రెండు తెలుగు రాష్ట్రాలపై చలిపులి పంజా విసురుతుంది. ఉష్ణోగ్రతలు రోజురోజుకు అంతకంతకు పడిపోతున్నాయి. ఉదయం 10 గంటలు అయినా చలి ప్రభావం తగ్గడం లేదు. దట్టమైన పొగమంచు వల్ల ఎదురుగా ఉన్న వాహనాలే కాదు..మనుషులు కూడా కనిపించడం లేదు. దీంతో రోడ్ల పై రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
ఉదయం 10 గంటలకు కూడా వాహనాల లైట్లు వేసుకుని తిరుగుతున్నాయి. మరికొన్ని చోట్ల రోడ్లు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ పొగమంచు ప్రభావం విమానాల మీద కూడా పడింది. శంషాబాద్ విమానాశ్రయంలో దట్టమైన పొగమంచు కమ్ముకోవడం వల్ల పైలెట్లకు రన్ వే కనిపించడం లేదు.
దీంతో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అధికారులు చర్యలు చేపట్టారు. ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు విమానాలను విమానాశ్రయంలోనే నిలిపివేశారు. ఆ మూడు గంటల సమయంలోనే సుమారు 35 జాతీయ, అంతర్జాతీయ విమానాలను దారి మళ్లించారు. దారి మళ్లిన విమానాలను విజయవాడ, బెంగళూరు, ముంబై, నాగ్‌పూర్ సిటీలకు పంపారు.
ఉదయం 8.30 గంటలకు హైదరాబాద్ చేరుకోవాల్సిన గోవా, తిరువనంతపురం, చండీగఢ్ విమానాలను విజయవవాడ గన్నవరం విమానాశ్రయానికి పంపించారు. పొగమంచు కమ్ముకోవడంతో ఉదయం 9 గంటల తరువాత సర్వీసులు ప్రారంభించారని అధికారులు వివరించారు. దారి మళ్లించిన విమానాలు తిరిగి హైదరాబాద్‌కు చేరుకున్నాయి. అయితే పొగమంచు కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడ్డారు.
Also read: రహా కపూర్ డాటర్ ఆఫ్ అలియా రణబీర్ కపూర్..మొదటి సారి మీడియా ముందుకు!