Secunderabad : కాంగ్రెస్(Congress) సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నిక అభ్యర్థిగా శ్రీగణేష్ పేరును హైకమాండ్ కొద్ది సేపటి క్రితం ప్రకటించింది. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి విజయం సాధించిన లాస్య నందిత(Lasya Nanditha) ఇటీవల ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన రోడ్డు ప్రమాదం(Road Accident) లో మరణించిన విషయం తెలిసిందే. దీంతో పార్లమెంట్ ఎన్నికలతోనే ఇక్కడ ఉప ఎన్నిక నిర్వహించాలని ఈసీ నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించింది. బీఆర్ఎస్, బీజేపీ ఇంకా తమ అభ్యర్థులను ప్రకటించలేదు.
ఇది కూడా చదవండి: Mallaredy: మరోసారి మల్లారెడ్డి అక్రమ నిర్మాణాల కూల్చివేత
ఇటీవల బీఆర్ఎస్ ముఖ్య నేతలను కలిసిన లాస్య నందిత కుటుంబ సభ్యులు.. తమ ఫ్యామిలీకి చెందిన వారికే మరో సారి టికెట్ ఇవ్వాలని కోరారు. అయితే.. ఎలాగైనా ఇక్కడ గెలవాలన్న లక్ష్యంతో ఉన్న కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసి 40 వేలకు పైగా ఓట్లు సాధించి రెండో స్థానంలో నిలిచిన శ్రీ గణేశ్(Sri Ganesh) ను పార్టీలో చేర్చుకుంది.
అయితే.. తనకు కంటోన్మెంట్ టికెట్ ఇవ్వాలని పార్టీ ఆలోచిస్తోందని కాంగ్రెస్ కీలక నేత అద్దంకి దయాకర్(Addanki Dayakar) అనేక ఇంటర్వ్యూల్లో వెల్లడించారు. దీంతో ఆయనకు టికెట్ వచ్చే అవకాశం ఉందన్న చర్చ సాగింది. అయితే.. కాంగ్రెస్ హైకమాండ్ మాత్రం శ్రీ గణేశ్ వైపే మొగ్గు చూపింది. దీంతో అద్దంకి దయాకర్ రియాక్షన్ ఎలా ఉంటుందనే అంశంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గద్దర్ కూతురు వెన్నల కంటోన్మెంట్ నుంచి పోటీ చేశారు.