జాగ్రత్తలు తీసుకోండి
గత నాలుగు రోజులుగా తెలంగాణను వర్షాలు ముంచేత్తుతున్నాయి. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు వైద్య సేవలపై ఆదేశించారు. సీఎం కేసీఆర్ ఏజెన్సీ ప్రాంతాల్లో సహా అన్ని ప్రాంతాల ప్రజలకు అవసరమైన సేవలను అందించాలన్నారు. అవసరమున్న చోట హెలికాప్టర్లను వినియోగించాలని చెప్పారు. నిన్న వైద్య ఆరోగ్యశాఖ సన్నద్ధత, ప్రజా ఆరోగ్య పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపైన అన్ని విభాగాల ఉన్నతాధికారులు, జిల్లా వైద్య అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
మందులు రెడీగా ఉంచాలి
ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ వర్షాల నేపథ్యంలో ప్రజలకు ఎక్కువ వైద్య సేవల విషయంలో అంతరాయం కలగకుండా చూడాలని చెప్పారు. ప్రజలకు నిరంతరం వైద్య సేవలు అందించేందుకు రాష్ట్రవ్యాప్తంగా కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ తరహాలో అన్ని జిల్లాల్లో కాల్ సెంటర్, జిల్లా, ఏరియా, సీహెచ్‌సీ, ఎంసీహెచ్ దావాఖాల వారీగా ఎమర్జెన్సీ వైద్య సేవలు అందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని చెప్పారు. 108-102 వాహన సేవలు పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని ప్రసవ తేదీ సమీపిస్తున్న స్త్రీలకు, డయాలసిస్ పేషెంట్లకు అవసరమైన సేవలు అందించేలా చూడాలని మంత్రి కోరారు. ఆహారం కలుషితం కాకుండా ఆహార నాణ్యత పైన దృష్టి సాదించాలని, మెడికల్ ఆఫీసర్లు తమ పరిధిలోని అన్ని రకాల ప్రభుత్వ హాస్టళ్లను సందర్శించాలని మంత్రి హరీష్‌రావు ఆదేశించారు.
అందరికీ వైద్యం అందించాలి
అంతేకాకుండా ఆస్పత్రుల్లో వార్డులు, పరిసప్రాంతాలలో శుభ్రంగా ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత సూపరింటెండెంట్‌లదే అని స్పష్టం చేశారు. పాముకాట్లు, తేలుకాట్లు మందులు తప్పనిసరిగా అందుబాటులో ఉంచుకోవాలని మంత్రి హరీష్‌రావు డాక్టర్లకు చెప్పారు. పీహెచ్‌సీలలో మందులను నిల్వ ఉంచుకునే విషయంలో నిర్లక్ష్యం వ్యవహరిస్తే చర్యలు తప్పవని వారిని హెచ్చరించారు. జీహెచ్ఎంసీ పరిధిలోని లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ ఆరోగ్య పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సాధించాలని సంబంధిత అధికారులకు సూచించారు. సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం లేకుండా ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో పలవురు అధికారులతో సహా, తదితరులు పాల్గొన్నారు.
రెస్క్యూ టీమ్ సిద్ధం
నీళ్లలో మునిగిపోతున్న వారిని రక్షించేందుకు ప్రత్యేకంగా 149 మందికి శిక్షణ ఇప్పించినట్టు పేర్కొన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో 18 బోట్లను సిద్ధంగా ఉంచారు. నీరు భారీగా నిలిచినచోట బయటకి పంపేందుకు 11 డీవాటరింగ్ పంప్స్‌తోపాటు లైఫ్ జాకెట్స్, తాళ్లు, కట్టర్లు, ఏరియల్ లైటింగ్ సెట్లు వంటి వాటిని సిబ్బందికి అందజేశారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో వాటర్ రెస్క్యూ కోసం 30 మం దిని కేటాయించారు. వీరితో పాటు వాటర్ రెస్క్యూ ఫోర్స్ కోసం ప్రత్యేకంగా 50 మందిని సిద్ధంగా ఉంచారు. రెస్క్యూ కాల్స్, ఇతర అత్యవసర సేవల కోసం అగ్నిమాపకశాఖ కంట్రోల్ రూం నంబర్లు 9949991101, 87126 99444, 8712699464 కు ఫోన్ చేయాలని ఏడీజీ తెలిపారు.
ఏజెన్సీ ప్రాంతాలలో ప్రజలకు ఎమర్జెన్సీ వైద్య సేవలు అందించాలి: మంత్రి హరీష్‌రావు
తెలంగాణ రాష్ట్రంలో గత నాలుగు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు స్పందించారు. సీఎం ఆదేశాల మేరకు ఏజెన్సీ ప్రాంతాలలో ప్రజలకు ఎమర్జెన్సీ వైద్య సేవలు అందించాలని అవసరమైతే హెలికాప్టర్లు ఉపయోగించమని మంత్రి చెప్పారు. అంతేకాకుండా హైదరాబాద్‌ని కూడా ఈ వర్షాలు అతలాకుతులం చేస్తున్నాయి. పలు ప్రాంతాలలో ఇళ్లలోకి నీరు రావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలో ప్రజలకి ఎలాంటి ఇబ్బందులు కదలకుండా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.