Elections 2024: ఈరోజు మాత్రమే.. తరువాత అంతా సైలెన్స్ కావాల్సిందే!

 తెలుగు రాష్ట్రాల్లో ప్రచార హోరుకు ఈ సాయంత్రంతో చెక్ పడనుంది. మే 13న జరిగే ఎన్నికల కోసం గత 57 రోజులుగా చేస్తున్న రాజకీయ నాయకుల ప్రచారం ఈరోజు సాయంత్రం ముగుస్తుంది. తరువాత ఎటువంటి ప్రచార సందడి ఉండకూడదు. దీంతో ఈరోజు చివరి ప్రచార సభలకు అన్ని పార్టీలు రెడీ అయిపోయాయి.

Elections 2024: ఈరోజు మాత్రమే.. తరువాత అంతా సైలెన్స్ కావాల్సిందే!
New Update

Elections 2024: ఐదేళ్లుగా మొహం చూపించని వారు ఇల్లిల్లూ తిరుగుతున్నారు.. సెక్యూరిటీ మాటున మెరుపు తీగల్లా నడిచిన వారు వీధి వీధి చుట్టేస్తున్నారు.. విమానాల్లో గాలిలో చక్కర్లు కొట్టినవారు రోడ్ షోలతో ప్రజల మధ్య గడుపుతున్నారు.. ఐదేళ్ల కోసారి వచ్చే ఎన్నికల పండుగలో ఓటరు దేవుడ్ని ప్రసన్నం చేసుకోవడానికి రాజకీయ నాయకులు పడరాని పాట్లు పడుతున్నారు. ఒకరిని ఒకరు తిట్టుకుంటున్నారు.. నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు.. ఓటర్ల ముందు సాగిల పడుతున్నారు.. తెలుగురాష్ట్రాల్లో ఏ గల్లీ చూసినా ఇదే పరిస్థితి గత 57 రోజులుగా. ప్రచార హోరుతో ప్రజల చెవులు చిల్లులు పడిపోయాయి. ఇక కొద్ది గంటలు మాత్రమే. తరువా అంతా గప్.. చుప్.. కావాల్సిందే. 

Elections 2024: తెలుగురాష్ట్రాల్లో ఎన్నికల హంగామా చివరి అంకానికి చేరుకుంటోంది. దాదాపుగా రెండునెలలుగా ప్రచార పర్వం హోరాహోరీగా సాగుతూ వచ్చింది. మరో 48 గంటల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఈరోజు సాయంత్రంతో ప్రచార పర్వానికి తెరపడనుంది. ఈ సాయంత్రంతో ప్రచారాన్ని అన్ని రాజకీయపక్షాలు ముగించాల్సి ఉంటుంది. హోరెత్తిన మైకులు బంద్ చేయాలి. తరువాత ఎన్నికల ముందరి కీలక ఘడియల్లో ఎటువంటి చప్పుడూ లేకుండా ప్రచారం జరుపుకోవచ్చు. 

Also Read: ఎవరినైనా నియమించుకోవచ్చు.. ఈసీ క్లారిటీ..

Elections 2024: ఏపీలో అధికార వైసీపీ ఎన్నికలకు సిద్ధం అంటూ విస్తృతంగా ప్రచారం చేసింది. సింహం సింగిల్ గా వస్తుంది అంటూ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రమంతటా బస్సు యాత్రతో హోరెత్తించారు. ఇక ఈరోజు తన చివరి ప్రచార సభను జనసేనాని పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకంగా.. తమ అభ్యర్ధికి అనుకూలంగా పిఠాపురంలో నిర్వహించనున్నారు. మరోవైపు కూటమిగా బరిలోకి దిగిన టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు రాష్ట్రంలో వైసీపీ ఓటమే ధ్యేయంగా విస్తృతంగా ప్రచారం చేశాయి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏకంగా నిన్నటి వరకూ 87 బహిరంగ సభల్లో పాల్గొన్నారు. ఈరోజు తిరుపతిలో తన చివరి ప్రచార సభలో పాల్గొననున్నారు. ఇక జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా ప్రజల్లో మమేకమై తిరిగారు. ఆయన నిన్న పిఠాపురంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈరోజు కాకినాడలో చివరి బహిరంగ సభలో మాట్లాడనున్నారు. ఇక బీజేపీ తరఫున పురంధేశ్వరి ఆ పార్టీ కేంద్ర నాయకులు విస్తృతంగా ప్రచారం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ పలు సభల్లో పాల్గొన్నారు. కూటమి తరఫున మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ విజయవాడలో భారీ రోడ్ షో నిర్వహించారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా ఈసారి గట్టిగానే ప్రయత్నం చేస్తోంది. వైఎస్ షర్మిలను పార్టీ అధ్యక్షురాలిగా ప్రకటించిన తరువాత ఏపీలో కాంగ్రెస్ పార్టీకి జోష్ వచ్చింది. షర్మిల ఒంటరిగా పార్టీ ప్రచారాన్ని భుజానికెత్తుకొని రాష్ట్రమంతా పర్యటించారు. ప్రచారం చివరి రోజు కాంగ్రెస్ పార్టీ తరఫున రాహుల్ గాంధీ ఈరోజు కడప జిల్లాలో ప్రచారం నిర్వహించనున్నారు. 

Elections 2024: మొత్తంగా చూసుకుంటే ఈ రెండునెలల కాలం రాజకీయ నాయకుల సందడితో రాష్ట్రమంతటా కోలాహలం కనిపించింది. రాజకీయ నాయకుల రోడ్ షోలతో ప్రయాణీకులకు చాలాసార్లు నరకం కనిపించింది. ఒక పక్క భానుడి భగభగలు.. మరోపక్క నేతల ప్రచార సెగలు ప్రజలను అల్లాడించేశాయి. సరిగ్గా రెండురోజుల నుంచి భానుడు తన ప్రతాపాన్ని తగ్గించుకుంటూ వస్తే.. ఈరోజు సాయంత్రంతో రాజకీయ సెగలు పూర్తిగా చల్లారిపోయి ప్రశాంత వాతావరణం వస్తుంది. అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ఎన్నికల సంగ్రామంలో విజయం ఎవరిని వరిస్తుంది చూడాలంటే జూన్ 3 వరకూ ఆగాల్సిందే. ఎందుకంటే, ఓటరు ఎల్లుండి అంటే మే 13న రహస్యంగా ఎవరికి జై కొడతాడో బయటకు తెలిసేది ఆరోజే.    

#election-campaign #election-2024
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe