F9 Cargo e-scooter: ఇంతవరకూ మనం గూడ్స్ ఆటోలు చూశాం. ఇక ముందు గూడ్స్ స్కూటర్లు చూడబోతున్నాం. అది కూడా ఎలక్ట్రిక్ స్కూటర్లు. అవును.. పూణెకు చెందిన ఈ-మొబిలిటీ స్టార్టప్ కార్గోస్ ప్రపంచంలోనే మొట్టమొదటి కార్గో ఎలక్ట్రిక్ స్కూటర్‌ను భారత మార్కెట్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. కంపెనీ దీనికి కార్గోస్ ఎఫ్9 అని పేరు పెట్టింది. ఈ స్కూటర్ 120 కిలోల బరువును తీసుకెళుతుంది. ఒకసారి ఛార్జింగ్ చేస్తే 150 కిమీల వరకు పరుగెత్తుతుందని కంపెనీ చెబుతోంది.
ఈ మధ్య ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ (F9 Cargo e-scooter)ను మన రోడ్లపై టెస్ట్ డ్రైవ్ చేశారు. ఇంతకుముందు, అమెరికాలోని టెక్సాస్‌లో జరిగిన 3D ఎక్స్‌పీరియన్స్ వరల్డ్ 2024 ఈవెంట్‌లో ఈ కార్గో ఎలక్ట్రిక్ స్కూటర్‌ను పరిచయం చేశారు.
ధర రెండు లక్షల రూపాయలు ఉండవచ్చు..
కార్గోస్ 6 సంవత్సరాలుగా ఫ్రెంచ్ బహుళజాతి సాఫ్ట్‌వేర్ కంపెనీ డస్సాల్ట్ సిస్టమ్స్‌తో కలిసి ఎలక్ట్రిక్ స్కూటర్‌పై(F9 Cargo e-scooter) పని చేస్తోంది. దీని రూపకల్పన - అభివృద్ధి దాదాపు ఖరారైంది. స్కూటర్ బుకింగ్ త్వరలో ప్రారంభించే అవకాశాలున్నాయి. మార్చి లేదా ఏప్రిల్‌లో దీనిని ప్రారంభించవచ్చని భావిస్తున్నారు. దీని అంచనా ధరను రూ. 2 లక్షల ఎక్స్-షోరూమ్ కంటే తక్కువగా కంపెనీ ఉంచవచ్చు. ఈ ఏడాది చివరి నాటికి ఈ కార్గో స్కూటర్లు 250 యూనిట్లు ఉత్పత్తి అవుతాయి. పెరుగుతున్న డిమాండ్‌తో, 2025లో ఉత్పత్తిని దాదాపు 1200 యూనిట్లకు పెంచనున్నారు. ప్రస్తుతం ఎలక్ట్రిక్ స్కూటర్ సెగ్మెంట్‌లో ఇలాంటిది ఇదే మొదటిది. దీనికి మార్కెట్‌లో పోటీదారుడు లేడు.
Also Read: పదేళ్లలో 10 రూపాయల్ని పదివేలు చేసిన మూడు ఫండ్స్ ఇవే!
225 లీటర్ల కార్గో స్పేస్
కార్గోస్ ఎఫ్9 (F9 Cargo e-scooter)డిజైన్ చాలా ప్రత్యేకమైనది. స్కూటర్ ముందు భాగంలో ఒక బాక్స్ ఉంది. దీనిలో 225 లీటర్ల కార్గో స్పేస్ (బూట్ స్పేస్) అందుబాటులో ఉంటుంది. 120 కిలోల వరకు సామాను ఇందులో ఉంచవచ్చు. ఈ స్థలంలో హెడ్‌లైట్లు కూడా అమర్చి ఉన్నాయి. రైడర్ కోసం వెనుక వైపున ఒక చిన్న సింగిల్ సీటు అందించారు. కార్గో స్పేస్ పైన హ్యాండిల్ బార్ ఉంది. ఇది రైడర్‌కు నిటారుగా కూచుని డ్రైవ్ చేసే అవకాశం ఇస్తుంది.
ఈ స్కూటర్ లాస్ట్ మైల్ డెలివరీ అప్లికేషన్‌ల కోసం రూపొందించారు. లాజిస్టిక్స్ అప్లికేషన్‌లలో 2 వీలర్స్ - 3 వీలర్స్ మధ్య అంతరాన్ని ఇది తగ్గిస్తుంది. సంప్రదాయ ద్విచక్ర వాహనంతో సగటున 35 డెలివరీలు చేయవచ్చని కంపెనీ తెలిపింది. ఈ లెక్కతో పోల్చి చూస్తే, కార్గోజ్ స్కూటర్ 70 పార్సెల్‌లను డెలివరీ చేయగలదు. అంతే కాకుండా పార్సిల్స్ ఉంచే ప్రదేశాన్ని లాక్ చేసుకునే సౌకర్యం కూడా ఇందులో ఉంది. అందువల్ల వస్తువులు దొంగిలించబడతాయనే ఆందోళన ఉండదు.
బ్యాటరీ రేంజ్.. పవర్
కార్గోస్ F9 3.4 kW ఎలక్ట్రిక్ మోటారుతో వస్తుంది. ఇది 6 kW గరిష్ట శక్తిని ఉత్పత్తి చేస్తుంది. మోటారుకు శక్తినివ్వడానికి, 6.1 kWh బ్యాటరీ ప్యాక్ అందించారు. కార్గోస్ ఎఫ్9 ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఒక్కసారి ఛార్జ్ చేస్తే 150 కిలోమీటర్ల వరకు నడపవచ్చని చెబుతున్నారు. అలాగే, దాని గరిష్ట వేగం గంటకు 80కిమీ అని కంపెనీ పేర్కొంది. ప్రామాణిక AC పవర్ సాకెట్‌తో బ్యాటరీని దాదాపు 5:15 గంటల్లో పూర్తిగా ఛార్జ్ చేయవచ్చు.
ఈ స్కూటర్ పూర్తిగా అందుబాటులోకి వస్తే పట్టణాలు, నగరాల్లో కార్గో డెలివరీ మరింత ఈజీగా మారుతుంది.
Watch this Interesting Video: