మహారాష్ట్రలోని థానేలో ఘోర ప్రమాదం జరిగింది. షాపూర్ సమీపంలో గిర్డర్ లాంచింగ్ మెషిన్ కుప్పకూలడంతో 15 మంది మరణించారు. ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. సమృద్ధి ఎక్స్‌ప్రెస్ హైవే మూడో దశ నిర్మాణంలో ఉందని షాపూర్ పోలీసులు తెలిపారు. వంతెనను సిద్ధం చేసేందుకు యంత్రాన్ని ఉపయోగిస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు చెబుతున్నారు. గిర్డర్ యంత్రం 100అడుగుల ఎత్తు నుంచి కిందపడటంతో ఈ ఘోరం జరిగింది.
అయితే ఇంకొంత మంది కార్మికులు ఆ యంత్రం కిందే ఉన్నారని అనుమానిస్తున్నారు. ఘటనాస్థలంలో సెర్చ్ అండ్ రెస్య్కూ ఆపరేషన్ కొనసాగుతోంది. సమృద్ధి హైవేపై లాంచర్ పడిపోవడంతో కార్మికులు, ఇతర వ్యక్తులు గాయపడ్డారని ఎస్పీ తెలిపారు. గాయపడిని ముగ్గురిని షాపూర్ తాలుకాలోని ఆసుపత్రిలో చేర్పించినట్లు వెల్లడించారు.
సోమవారం అర్థరాత్రి వంతెన పనులు జరుగుతుండగా ఈ ప్రమాదం జరిగిందని ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు. ఎలాంటి భద్రతా చర్యలు చేపట్టకపోవడంతోను కూలీలు ప్రాణాలు కోల్పోయారని వాపోతున్నారు. గిర్డర్ యంత్రాన్ని అనుసంధానించే క్రేన్ స్లాబ్ 100 అడుగుల ఎత్తు నుంచి కిందపడిపోయింది. ఇప్పటి వరకు 15మంది మృతదేహాలను వెలికితీశారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.