూతురు తన తండ్రికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు. దీంతో వెంటనే ధాబా పక్కనే వున్న పాన్ దుకాణం వ్యక్తికి ఫోన్ చేసింది. అతడు అక్కడికెళ్లి చూసేసరికి ధెంగ్రే రక్తపుమడుగులో కనిపించగా వెంటనే కూతురికి అందించినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఈ ఘాతుకానికి పాల్పడిన తర్వాత ధెంగ్రే మృతదేహాన్ని ఓ బొంతలో కప్పి అతడి కారులోనే అక్కడినుంచి పరారైన నిందితులు.. విహార్ గావ్ సమీపంలోని నాగ్‌పుర్-ఉమ్రెడ్ రహదారిపై వేగంగా వేళ్తూ డివైడర్‌ను ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డారు. అనంతరం కారు దిగి దిఘోరి వైపు పారిపోతున్నట్లు సీసీటీవీ ఫుటేజీలో రికార్డ్ అయింది. ఇక ఈ దారుణానికి బోనస్ డబ్బులే కారణమా? లేక మాజీ సర్పంచ్ అయిన ధాబా యజమాని ధెంగ్రేను హతమార్చడంలో రాజకీయ కోణం ఏదైనా ఉందా? అనే కోణంలో కేసును పరిశీలిస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు.