Alluri Sitaramajaru Movie: ఒక సినిమా ప్రారంభం ఇద్దరు హేమాహేమీల మధ్య గొడవలు రేపింది. అదే సినిమా విడుదలైన తరువాత ఆ ఇద్దరినీ మళ్ళీ దగ్గరకు చేర్చింది. ఓ విప్లవ వీరుడి కథతో వచ్చిన సినిమా తెలుగు సినిమా తెరపై చెరగని చరిత్ర సృష్టించింది. ఆ సినిమా ఒక నటుడ్ని నటశేఖరుడిని చేసింది.. డేరింగ్ & డాషింగ్ హీరోగా నిలబెట్టింది. ఒకే ఒక్క సినిమా జాతీయస్థాయిలో మహాకవి శ్రీశ్రీకి అవార్డు తెచ్చిపెట్టింది. ఐదు దశాబ్దాలు గడిచినా ఇంకా ఆ సినిమా ఇప్పటికీ ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయింది. భారత స్వాతంత్ర పోరాట చరిత్రలో ప్రత్యేక అధ్యయనాన్ని సృష్టించుకున్న అల్లూరి సీతారామరాజుని చలన చిత్ర రూపంలో ప్రత్యేకంగా ప్రజలు హృదయాల్లో ప్రతిష్టించింది ఆ సినిమా.
అవును.. అల్లూరి సీతారామరాజు(Alluri Sitaramajaru Movie).. విప్లవాగ్ని.. బ్రిటిష్ వారి గుండెల్లో మంటలు రేపి.. స్వతంత్ర పోరాటంలో జీవితాన్ని త్యాగం చేసిన వీరుడు. ఆ మహావీరుని కథకు దృశ్యరూపం ఇస్తూ కృష్ణ తెలుగు ప్రేక్షకులకు ఇచ్చిన అపురూపమైన కానుక అల్లూరి సీతారామరాజు సినిమా స్కోప్ రంగుల చిత్రం. అల్లూరి అంటే ఇలానే ఉంటాడు అనేలా ఆహార్యం.. బ్రిటిష్ పాలకులను ఇదేవిధంగా ఎదిరించాడు అని చూపించిన అల్లూరి(Alluri Sitaramajaru Movie) సాహసం.. సినిమా చూస్తున్న ప్రతి ప్రేక్షకుడి మదిలో విప్లవాగ్ని సృష్టించిన మాటలు.. వినగానే విప్లవ శంఖం పూరించాలనేంత ఊపు తెప్పించిన పాటలు.. ఒక్కటేమిటి అల్లూరి సీతారామరాజు సినిమా అంతా ఎక్కడా పేరు పెట్టలేని అద్భుత నైపుణ్యం కనిపిస్తుంది. ఈ సినిమా విడుదలై సరిగ్గా 50 ఏళ్ళు(1974, మే 1) అయింది. ఇప్పటికీ అల్లూరి సీతారామరాజును తలుచుకుంటే ఠక్కున ఈ సినిమా గుర్తువస్తుంది. ఈ తరం వారికి కూడా అల్లూరి చరిత్రను చెక్కుచెదరకుండా అందించిన ఘట్టమనేని కృష్ట ఈ సినిమాతో డేరింగ్ హీరోగా మారిపోయారు. అల్లూరి సీతారామరాజు(Alluri Sitaramajaru Movie) సినిమా గురించి కొన్ని ప్రత్యేక విశేషాలు మీకోసం!
ఇద్దరు మహామహుల మధ్య గొడవ..
అల్లూరి సీతారామరాజు సినిమా చేయాలని ఎన్టీఆర్ కోరిక. అయితే, ఎన్ఠీఆర్, కృష్ణ కల్సి నటించిన దేవుడు చేసిన మనుషులు సినిమా శతదినోత్సవ వేడుకల ఆహ్వాన పత్రికలో అల్లూరి సీతారామరాజు(Alluri Sitaramajaru Movie) సినిమా తాను తీస్తున్నట్టు ప్రకటించారు హీరో కృష్ణ. ఎన్టీఆర్ తానూ చేయాలనుకుంటున్న పాత్ర అది అని చెబుతూ ఈ సినిమా చేయవద్దని కృష్ణను కోరారు. కానీ, కృష్ణ వెనక్కి తగ్గలేదు. సినిమా షూటింగ్ స్టార్ట్ చేశేశారు. దీంతో ఎన్టీఆర్ కి కోపం వచ్చింది. కృష్ణ-ఎన్టీఆర్ మధ్య దూరం పెరిగింది. ఇది కృష్ణకు 100వ సినిమా. దీంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని తెరకెక్కించారు. తెలుగులో మొట్టమొదటి సినిమాస్కోప్ టెక్నాలజీతో వచ్చిన మూవీ ఇది. ఈ సినిమా విడుదల తరువాత కృష్ణపై ఎంతో కోపం తెచ్చుకున్న ఎన్టీఆర్ స్వయంగా అభినందనలు చెప్పి.. కృష్ణను పొగడ్తలతో ముంచేశారు. తరువాత ఇద్దరి మధ్య మరింతగా స్నేహబంధం కొనసాగింది.
ఎస్వీఆర్ స్థానంలో బాలయ్య..
ఈ సినిమాలో ప్రతి పాత్రకు నటులను ఆచి తూచి ఎన్నుకున్నారు. ముఖ్యమైన అగ్గిరాజు పాత్రకు ముందు ఎస్వీఆర్ అనుకున్నారు. కానీ, కొన్ని కారణాల వాళ్ళ ఆయన అందుబాటులో లేకపోవడంతో బాలయ్యతో ఆ పాత్ర వేయించారు. సినిమాలో బాలయ్య నటన అందరితోనూ చప్పట్లు కొట్టించింది. ఇక గంటం దోరగా గుమ్మడి.. బ్రిటీషర్ల తొత్తులుగా అల్లు రామలింగయ్య, సాక్షి రంగారావు, పిళ్ళై గా కేవీ చలం.. మల్లు దోరగా ప్రభాకర రెడ్డి, పడాల్ గా కాంతారావు, ఎస్సై గా రాజబాబు ఎవరికి వారు.. ఈ సినిమా(Alluri Sitaramajaru Movie)లోని పాత్రల కోసమే నటులయ్యారా అనేవిధంగా చేశారు. ఇంతమందిని చెప్పాకా.. అసలు వ్యక్తి గురించి చెప్పాల్సిందే. వీరంతా ఒక ఎత్తయితే.. అల్లూరి సీతారామరాజు పాత్రలో కృష్ణ ఒక పక్క.. ఆయనను పట్టుకోవాలి లేదా కాల్చి చంపాలి అని చూసే బ్రిటిష్ అధికారి రూథర్ ఫర్డ్ పాత్రలో మరో పక్క కొంగర జగ్గయ్య. ఈయన చేసిన మ్యాజిక్ అంతా ఇంతా కాదు. సినిమా చూసేవారు నిజంగా సీతారామరాజు.. రూథర్ ఫర్డ్ ఎదురెదురుగా ఉన్నారా? అనేంతగా మాయ చేశారు జగ్గయ్య. తనదైన డైలాగ్ డెలివరీతో రూథర్ ఫర్డ్ పాత్రకి జీవం పోశారు.
Also Read: ఇసుక ఉంటే ఆ సినిమానే అయిపోతుందా..కల్కి సినిమా కాపీపై దర్శకుడు క్లారిటీ
వస్తాడు నారాజు ఈరోజు..
ఇక అల్లూరి సీతారామరాజు(Alluri Sitaramajaru Movie) కథ విషయంలో కొంత కన్ఫ్యూజన్ ఉన్నప్పటికీ, సినిమాటిక్ లిబర్టీ పేరుతో రామరాజు అనే యోధునికి సీత అనే యువతితో ప్రేమాయణం నడిచినట్టు కన్విన్సింగ్ గా చూపించి.. సీతారామరాజుగా పేరు ఎలా మారింది అనే విషయాన్ని ప్రేక్షకులకు హృద్యంగా చెప్పారు. సీత పాత్రలో విజయనిర్మల వస్తాడు నారాజు ఈరోజు అంటూ చేసిన నటనతో ప్రేక్షకులు ఫిదా అయిపోయారు.
జాతీయ స్థాయిలో అవార్డు..
మహాకవి శ్రీశ్రీ ఈ సినిమాలో పాటలు రాశారు. సినిమాలో అన్నిపాటలూ విప్లవ ఫిరంగుల్లా పేలాయి. ముఖ్యంగా తెలుగు వీర లేవరా అంటూ శ్రీశ్రీ రాసిన పదాలకు అప్పట్లో యువత ఉర్రూతలూగిపోయారు. ఆ సౌండ్ జాతీయస్థాయిలో ప్రతిధ్వనించింది. శ్రీశ్రీకి అవార్డు తెచ్చిపెట్టింది.
ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో విశేషాలు.. మరెన్నో సంచలనాలు అల్లూరి సీతారామరాజు(Alluri Sitaramajaru Movie) సినిమాలో. అల్లూరి జీవితాన్ని ప్రజల ముందు స్వచ్ఛంగా పరిచింది ఈ సినిమా. అడుగడుగునా కృష్ణ తపన కనపడుతుంది ఈ సినిమాలో. అంతెందుకు.. ఇప్పటివరకూ చాలా మంది నటులు (ఎన్టీఆర్ తో సహా) అల్లూరి పాత్రలో కొన్ని సినిమాల్లో కనిపించారు. కానీ, ఈ సినిమా కథతో మళ్ళీ ఎవరూ సినిమా తీయడానికి సాహసించలేదు. ఎందుకంటే, అల్లూరి సీతారామరాజు అనగానే కృష్ణ మాత్రమే గుర్తుకువచ్చేలా చేసింది ఈ సినిమా.
భరతమాత బానిస సంకెళ్లను తెంచడం కోసం తనదైన విప్లవ బాటలో సాగి.. బ్రిటీషర్లకు కంటిమీద నిద్రలేకుండా చేసిన మహనీయుడు అల్లూరి సీతారామరాజు(Alluri Sitaramajaru Movie)కు అపూర్వ నీరాజనం ఈ సినిమా. ఇది ఇప్పుడు సన్ నెక్స్ట్ ఓటీటీలో అందుబాటులో ఉంది. అలానే యూట్యూబ్ లో కూడా వెతికితే దొరకొచ్చు. తప్పనిసరిగా చూడాల్సిన సినిమా. ఈ తరం వారికి చూపించాల్సిన సినిమా. ఈ సినిమాకి ఆదినారాయణ రావు సంగీతం అందించారు. త్రిపురనేని మాటలు రాశారు. దర్శకత్వం వహించింది వి.రామచంద్రరావు. పద్మాలయ బేనర్ పై కృష్ణ సొంతంగా ఈ సినిమా నిర్మించారు. అంతేకాదు.. సినిమాలో కొన్ని సీన్స్ కృష్ణ దర్శకత్వంలోనే తీశారని చెప్పుకుంటారు.