హైదరాబాద్ నగరాన్ని అగ్ని ప్రమాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఇప్పటికే చాలా ప్రమాదాలు జరిగి ప్రజలను భయబ్రాంతులకు గురి చేశాయి. తాజాగా బుధవారం ఉదయం మరో రెండు అగ్ని ప్రమాదాలు కలకలం రేపాయి. హబ్సిగూడలో ఒకటి, అత్తాపూర్ లో జరిగిన ఈ అగ్ని ప్రమాదాల్లో మంటలు తీవ్రస్థాయిలో ఎగిసిపడ్డాయి.
హబ్సిగూడలోని అన్ లిమిటెడ్ షోరూంలో అగ్ని ప్రమాదం జరిగింది. మంగళవారం అర్థరాత్రి దాటిన తరువాత ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అన్ లిమిటెడ్ షోరూం ని మూడు ఫైర్ ఇంజన్లతో మంటలు ఆర్పడంతో మంటలు అదుపులోనికి వచ్చింది.
ఉప్పల్- సికింద్రాబాద్ ప్రధాన రహదారి కావడంతో పొగతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అగ్ని ప్రమాదం జరిగిన ప్రదేశానికి పక్కనే పెట్రోల్ బంక్ ఉండడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
ఇదిలా ఉంటే అత్తాపూర్ హసన్ నగర్ లో మరో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ప్రముఖ బట్టల గోదాంలో మంటలు చెలరేగాయి. దీంతో ఒక్కసారిగా ఆ ప్రాంతమంతా దట్టమైన పొగతో నిండిపోయింది. దాంతో స్థానికులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. రెండు ఫ్లోర్లలో చెలరేగిన మంటలను అగ్ని మాపక సిబ్బంది ఆర్పుతున్నారు.
అగ్ని ప్రమాదం జరగకుండా అధికారులు చర్యలు చేపట్టారు. చుట్టుపక్కల ఉన్న ఇళ్లకు మంటలు వ్యాపించకుండా చర్యలు చేపట్టారు. ఈ ఘటనలకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.