ప్రశ్నార్థకంగా మారిన ‘ఇండియా’ కూటమి ఉనికి!

మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓటమితో 2024 ఎన్నికలలో బీజేపీని ఓడించేందుకు 28 రాజకీయ పక్షాలు ఏర్పాటు చేసుకున్న ఉమ్మడి వేదిక ‘ఇండియా’ మనుగడ ప్రశ్నార్థకమమైంది. పార్లమెంటు ఎన్నికల్లోగా బలమైన ఉమ్మడి శక్తిగా ఎదుగుతుందా అన్న ప్రశ్న తలెత్తుతోంది.

ప్రశ్నార్థకంగా మారిన ‘ఇండియా’ కూటమి ఉనికి!
New Update

INDIA alliance: తాజాగా ఐదు రాస్త్రాల అసెంబ్లీ ఎన్నికలలో కీలకమైన మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓటమి చెందడంతో 2024 ఎన్నికలలో బీజేపీని ఓడించేందుకు 28 రాజకీయ పక్షాలు కలిసి ఏర్పాటు చేసుకున్న ఉమ్మడి వేదిక ‘ఇండియా’ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోంది. లోక్‌సభ ఎన్నికలకు గట్టిగా ఆరు మాసాల వ్యవధి కూడా లేకపోవడంతో ఈలోగా ‘ఇండియా’ కూటమి లోపాలను సవరించుకొని, నాయకత్వ సమస్యను పరిష్కరించుకొని, బలమైన ఉమ్మడి ప్రతిపక్ష శక్తిగా రూపొందగలుగుతుందా? అనే ప్రశ్న తలెత్తుతోంది.

ఇక నుంచి ఏ ఎన్నిక జరిగినా ఉమ్మడిగా ఒకే అభ్యర్థిని నిలబెట్టాలని మూడు నెలల క్రితం ముంబైలో తీసుకున్న నిర్ణయాన్ని ఐదు రాష్ట్రాల ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ గాలికి వదిలేయడంతో ఆ పార్టీ ధోరణిపై ఇతర పక్షాలలో అనుమానాలు చెలరేగుతున్నాయి.

ఇది కూడా చదవండి: తెలివితేటలతో రాజకీయాల్లో.. హిందుత్వ పునాదులతో ముఖ్యమంత్రి

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగినా, అధికారంలో ఉన్న రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలలో కాంగ్రెస్ అధికారాన్ని కోల్పోవడంతో పాటు ఈ మూడు రాస్త్రాలలో కాంగ్రెస్ నేరుగా బీజేపీతో తలపడటంతో బీజేపీని ఓడించడంలో కాంగ్రెస్ సామర్థ్యంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ ఎన్నికల ఫలితాలు ‘పజ్రల ఓటమి’ కాదని, ‘కాంగ్రెస్ ఓటమి’ అంటూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ పేర్కొనడం గమనార్హం.

కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న ‘అహంకార ధోరణి’ కారణంగానే ఓటమి పాలవుతున్నట్లు ఆప్, ఎస్పీ, శివసేన (ఉద్ధవ్), ఆర్జేడీ, జేడీయూ వంటి పార్టీలు భావిస్తున్నాయి. ముంబైలో జరిగిన భేటీ తర్వాత నెలరోజుల లోపు రాష్ట్రాల స్థాయిలో భాగస్వామ్య పక్షాల మధ్య సీట్ల సర్దుబాటు కసరత్తు పూర్తి కావాలని నిర్ణయించారు. అయితే, ఆ తర్వాత కాంగ్రెస్ ఆసక్తి చూపకపోవడంతో ఆ కసరత్తు అసలు ప్రారంభమే కాలేదు. అందుకోసం ఏర్పడిన ఉపసంఘం కూడా భేటీలు జరపలేదు.

ఇప్పటి వరకు కనీసం కూటమి కన్వీనర్ ఎంపిక కూడా జరగకుండా, ఈ కమిటీ సమావేశాలు కూడా జరపకుండా, ఉమ్మడిగా ఆందోళనలు జరపాలనే నిర్ణయం కూడా అమలు కాకుండా అడ్డుపడుతూ వస్తున్న కాంగ్రెస్ పార్టీ ధోరణి పట్ల ఇతర పార్టీలు ఇప్పటికే ఆగ్రహంగా ఉన్నాయి. ఈ మూడు అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందితే సీట్ల సర్దుబాట్లలో తమ మాట చలామణి అయ్యేటట్లు చేసుకోవచ్చని కాంగ్రెస్ ఆ అంశాన్ని దాటవేస్తూ వచ్చింది.

ఇది కూడా చదవండి: ‘ఫ్యాన్’ ఊగిసలాట.. 24 గంటల్లో ఇంత జరిగిందా!.. వైసీపీలో ప్రకంపనలు

కనీసం ఎన్నికలు జరిగిన రాష్ట్రాలలో అయినా భాగస్వామ్య పార్టీల మధ్య సీట్ల సర్దుబాట్లకు ముందుకు రాలేదు. కేవలం తెలంగాణాలో సీపీఐకి ఒక సీట్ వదిలారు. ముఖ్యంగా రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో చిన్న చిన్న పార్టీలు విడిగా పోటీ చేసేటట్లు చేయడం ద్వారా కూటమి స్ఫూర్తికి విరుద్ధంగా కాంగ్రెస్ వ్యవహరించింది. కాంగ్రెస్ ‘పెద్దన్న’ ధోరణి కారణంగానే రాజస్థాన్, మధ్యప్రదేశ్ లలో పరాజయాన్ని మూటకట్టుకోవలసి వచ్చినట్లు ‘ఇండియా’ భాగస్వామ్య పక్షాలు భావిస్తున్నాయి. చిన్నచిన్న పార్టీలు చీల్చుకున్న ఓట్ల కారణంగా కాంగ్రెస్ పలు సీట్లను కోల్పోవలసి వచ్చింది.

రాజస్థాన్, చత్తీస్‌గఢ్‌లలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు వల్ల ఆ పార్టీ ఓడిపోయిందని సరిపెట్టుకున్నా మధ్యప్రదేశ్‌లో దాని పరాజయం ఒక పట్టాన మింగుడు పడడం లేదు. బీజేపీ హ్యాట్రిక్ ఆశలను వమ్ము చేసి దేశానికి తిరిగి ప్రత్యామ్న్యాయ పాలనను తీసుకు రావాలని ప్రతిపక్షాలన్నీ సంఘటితంగా నిర్మించుకొన్న ఆశాసౌధాలు ఈ ఫలితాలతో కూలిపోయే సూచనలు కనిపిస్తున్నాయి.

బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కాంగ్రెస్‌పైనే ఆశలు పెట్టుకొని ‘ఇండియా’ కూటమిని తెర మీదికి తెచ్చారు. మధ్యప్రదేశ్‌లో ఎన్నికల సీట్ల సర్దుబాటు అంశంపై కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీకి తీవ్ర విభేదాలు తలెత్తినప్పుడే ‘ఇండియా’ కూటమికి బీటలు వారిన సూచనలు కనిపించాయి. ఇప్పుడు ఈ రాష్ట్రాలలో కాంగ్రెస్ ఓటమితో ఆ బీటలు మరింతగా పెరిగే అవకాశాలు స్పష్టం చేస్తున్నాయి.

ఇప్పుడు కీలకమైన మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓటమి చెందడంతో కూటమి నాయకత్వం కాంగ్రెస్ చేతుల నుంచి మారాలనే వాదన తెరపైకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ గుర్తు ‘హస్తం’ భస్మాసుర హస్తంగా మారుతుందని, త్వరలో ఇండియా కూటమి ఇంటికి పోవడం ఖాయమని ఈ ఫలితాలపై వ్యాఖ్యానిస్తూ బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఎద్దేవా చేశారు.

ఇది కూడా చదవండి: ఎంపీ ఎలక్షన్స్‌పై బీజేపీ ఫోకస్.. టికెట్ కోసం పోటీ పడుతున్న నేతలు

నాయకత్వ మార్పు కోసం టీఎంసీ నేతలు బహిరంగంగానే డిమాండ్‌ చేస్తున్నారు. ఆదివారం వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై టీఎంసీ అధికార ప్రతినిధి కునాల్ ఘోష్ స్పందిస్తూ అసెంబ్లీ ఎన్నికల్లో పేలవమైన ఫలితాలు పొందిన కాంగ్రెస్‌ను ఆయన నిందించారు. ఈ ఫలితాలు కాంగ్రెస్‌ పార్టీకి నష్టమే తప్ప బీజేపీ గెలుపు కాదని అంటూ ధ్వజమెత్తారు. ‘మూడు రాష్ట్రాల ఫలితాలు బీజేపీ విజయగాథ కంటే కాంగ్రెస్ వైఫల్యమే ఎక్కువ’ అని ఆయన విమర్శించారు.

ఈ మూడు రాష్ట్రాల్లోని సీనియర్ నాయకులను దారికి తీసుకురాలేక వారికే మొత్తం ప్రచారం అప్పచెప్పి కాంగ్రెస్ అగ్రనాయకత్వం చతికిలపడిన కారణగామే ఈ పరాజయాలు అని స్పష్టమవుతుంది. రాహుల్ గాంధీ కొత్తగా కుల గణన నినాదం తెరపైకి తెచ్చినప్పటికీ ఆచరణలో దానిని విజయవంతంగా చేపట్టి పూర్తి చేయడానికి తగిన శక్తియుక్తులు ఆయనకు లేవని వెల్లడైంది.

ఈ రాష్ట్రాల్లో ఆ పార్టీ అగ్ర వర్ణాల ఆధిపత్యం ఎల్లకాలం కొనసాగుతూ వుండడంతో ఓబీసీ ప్రజల విశ్వాసాన్ని పొందలేకపోయారు. ఇప్పటికి కాంగ్రెస్ ఓ బలమైన ఓబీసీ నేతను ముందుకు తీసుకు రాలేకపోయింది. అందుకనే ఉత్తరాదిన ఓబీసీలు పెద్ద సంఖ్యలో బీజేపీ వైపు వెళుతున్నారు.

కాంగ్రెస్ ఓటమికి ప్రధాన కారణం మధ్యప్రదేశ్, రాజస్థాన్ లలో 1980వ దశకంలో ‘సంజయ్ బ్రిగేడ్’ నేతలుగా ఒక వెలుగు వెలిగిన వారే ఇంకా కాంగ్రెస్ రాజకీయాలలో ఆధిపత్యం వహిస్తుండడం, నూతన తరాన్ని తెరపైకి తీసుకు రాలేకపోవడం. మధ్యప్రదేశ్ లో ముఖ్యమంత్రి అభ్యర్థి అయిన కమల్ నాథ్ (78) మొండి ధోరణి కారణంగా చివరకు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సైతం విసుగు చెంది ఆ రాష్ట్రంలో ప్రచారంపై పెద్దగా ఆసక్తి చూపలేదు.

ఈ మూడు రాష్ట్రాల్లో తాము ఓటమి ఎదుర్కోవలసి వస్తుందనే అభిప్రాయంతో ఆరు నెలల ముందు నుంచే బీజేపీ అగ్రనేతలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ వచ్చారు. కానీ, కాంగ్రెస్ నేతలు తామే గెలుస్తున్నామని మితిమీరిన విశ్వాసంతో అహంకార ధోరణితో ఉన్న అవకాశాలను పోగొట్టుకున్నారని పరిశీలకులు భావిస్తున్నారు.

ఇది కూడా చదవండి: ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి.. ఇండియా కూటమి పరిస్థితి ఏమిటి?

అన్నింటికీ మించి పోలింగ్ బూత్ మేనేజ్మెంట్ పై అసలు శ్రద్ధ చూపలేదు. ఈ విషయంలో చాలా చురుకుగా వ్యవహరించి బీజేపీ అనూహ్య విజయాలు సాధించింది. మధ్యప్రదేశ్ లో కమల్ నాథ్, దిగ్విజయ్ సింగ్ వంటి వారు, రాజస్థాన్ లో అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ వంటి వారు పరస్పరం ఒకరి మనుషులను మరొకరు ఓడించుకునేందుకు చేసిన ప్రయత్నాలపై దృష్టిసారిస్తూ బీజేపీని లక్ష్యంగా చేసుకోవడంలో వెనుకబడ్డారనే విమర్శలు కూడా చెలరేగుతున్నాయి.

మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ లలో ఓటమి తప్పదని బీజేపీ అంతర్గత సర్వేలు సైతం వెల్లడి చేసినట్లు తెలుస్తున్నది. అనేక పోల్ సర్వేలు కూడా అదే విషయాన్నీ తెలిపాయి. అయినా ఏ విధంగా ఆ పార్టీ గెలిచిందో అర్ధం కావడం లేదని యోగేంద్ర యాదవ్ వంటి ఎన్నికల విశ్లేషకులు ఆశ్చర్యం వ్యక్తంచేయడం గమనార్హం. ఓటమి అవకాశాలను ఓ సవాలుగా తీసుకుని పార్టీని విజయం వైపు తీసుకెళ్లేందుకు బీజేపీ నేతలు ప్రయత్నం చేస్తుంటే, విజయావకాశాలను చేతులారా భగ్నం చేసుకోవడంలో కాంగ్రెస్ నేతలు తలమునకలయ్యారని పరిశీలకులు ఎద్దేవా చేస్తున్నారు.

మూడు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో ‘ఇండియా’ కూటమి అవకాశాలపై ఎలాంటి ప్రభావం చూపబోవని టీఎంసి, ఎన్సీపీ, సీపీఎం తదితర పార్టీల నేతలు పైకి మేకబోతు గాంభీర్యం ప్రకటిస్తున్నా కాంగ్రెస్ ‘పెద్దన్న’ ధోరణిపై అసంతృప్తితో ఉన్నట్లు స్పష్టమవుతోంది.

పార్టీల మధ్య సర్దుబాటు ధోరణి అవసరమని ముంబై భేటీ సందర్భంగా చెప్పిన రాహుల్ గాంధీ మధ్యప్రదేశ్, రాజస్థాన్ లలో ఎందుకు అటువంటి ధోరణి ప్రదర్శించలేదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రాజకీయంగా ఎన్ని వైరుధ్యాలు ఉన్నప్పటికీ బీజేపీని ఓడించేందుకు అయిష్టంగానే కాంగ్రెస్ తో చేతులు కలిపేందుకు సిద్ధమైన ఆప్, ఎస్పీ వంటి పార్టీలు ఇప్పుడు వెనుకడుగు వేసే అవకాశాలు స్పష్టమవుతున్నాయి. కాంగ్రెస్ ‘ఉమ్మడి శత్రువు’ బీజేపీపై కాకుండా ‘భాగస్వామ్య పక్షాల’ను నిర్వీర్యం చేయడం ద్వారా తమ బలం పెంచుకొనే ప్రయత్నం చేస్తున్నదని ప్రధానంగా ఇటువంటి పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

- చలసాని నరేంద్ర

#india-alliance #chalasani-narendra-analysis
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe