Medaram Jathara: తెలంగాణలో నాలుగు రోజుల పాటు అత్యంత వైభవంగా సాగిన సమ్మక్క - సారలమ్మ జాతర భక్తుల మొక్కుల మధ్య ఘనంగా ముగిసింది. దాదాపు కోటిన్నరకు పైగా భక్తులు అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. సమ్మక్క సారలమ్మలను దర్శించుకున్న భక్తులు సమర్పించిన కానుకల హుండీలను అధికారులు లెక్కిస్తున్నారు. మేడారంలో మొత్తం 518 హుండీలను ఏర్పాటు చేయగా వాటిని హనుమకొండలోని టీటీడీ కళ్యాణమండపలో లెక్కిస్తున్నారు. దాదాపు 10 రోజులపాటు ఈ లెక్కింపు కార్యక్రమం జరగనుంది. డబ్బులు లెక్కిస్తున్న సమయంలో లభించిన కరెన్సీని అధికారులు అవాక్కయ్యారు. కరెన్సీ నోట్లపై మహాత్మా గాంధీ ఫొటోకు బదులు డా.బిఆర్.అంబేడ్కర్ ఫొటో ఉండంతో అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.
అంబేడ్కర్ ఫొటోతో ముద్రించిన నకిలీ వంద రూపాయల నోట్లు బయటపడ్డాయి. మొదట ఓపెన్ చేసిన హుండీలలో నకిలీ కరెన్సీ లభ్యమైయ్యాయని అధికారులు తెలిపారు. కాగా.. అంబేడ్కర్ బొమ్మను కరెన్సీ నోట్లపై ముద్రించాలన్న డిమాండ్లు వస్తున్న నేపథ్యంలో ఈ విషయాన్ని జనం దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశ్యంతోనే ఇలా కొందరు చేసినట్లు అధికారులు భావిస్తున్నారు. ఇదిలా ఉండగా.. 2020లో జరిగిన మేడారం జాతరలో 11 కోట్ల 17 లక్షల రూపాయలు, 2022 కరోనా సమయంలో 10 కోట్ల 91 లక్షల రూపాయలు రాష్ట్ర ఖజానాకు వచ్చాయి.
హన్మకొండ టీటీడీ కళ్యాణమండపంలో హుండీల కౌంటింగ్ ప్రక్రియ పటిష్ట బందోబస్తు మధ్య కొనసాగుతోంది. మేడారం పూజారుల, దేవాదాయశాఖ అధికారుల సమక్షంలో సీసీ కెమెరాల పర్యవేక్షణలో హుండీలు లెక్కిస్తున్నారు. లెక్కింపు మొదటిరోజే ఇలాంటి ఘటనలు జరగడంతో సిబ్బంది షాక్ అయ్యారు. ఇంకా ఇలాంటి వింతలు ఎన్ని చూడాల్సి వస్తుందోనని భావిస్తున్నారు.