హైదరాబాద్ నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని బజార్ ఘాట్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కెమికల్ గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. నాలుగు అంతస్తుల వరకు మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో ఏడుగురు కార్మికులు మృతి చెందారు. మరికొందరికి గాయాలైనట్లు తెలుస్తోంది. సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు. అయితే మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందడం కలకలం రేపుతోంది. అందులో 4 రోజుల శిశువు కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. భవనంలోని గ్రౌండ్‌ఫ్లోర్‌లో ఓ గ్యారేజ్ ఉంది. అయితే అందులో కారు రిపేర్ చేస్తుండగా ఒక్కసారిగా మంటలు వచ్చాయి. అక్కడే డీజిల్, కెమికల్ డ్రమ్ములు ఉన్నాయి. దీంతో వాటికి అంటుకోవడంతో పెద్దఎత్తున మంటలు చెలరేగాయి . ప్రస్తుతం గ్యారేజ్‌లోని మిగిలిన కెమికల్ డబ్బాలను అగ్నిమాపక సిబ్బంది బయటకు తీసుకొచ్చారు. ప్రమాదంతో గ్యారేజ్‌లో ఉన్న పలు వాహనాలు దగ్ధమైపోయాయి. ఇక ఈ ఘటనలో 21 మంది అస్వస్థతకు గురికాగా వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Also Read: మొత్తం 3.26 కోట్ల ఓట్లు.. 10 లక్షల కొత్త ఓటర్లు.. లేటెస్ట్ లెక్కలివే!
ఇదిలా ఉండగా.. హైదరాబాద్‌లోని మరో రెండు ప్రాంతాల్లో కూడా అగ్ని ప్రమాదాలు జరిగాయి. అమీర్‌పేట్ పరిధిలో ఒక అగ్నిప్రమాదం చోటు చేసుకోగా.. పాతబస్తీ పరిధిలోని షాలిబండలో మరొకటి జరిగింది. అమీర్‌పేట పరిధిలోని మధురానగర్‌లోని ఓ ఫర్నిచర్ గోదాంలో మంటలు ఎగసిపడటంతో లక్షల విలువైన ఫర్నిచర్ దగ్ధమైనట్లు తెలుస్తోంది. ఇక షాలిబండలో ప్రాంతంలోని బజాజ్ ఎలక్ట్రానిక్స్ దుకాణంలో భారీగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను ఆర్పుతున్నారు.