Fire Accident in Vijayawada TVS Showroom: ఏపీలోని ఎన్టీఆర్ జిల్లాలో టీవీఎస్ షోరూంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గురువారం తెల్లవారు జామున ఈ భారీ ప్రమాదం చోటు చేసుకుంది. కేపీనగర్ ప్రాంతంలో టీవీఎస్ షోరూంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు చాలా వేగంగా వ్యాప్తి చెందడంతో షోరూమ్‌లో ఉన్న బైక్ లతో పాటు గోదాంలో ఉన్న సుమారు 300 బైక్ ల వరకు బూడిద పాలు అయ్యాయి.
ఈ అగ్ని ప్రమాదం షార్ట్ సర్క్యూట్ కారణంగానే జరిగినట్లు ప్రాథమికంగా నిర్థారించారు. నిమిషాల వ్యవధిలోనే మంటలు షోరూమ్ నుంచి గోడౌన్ కు విస్తరించాయి. అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది ఫైర్ స్టేషన్ కు సమాచారం ఇచ్చారు. వెంటనే సంఘటనా స్థలానికి 3 ఫైరింజన్లు చేరుకున్నాయి.
మంటలను అదుపులోనికి తెచ్చేందుకు అగ్నిమాపక అధికారులు ప్రయత్నిస్తున్నారు. షోరూం ప్రీ ఫ్యాబ్రికేటెడ్ కావడంతో మంటలు వేగంగా విస్తరించినట్లు అగ్నిమాపక సిబ్బంది చెబుతున్నారు. ఈ టీవీఎస్ షోరూం స్టెల్లా కాలేజీకి సమీపంలో ఉంది.
ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన టీవీఎస్ వాహనాలకు ఇదే హెడ్ ఆఫీస్ కావడంతో గోడౌన్ లో కొన్ని వందల సంఖ్యలో వాహనాలు ఉన్నాయి. బైక్ షోరూంతో పాటు సర్వీస్ సెంటర్ కూడా ఇక్కడే ఉంది.
దీంతో ప్రమాదం భారీ స్థాయిలో జరగడంతో వందల సంఖ్యలో బైక్ లు అగ్నికి ఆహుతి అయ్యాయి. గోడౌన్ లో టూ వీలర్లతో పాటు ఎలక్ట్రిక్ వాహనాలు కూడా పెద్ద సంఖ్యలో ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించడంతో ఈ భారీ ఆస్తి నష్టం జరిగినట్లు అధికారులు గుర్తించారు.
ఎలక్ట్రిక్ వాహనాలతో పాటు..గోడౌన్ లో పెట్రోల్ వాహనాలు కూడా ఉంచడంతో పాటు ఎలక్ట్రిక్ వాహనాలకు ఛార్జింగ్ పెట్టడం వల్ల ప్రమాదం జరిగి ఉండొచ్చేనే అనుమానాలు ఉన్నాయి. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Also Read: అర్హులైన వారికి సంక్షేమ పథకాలు..బటన్ నొక్కి విడుదల చేయనున్న జగన్!