రాష్ట్రంలో నాసిరకం విత్తనాలతో అన్నదాతలకు అవస్ధలు తప్పడం లేదు. తక్కువ ధర, అధిక దిగుబడి, త్వరగా పంట చేతికొస్తుందని నమ్మించి కొందరు వ్యాపారులు రైతులను నట్టేట ముంచుతున్నారు. నిజామాబాద్ జిల్లాలో పత్తి, మిర్చి, మొక్కజొన్న తదితర పంటలు ప్రధానంగా సాగవుతాయి. దీనిని ఆసరా చేసుకొని నకిలీ వ్యాపారులు ఈ పంటలకు సంబంధించిన నకిలీ విత్తనాలను విచ్చలవిడిగా అమ్ముతున్నారు. కొంత మంది వ్యాపారులు ఏజెంట్లను పెట్టుకొని మరీ నేరుగా గ్రామాల్లోకి విత్తనాలను పంపి అమ్ముతున్నారు.
దళారులతో దందా..
నకిలీ విత్తనాలు ఎక్కువగా ఇతర రాష్ట్రాల నుండి దిగుమతి చేసుకుని రహస్య ప్రదేశాల్లో నిల్వ చేస్తున్నారు. దళారులు రైతులకు మాయమాటలు చెప్పి వీటిని విక్రయిస్తున్నారు. పొరుగు రాష్ట్రాల నుంచి నకిలీ విత్తనాలు ఎక్కువ శాతం రైళ్ల ద్వారా రవాణా అవుతున్నట్టు సమాచారం. మార్కెట్‌లో పేరున్న కంపెనీల ప్యాకెట్లు తయారు చేయించి, వాటిపై లేబుళ్లు, ధర, క్రమ సంఖ్య, గడవు తేదీతో పాటుగా క్యూఆర్ కోడ్ కూడా ముద్రిస్తున్నారు.
కేవలం చట్టాలే.. కనిపించని కార్యాచరణ
నకిలీ విత్తన తయారీదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం పదే పదే చెబుతున్నా ఆచరణలో అది పెద్దగా కనిపించడం లేదు. వ్యవసాయ, పోలీసు శాఖ అడపదడపా చర్యలు చేపడుతున్నా కట్టడి కావడం లేదు. నకిలీ విత్తనాలను విక్రయిస్తే పీడీ యాక్టు కింద కేసులు నమోదు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించినా అది అమలు కావడం లేదు. గతంలో రాష్ట్ర ప్రభుత్వమే సహకార సంఘాల ద్వారా రైతులకు విత్తనాలను ఎరువులను పంపిణీ చేసిందని.. నేడు దానికి భిన్నంగా కంపెనీల యాజమాన్యాలకు విత్తనాలను అమ్ముకోమని అనుమతులు ఇవ్వడం సరైంది కాదంటున్నారు. కల్తీ విత్తనాల ద్వారా రైతులు నష్టపోవడమే కాకుండా రైతు ఆత్మహత్యలకు కారణమవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను మోసం చేసిన వాళ్లపై చర్యలు తీసుకోవాలంటూ నష్టపోయిన రైతులంతా కలిసి ఆందోళన చేపట్టారు. వారిని అరెస్ట్ చేసి.. మరోసారి ఇలాంటి నకిలీ విత్తనాలు అమ్మనీయకుండా చర్యలు తీసుకోవాలంటూ వాపోతున్నారు.
రైతులు.. తస్మాత్ జాగ్రత్త..
నకిలీ విత్తనాల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. తక్కువ ధరకు లేదా సరైన లేబుల్, సమాచారం లేని విత్తనాల పట్ల జాగ్రత్త వహించాలని సూచిస్తున్నారు. అవసరమైతే క్రాస్ చెక్ చేసుకుని కొనుగోలు చేయాలంటున్నారు. నాణ్యమైన, బ్రాండెడ్ విత్తనాలతోనే మంచి దిగుబడులు సాధ్యమంటున్నారు. విత్తనాలు కొనుగోలు చేసిన రైతులు తప్పకుండా బిల్లుతోపాటు విత్తన ప్యాకెట్లను భద్రపర్చాలంటున్నారు. ఏదైనా పరిస్థితుల్లో నష్టం జరిగితే విత్తన బీమా వర్తిస్తుందని.. బిల్లు ఉంటేనే సదరు విత్తన సంస్థ పైన చర్యలు తీసుకోవడానికి ఆస్కారం ఉంటుందని వెల్లడించారు.