మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత చంద్రశేఖర్ రావును (Ex CM KCR) తెలంగాణ మాజీ గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ (Narasimhan) ఈ రోజు పరామర్శించారు. ఆదివారం మధ్యాహ్నం నందినగర్ చేరుకున్న నరసింహన్ దంపతులు కేసీఆర్ తో మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి వివరాలు తెలుసుకున్నారు. త్వరలో పూర్తిస్థాయిలో కోలుకోవాలని ఈఎస్‌ఎల్ నరసింహన్ ఆకాంక్షించారు. కేసీఆర్ సతీమణి శోభ తదితర కుటుంబసభ్యులతో వారు మాట్లాడారు. నందినగర్ నివాసానికి చేరుకున్న నరసింహన్ దంపతులను తొలుత బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) సాదరంగా ఆహ్వానించారు.
ఇది కూడా చదవండి: KTR: కొత్త జిల్లాలు రద్దు చేస్తే ప్రజలు ఊరుకుంటారా?: రేవంత్ పై కేటీఆర్ ఫైర్
ఈ భేటీలో మాజీ మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, కొప్పుల ఈశ్వర్, ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, తదితరులు పాల్గొన్నారు. నూతన తెలంగాణ రాష్ట్రం లో జరిగిన అభివృద్ధి.. ఈ క్రమంలో గవర్నర్ హోదాలో నాడు నరసింహన్ గారు అందించిన సంపూర్ణ సహకారం చర్చకు వచ్చిన సందర్భంలో, వారి సహకారానికి తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ మరోసారి ధన్యవాదాలు తెలిపినట్లు బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి.
ఇది కూడా చదవండి: Revanth Reddy: ఫార్మా విలేజీలకు రేవంత్ మాస్టర్ ప్లాన్.. నిరుద్యోగులకు వరం.. యూత్ కోసం స్కిల్ యూనివర్సిటీలు!
తమ నివాసానికి వచ్చిన అతిథులను కేసీఆర్ దంపతులు సత్కరించారు. వారికి పట్టువస్త్రాలు సమర్పించి సంప్రదాయ పద్ధతిలో అతిథి మర్యాదలు చేశారు. ఉమ్మడి రాష్ట్రానికి గవర్నర్ గా నియామకం అయిన నరసింహన్ తెలంగాణ ఆవిర్భావం అనంతరం కూడా గవర్నర్ గా కొనసాగారు. ఆ సమయంలో కేసీఆర్ తో ఆయనకు అత్యంత సాన్నిహిత్యం ఏర్పడింది. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు నరసింహన్ వ్యతిరేకం అన్న విమర్శలు కూడా వ్యక్తం అయ్యాయి.
కానీ తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఆయన ప్రభుత్వానికి తన పూర్తి సహకారాన్ని అందించారన్న అభిప్రాయం ఉంది. రెండు మూడు రోజులుగా నరసింహన్ తెలంగాణలో పర్యటిస్తున్నారు. మొన్న యాదాద్రి లక్ష్మీనరసింహుడిని ఆయన దర్శించుకున్నారు. నిన్న సచివాలయానికి వెళ్లి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.