బంగ్లాదేశ్లో (Bangladesh) ఘోర రైలు ప్రమాదం (train accident)సంభవించింది. ప్రయాణికులతో వెళ్తున్న రైలుకు నిప్పంటుకుంది. ఈ ఘటనలో ఇప్పటివరకు ఐదుగురు మరణించినట్లు అధికారులు తెలిపారు. బంగ్లాదేశ్ లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ కు ముందు జరిగిన ఈ ఘటన దుండగుల దుశ్చర్యగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ దేశ రాజధాని ఢాకా నుంచి జెస్సోరేకు వెళ్తున్న బెనాపోలే ఎక్స్ ప్రెస్ రైల్లో మంటలు చెలరేగి...నాలుగు బోగీలు పూర్తిగా కాలిపోయాయని ఫైర్ సిబ్బంది తెలిపారు. దగ్దమైన బోగీల నుంచి ఐదుడెడ్ బాడీలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.
ఇక ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం..రైలు పాత ఢాకా నగరం సమీపంలోని మెగా సిటీ ప్రధాన రైల్వే స్టేషన్ గోపీబాగ్ దగ్గర ఈ ప్రమాదం జరిగింది. అయితే మంటలు అంటుకున్న రైలు నుంచి వందల మందిని రక్షించినట్లు స్థానిక టీవీ ఛానెల్ సొమయ్ వెల్లడించింది. తాము చాలామందిని రక్షించామని ..మంటలు వేగంగా వ్యాపించాయని తెలిపారు. ఈ రైల్లో కొంతమంది భారతీయ పౌరులు కూడా ఉన్నట్లు ఆ టెలివిజన్ పేర్కొంది.
ఈ ప్రమాదాన్ని కుట్రగా అనుమానిస్తున్నామని పోలీస్ చీఫ్ అన్వర్ హుస్సైన్ తెలిపారు. కానీ ఎలాంటి వివరాలను వెల్లడించలేదు. గత నెలలోనూ ఇక్కడ ఇలాంటి ప్రమాదం జరిగింది. రైల్లో మంటలు చెలరేగి నలుగురు సజీవదహనం అయ్యారు. ప్రతిపక్ష బంగ్లాదేశ్ నేషనల్ పార్టీయే ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు పోలీసులు, ప్రభుత్వం ఆరోపించింది. అయితే బీఎన్పీ మాత్రం ఈ ఆరోపణలను ఖండించింది. ఇదంతా ప్రతిపక్షాలను విచ్చిన్నం చేసేందుకు సర్కార్ చేస్తున్న తప్పుడు ప్రచారం అంటూ మండిపడింది.
కాగా బంగ్లాదేశ్ లో ఆదివారం ఎన్నికలు జరగనుండగా ప్రధాన ప్రతిపక్షం బీఎన్పీ సహా పలు పార్టీలు వీటిని బహిష్కరించాయి. అయితే బూటకపు ఎన్నికలంటూ ఆరోపించాయి. ప్రధాని షేక్ షసీనా రాజీనామా కోరుతూ ప్రతిపక్షపార్టీలకు చెందిన వేలాది మంది గతేడాది డిసెంబర్ లో వీధుల్లోకి వచ్చి ఆందోళన చేపట్టారు.