El Nino Conditions: మార్చిలోనే భానుడు భగ్గు మంటున్నాడు.. ఎల్‌నినో పరిస్థితే కారణమా?

ప్రస్తుతం సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. దేశవ్యాప్తంగా ఈ పరిస్థితికి కారణం ఎల్‌నినో ప్రభావం అని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఎల్‌నినో ప్రభావం అంటే ఏమిటి? దీనివలన మన వాతావరణంలో వచ్చే మార్పులు ఏమిటి? వివరంగా ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు 

New Update
El Nino Conditions: మార్చిలోనే భానుడు భగ్గు మంటున్నాడు.. ఎల్‌నినో పరిస్థితే కారణమా?

El Nino Conditions: వాతావరణం వేగంగా మారిపోయింది చల్లని గాలులు వేడిగా మారిపోయాయి. ఎప్పుడూ లేనివిధంగా హైదరాబాద్ లో మార్చి నెల మొదటి వారంలోనే 39 డిగ్రీల సెల్సియస్ కు ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి. ఇంకా శివరాత్రి పోలేదు.. ఇప్పుడే ఇలా వేడి దంచేస్తుంటే రాబోయే ఎండాకాలం పరిస్థితి ఎలా ఉంటుందో అని అందరం బెంబేలెత్తాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్ లో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నట్టు వాతావరణ నిపుణులు చెబుతున్నారు. దీనికి కారణం ఎల్‌నినో ప్రభావం(El Nino Conditions) అని వారు అంటున్నారు. మార్చి, ఏప్రిల్, మే నెలల్లో దేశంలోని చాలా ప్రాంతాల్లో ఎల్‌నినో పరిస్థితులు సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. గత 100 సంవత్సరాలలో, భారతదేశం 18 కరువులను చూసింది. వాటిలో 13 ఎల్‌నినో ప్రభావంతోనే ఏర్పాడ్డాయి అని రికార్డులు చెబుతున్నాయి. అసలు ఎల్‌నినో ప్రభావం అంటే ఏమిటి? దీనివలన ఇప్పుడు మనకు వచ్చే ఇబ్బంది ఏమిటి? అది మనపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? ఇలాంటి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. 

ఎల్‌నినో అంటే..
భూమధ్యరేఖకు ఉత్తరాన, దక్షిణాన 30 డిగ్రీల మధ్య ఎల్ నినో భూభ్రమణం వల్ల ఇక్కడ గాలి భూమధ్యరేఖ వైపు మొగ్గుతుంది. ఈ గాలి ఉత్తరాన నైరుతి వైపు.. దక్షిణాన వాయువ్యం వైపు వెళ్తుంది. దీనికి అధిక పీడనం తోడై భూమధ్యరేఖకు రెండు వైపులా వెళ్తుంది. ఈ గాలులనే వాణిజ్య గాలులు లేదా ట్రేడ్‌ విండ్స్‌ అంటారు. ఈ వాణిజ్య గాలుల వల్ల ఉపరితలం చల్లబడి.. వేడెక్కుతుంది . వాణిజ్య గాలులు భూమధ్యరేఖ వద్ద తూర్పు నుంచి పడమరకు వీస్తాయి. ఈ గాలులు దక్షిణ అమెరికా నుంచి వేడి నీటిని ఆసియాకు లాక్కొస్తాయి. ఈ నీటిని భర్తీ చేయటానికి లోతుల్లోంచి చల్లటి నీరు పైకి వస్తుంది. ఈ వాణిజ్య గాలులు బలహీనపడ్డప్పుడు పరిస్థితి తారుమారవుతుంది. గాలుల వేగం తగ్గటం వల్ల ఉపరితల వేడి జలాలక్కడే ఉంటాయి. అప్పుడు వేడి నీరు భూమధ్యరేఖ వద్దే (El Nino Conditions)పోగుపడుతుంటుంది. దీంతో పసిఫిక్ మహా సముద్ర ఉపరితలం వేడెక్కుతుంది. గాలి కూడా వేడెక్కుతుంది.. దీనివలన చల్లటి నీరు పైకి రావటం తగ్గుతుంది. చల్లగా ఉండాల్సిన మహాసముద్ర జలాలు వేడెక్కడమే ఎల్‌నినో. సింపుల్ గా చెప్పాలంటే.. పసిఫిక్ మహాసముద్రం ఉపరితలం సాధారణం కంటే వేడిగా మారితే దానిని ఎల్‌నినో అంటారు.  ఎల్‌నినో పరిస్థితులు ప్రపంచ వ్యాప్తంగా వాతావరణాన్ని ప్రభావితం చేస్తాయి. ఎల్‌నినో (El Nino Conditions)వలన ప్రపంచంలో చాలా ప్రాంతాలు ఉష్ణోగ్రతలు పెరిగిపోయి పొడిగా మారిపోతాయి. దీనివలన ఆ ప్రాంతాల్లో కరువులు సంభవిస్తాయి. ఎల్‌నినో ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా సాధారణ వర్షపాత పరిస్థితులు మారిపోతాయి. ఎల్‌నినో సాధారణ వర్షపాతానికి అంతరాయం కలిగిస్తుంది. 

ఎల్‌నినో ఎప్పుడు వస్తుంది?
సాధారణంగా ఎల్‌నినో (El Nino Conditions)అనేది ఉత్తర అర్ధగోళంలో శరదృతువు నుండి వేసవి కాలం వరకు సంభవిస్తుంది, సాధారణంగా ప్రతి 2-7 సంవత్సరాలకు ఒకసారి ఈ ఎల్‌నినో పరిస్థితులు వస్తాయి. ఈ పరిస్థితులు దాదాపు 9 నుండి 12 నెలల వరకు ఉంటుంది. కానీ, ఒక్కోసారి ఈ పరిస్థితులు వరుసగా రెండు సంవత్సరాల వరకు కొనసాగుతాయి. ఇప్పుడు 2023-24 లో వస్తున్న ఎల్‌నినో పరిస్థితులు ఇప్పటివరకూ వచ్చిన ఐదు బలమైన వాటిలో ఒకటిగా నిలుస్తున్నాయి. కొంచెం బలహీనంగా కనిపిస్తున్నా.. రాబోయే నెలల్లో ప్రపంచ వాతావరణాన్ని ఇప్పటి ఎల్‌నినో(El Nino Conditions)ప్రభావితం చేస్తుంది.

భారతదేశంపై ఎల్ నినో ప్రభావం ఎలా ఉంటుంది?
ఎల్‌నినోప్రపంచ వాతావరణ నమూనాలను భంగపరుస్తుంది.  ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు .. వర్షపాతాన్ని ప్రభావితం చేస్తుంది అని చెప్పుకున్నాం కదా.. ఇది(El Nino Conditions) భారత్ పై ఎలాంటి ప్రభావం చూపిస్తుందని అంచనా వేస్తున్నారో  తెలుసుకుందాం. 

  •  ఈ ఎల్‌నినో భారత ఉపఖండంలో అత్యంత వేడి పరిస్థితులు తీసుకువవస్తుంది. 
  •  భారతదేశంలో రుతుపవన వర్షాలను తగ్గిస్తుంది. ఇది నీటి కొరతకు దారితీస్తుంది.
  • సగటు కంటే తక్కువ వర్షాలు పడే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో కరువు పరిస్థితులు వచ్చే అవకాశం కూడా ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. 
  • తక్కువ వర్షపాతం కారణంగా సగటు కంటే తక్కువ పంట దిగుబడి ఉంటుంది. 

Also Read: వెండితెరపై మలయాళం సినిమాల మేజిక్.. చరిత్ర తిరగరాస్తున్న ఇండస్ట్రీ.. 

లా నినా…
ఎల్‌నినో (El Nino Conditions)గురించి తెలుసుకున్నాం కదా.. ఇప్పుడు దీనికి వ్యతిరేకంగా అంటే రివర్స్ లో ఉండే కండిషన్ గురించి కూడా రెండు ముక్కలు తెలుసుకుందాం. పసిఫిక్ మహాసముద్రం సాధారణం కంటే చల్లగా ఉండటాన్ని లా నినా అంటారు. లా నినా సంఘటనల సమయంలో, భారతదేశం సాధారణంగా వర్షాకాలంలో సగటు కంటే ఎక్కువ వర్షపాతాన్ని అనుభవిస్తుంది. లా నినా వేసవిలో భారతదేశం అంతటా సగటు కంటే చల్లటి పరిస్థితులకు దారితీస్తుంది.

ప్రస్తుతం మనం ఎల్‌నినో (El Nino Conditions)లో చిక్కుకున్నాం. దీనివలన తెలంగాణలో ఇప్పుడే ఎండలు మండుతున్నాయి. మార్చి మొదట్లోనే ఎండలు దంచి కొడుతున్నాయి. అందుకే ఇప్పటికే రోజువారీ కనిష్ట, గరిష్ట ఉష్ణోగ్రతలు 4 డిగ్రీల పెరుదల చూపిస్తున్నాయి. ఇక ఏపీలో పశ్చిమ, దక్షిణ రాయలసీమ ప్రాంతాల్లోనూ, పశ్చిమ తెలంగాణలో ఎండలు మంటెక్కిస్తున్నాయి. నిజానికి ఎల్‌నినో గతేడాది జూలై నుంచి కొనసాగుతోంది. అందుకే 2023 ఆగస్టులో గత వందేళ్లలో ఎప్పుడూ చూడని పరిస్థితి కనిపించింది. ఆ నెలలో ఎప్పుడూ ఉండే పరిస్థితికి విరుద్ధంగా ఒక్క వర్షమూ కురవలేదు. 

Advertisment
తాజా కథనాలు