ఓ చిన్నారి ఏడుపుతో ఆ ప్రాంతమంతా హృదయవిదారకంగా మారింది.. నలుగురు వ్యక్తులు కలిసి ఆమె జననాంగంలోని ఓ పార్ట్‌ని బ్లేడ్‌తో కోసేశారు. ఇదేదో క్రైమ్‌కు చెందిన వార్త కాదు.. ఇదో ఆచారమట.. అవును ఇదో దురాచారం.. దుర్మార్గమైన ఆచారం.. చాలా ముస్లిం దేశాల్లో చిన్నారులపై జరిగే ఘోరాతి ఘోరం. కోల్‌కతా ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటన తర్వాత ప్రతీ ఒక్కరు కఠిన శిక్షల గురించి మాట్లాడుతున్నారు కానీ అసలు ఇలాంటి దారుణాలకు మూలమైన వికృత ఆచారాలు, పితృస్వామ్య పొకడలు గురించి పెద్దగా చర్చ జరగకపోవడం బాధాకరం. ప్రపంచంలోని అనేక దేశాల్లోని సంస్క్రతుల్లో స్త్రీ అన్నిది కేవలం శృంగారం కోసం పనికొచ్చే ఓ వస్తువు మాత్రమే..!
Female Genital Mutilation.. దీన్ని తెలుగులో స్త్రీ జననేంద్రియ వికృతీకరణ అంటారు. ఆడవాళ్ల జననాంగంలో ఉండే క్లిటోరిస్‌ని కట్ చేసే పద్ధతి ఇది. గిని, సోమాలియా లాంటి దేశాల్లో 90 శాతం మంది మహిళలు ఈ రకమైన జననేంద్రియ వైకల్యానికి గురవుతున్నారు. ఇలా చేయడానికి ఓ వికృతమైన కారణం ఉంది. క్లిటోరిస్‌ను కట్ చేయడం వల్ల శృంగారం సమయంలో భావప్రాప్తి పొందలేరు. అప్పుడు ఆ అమ్మాయికి ఎలాంటి ఫీలింగ్స్ రావు. దీని వల్ల పెళ్లికి ముందు కోరికలు అదుపులో ఉంటాయట.. అప్పుడు కుటుంబ గౌరవం నిలబడుతుదట..! ఎంత నీచమైన ఆలోచనో కదా.. ఈ విధానాన్ని మానవ హక్కుల ఉల్లంఘనగా ఐక్యరాజ్యసమితి ఎప్పుడో నిర్ణయించింది. అయినా ఈ రకమైన విధానం ఇప్పటికీ కొనసాగుతూనే ఉండడం అత్యంత బాధకారమైన విషయం.
ఇలాంటి పద్ధతులు కేవలం ఓ మతానికో, ఓ కులానికో పరిమితం కాదు. దాదాపు ప్రపంచంలోని అన్ని సమూహాల్లోనూ ఆచారం, కట్టుబాట్లు మాటున మహిళలపై ఏదో రకమైన శారీరక, మానసిక దాడి జరుగుతోంది. ఒకప్పుడు ఇండియాలో సతీసహగమనం లాంటి దురాచారాలు ఉండేవి. ఇక బాల్యవివాహాలు దేశంలో ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి కదా. అటు కట్నం లాంటి దురాచారాలు సమాజంలో పాతుకుపోయి ఉన్నాయి. చట్టపరంగా ఇవి నేరాలే అయినా సమాజం పరంగా అసలు తప్పులే కానట్టు ఇప్పటికీ చాలామంది ఫీల్ అవుతుంటారు.
Also Read : బొత్సకు కేబినెట్ ర్యాంక్ పదవి.. జగన్ సంచలన నిర్ణయం!
కట్నం తీసుకోవడం, అమ్మాయిని అనుభవించడం పెళ్ళి కొడుకులు తమ హక్కుగా భావిస్తుంటారు. దీని వల్ల ఇష్టపూర్వకంగా జరగాల్సిన శృంగారం కొన్నిసార్లు బలవంతంగా జరుగుతోంది. ఇదే కూడా రేప్ కిందకే వస్తుంది. దీన్ని మారిటల్ రేప్ అంటారు. అంటే వైవాహిక అత్యాచారం. యూఎస్, యూకే, కెనడా లాంటి దేశాల్లో ఇది నేరం కిందకే వస్తుంది.
ఇటు దక్షిణ భారతంలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికీ దేవదాసి వ్యవస్థ కొనసాగుతోంది. అణగారిన కులాలకు చెందిన మహిళలను ఆలయానికి అంకితం చేయడాన్ని చట్టాలు ఎప్పుడో నిషేధించాయి. దేవదాసి వ్యవస్థ పేరిట అమ్మాయిలతో చేయకూడని పనులు చేయించుకుంటారు. ఇది కూడా దుర్మార్గమైన ఆచారమే. మరోవైపు ఇండియా సరిహద్దుల్లో ఉండే నేపాల్‌లో మరో దారుణమైన ఆచారం ఉంది. నేపాల్‌లోని పలు ప్రాంతాల్లో రుతుక్రమం సమయంలో స్త్రీలు ఒంటరిగా ఆవులు, గేదెల మధ్య నిద్రించాలి. అయితే రుతుక్రమ సమయంలో ఇలాంటి మూఢ నమ్మకాలు దాదాపు ప్రతీ సంస్కృతిలోనూ కనిపిస్తాయి.
కామెరూన్ లాంటి ఆఫ్రికా దేశాల్లో రొమ్ములు పెంచుకోవడాన్ని తప్పుగా భావిస్తారు. ఎందుకంటే అవి మగవారి దృష్టిని ఆకర్షిస్తాయట. సొంత తల్లులే తమ పిల్లల రొమ్ములను వేడి ఇనుప పనిముట్లతో ఇస్త్రీ లాగా చేసి ఎదగకుండా అడ్డుకుంటారు. ఈ నొప్పి బాలికలకు భరించరానిదిగా ఉంటుంది. అటు టాంజానియాతో పాటు కెన్యాలోని కొన్ని ప్రాంతాల్లోని వితంతువులు చనిపోయిన భర్తకు చెందిన అన్న లేదా తమ్ముడితో లైంగికంగా కలవాలట. ఈ సంప్రదాయాన్ని వ్యతిరేకించే స్త్రీలను ఇంటి నుంచి తరిమివేస్తారు. చనిపోయిన భర్త ఆస్తిలో వాటా కూడా ఇవ్వరు.
ఇప్పటివరకు చెప్పిన ఆచారాలు మచ్చుకు కొన్ని మాత్రమే.. అఫ్ఘాన్, యెమన్, సోమాలియా, సుడాన్ లాంటి దేశాల్లో ఇలాంటి వికృతమైన ఆచారాలు చలామణీ ఉన్నాయి. ఇక్కడ చెప్పుకోవాల్సిన మరో విషయం ఏంటంటే ఈ దేశాల్లో అత్యాచారాలకు కఠిన శిక్షలు ఉంటాయని అదే మిగిలిన దేశాలు అనుసరించాలని చాలా మంది భావిస్తుంటారు. అయితే నిజం మాత్రం వేరు. సమానత్వంతో పాటు మహిళలకు స్వేచ్ఛ, గౌరవం ఉన్న సమాజాల్లో మహిళలపై జరిగే నేరాలు చాలా తక్కువ. అందుకే స్కెండివేనియన్ దేశాలు స్త్రీ పురోగతిలో ముందు వరుసలో ఉన్నాయి. జెండర్ గ్యాప్ ర్యాంకింగ్స్‌లో ఐస్‌లాండ్ ఎప్పుడూ టాప్‌లోనే ఉండడానికి ఇదే కారణం!