Gold Loans: ప్రభుత్వ రంగ బ్యాంకులు తమ గోల్డ్ లోన్ పుస్తకాలను సమీక్షించాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ వారం కోరింది. ఎకనామిక్ టైమ్స్ లో వచ్చిన ఒక కథనం ప్రకారం.. బంగారం ధర పెరిగిన తరువాత, లెండర్స్ (లోన్స్ ఇచ్చే కంపెనీలు/బ్యాంకులు) అప్పటికే ఉన్న రుణాలపై టాప్-అప్ లోన్స్ ఇవ్వడం ప్రారంభించారు. ఆర్థిక మంత్రిత్వ శాఖలోని ఆర్థిక సేవల విభాగం (DFS) అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రతి గోల్డ్ లోన్ ఖాతాను సమీక్షించాలని, కొలేటరల్ అంటే తాకట్టులో ఉన్న బంగారాన్ని స్థూల అంచనా తిరిగి వేయాలని, వసూళ్ల ఛార్జీలను సమీక్షించాలని అలాగే జనవరి 1, 2022 నుండి ఇచ్చిన లోన్స్ (Gold Loans)అన్నింటినీ పరిశీలించాలని కోరింది. ఫిబ్రవరి 27న ఒక లేఖ పంపడం ద్వారా బ్యాంకులకు డీఎఫ్‌ఎస్ ఈ ఉత్తర్వులు ఇచ్చింది.
రెండు ప్రభుత్వ బ్యాంకుల్లో రుణ ప్రక్రియలో అక్రమాలు..
జాతీయ మీడియా కథనాల ప్రకారం రెండు పెద్ద ప్రభుత్వ బ్యాంకులు గోల్డ్ లోన్ (Gold Loans)ప్రక్రియలో తీవ్ర అవకతవకలకు పాల్పడ్డాయి. కొన్ని సందర్భాల్లో 18 క్యారెట్ల బంగారు ఆభరణాలను 22 క్యారెట్‌లుగా రికార్డుల్లో చూపించడం ద్వారా లోన్స్ ఇచ్చినట్టు తెలుస్తోంది. బంగారం విలువను పెంచడం ద్వారా మరిన్ని గోల్డ్ లోన్స్ (Gold Loans)ఇచ్చే ప్రయత్నంలో ఇది జరిగింది. అయితే ఈ విషయంపై ఆర్థిక శాఖ నుంచి ఎలాంటి అధికారిక సమాచారం వెలువడలేదు.
Also Read: పదిరోజుల్లో 3 వేలకు పైగా పెరిగిన బంగారం ధర.. ఇప్పుడేం చేయాలి?
బంగారం రుణాలు 17% పెరిగాయి..
ఏడాది ప్రాతిపదికన బంగారం రుణాలు(Gold Loans) 17% పెరిగాయి. కాగా, బంగారం ధరలో 16.6% పెరుగుదల కనిపించింది. జనవరి 26 నాటికి, బంగారు ఆభరణాలపై రుణాలు ₹1,01,934 కోట్లుగా ఉన్నాయి. అదే సమయంలో మార్చి 7న తొలిసారిగా 10 గ్రాముల బంగారం రూ.65 వేలు దాటింది.
ఐఐఎఫ్‌ఎల్ కొత్త గోల్డ్ లోన్స్ ఇవ్వకుండా ఆర్బీఐ చర్యలు..
ఐఐఎఫ్ఎల్ గోల్డ్ లోన్ (Gold Loans)పోర్ట్‌ఫోలియోలో అనేక అవకతవకలు వెలుగుచూశాయి. గత కొన్ని నెలలుగా, సెంట్రల్ బ్యాంక్ ఈ లోపాల గురించి కంపెనీ సీనియర్ మేనేజ్‌మెంట్, ఆడిటర్‌లతో చర్చిస్తోందనీ, అయితే ఇప్పటి వరకు అర్ధవంతమైన దిద్దుబాటు చర్యలు సంస్థ తీసుకోలేదనీ RBI చెప్పింది. అటువంటి పరిస్థితిలో, వినియోగదారుల మొత్తం ప్రయోజనాల దృష్ట్యా ఈ పరిమితి అవసర అని పేర్కొంది. .
IIFL గోల్డ్ లోన్ పోర్ట్‌ఫోలియోలో 4 ప్రధాన లోపాలు..
- రుణం మంజూరయ్యే సమయంలో బంగారం స్వచ్ఛత, బరువును తనిఖీ చేయడంలో అక్రమాలు జరిగాయి, వేలంలో డిఫాల్ట్‌గా ఉంది.
- రుణం-విలువ నిష్పత్తి కూడా ఉల్లంఘించడం జరుగుతోంది. అంటే పరిమితికి మించి రుణాలు అందజేసారు.
- నగదు రూపంలో రుణాల చెల్లింపు - వసూలుపై కూడా కంపెనీ పరిమితిని ఉల్లంఘిస్తోంది.
- కస్టమర్ల ఖాతాలపై విధించే ఛార్జీలు తదితరాల్లో పారదర్శకత లోపించినట్లు ఆర్‌బీఐ గుర్తించింది.