Nifty Boom: స్టాక్ మార్కెట్ అంటేనే అస్థిరత. కానీ, ఇటీవల కాలంలో ఎక్కువగా లాభాల బాటలోనే మార్కెట్లు నడిచాయి. రికార్డు స్థాయిలో ఇండెక్స్ లు కదలాడాయి. ఈ నేపథ్యంలో స్థిరమైన ఆర్థిక విధానాలు - సాధారణ రుతుపవనాల అంచనాలతో డిమాండ్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. దీని కారణంగా స్టాక్ మార్కెట్ భవిష్యత్తులో బుల్లిష్‌గా ఉంటుందని భావిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఏడాది డిసెంబర్ నాటికి నిఫ్టీ(Nifty Boom) 25,800 స్థాయికి చేరుకునే అవకాశం ఉందని బ్రోకరేజ్ కంపెనీ ప్రభుదాస్ లీలాధర్ తన అభిప్రాయాన్నివ్యక్తం చేశారు. దీనికి సంబంధించి బ్రోకరేజ్ కంపెనీ ఓ నివేదికను కూడా విడుదల చేసింది.
Also Read: గో ఫస్ట్ ఎయిర్‌లైన్స్ కి షాకిచ్చిన ఢిల్లీ హైకోర్టు
నివేదిక ప్రకారం, ఈ సంవత్సరం డిసెంబర్ చివరి నాటికి నిఫ్టీ ప్రస్తుత స్థాయి నుండి 3,239.65 పాయింట్లు లేదా 14.35 శాతం పెరగవచ్చు. నిఫ్టీ(Nifty Boom) ప్రస్తుతం 22,570.35 స్థాయి వద్ద ట్రేడవుతోంది. బ్రోకరేజ్ కంపెనీ ఇన్స్టిట్యూషనల్ రిచెస్ హెడ్ అమ్నీష్ అగర్వాల్ మాట్లాడుతూ, ఇటీవల, నిఫ్టీ దాని ఆల్-టైమ్ గరిష్ట స్థాయికి చేరుకుందని, అయితే తరువాత పెరుగుతున్న భౌగోళిక ఉద్రిక్తతలు, ముడి చమురు - కమోడిటీ ధరలలో హెచ్చుతగ్గులుఅలాగే, US ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటులో కోతకు ఉన్న తక్కువ అవకాశం కారణంగా సుమారు నాలుగు శాతం తగ్గిందని చెప్పారు. అయితే, మళ్ళీ స్టాక్ మార్కెట్ పుంజుకుంటుందని, డిసెంబర్ 2024 నాటికి నిఫ్టీ(Nifty Boom) 25,810 స్థాయికి చేరుకోగలదని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
జూన్ మొదటి వారం చాలా ముఖ్యమైనది
ప్రస్తుత ప్రభుత్వం కొనసాగడం, సాధారణ రుతుపవనాల కారణంగా నిఫ్టీ పెరిగే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది. దీంతో డిమాండ్ పెరుగుతుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్నందున జూన్ మొదటి వారంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కానుంది. ఇలాంటి పరిస్థితుల్లో జూన్ మొదటి వారం మార్కెట్ (Nifty Boom)పరంగా చాలా కీలకం కానుంది. ఏదిఏమైనా కొత్త ప్రభుత్వం ఏర్పాటు నాటికి ఈ అంచనాల పరిస్థితి ఏవిధంగా ఉంటుంది అనేది తేలిపోతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. జూన్ వరకూ స్టాక్ మార్కెట్ లో పెద్దగా లాభాలు కనిపించే అవకాశాలు లేవని అంచనా వేస్తున్నారు. అయితే, రుతుపవనాలు.. స్థిర ప్రభుత్వం ఈ రెండిటి లెక్కలపై జూన్ తరువాత స్టాక్ మార్కెట్(Nifty Boom) గమనం ఆధారపడి ఉంటుందని స్టాక్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.