Telangana Elections: తెలంగాణలో మరో 50 రోజుల్లో ఎన్నికలు జరుగనున్నాయి. దాంతో ప్రధాన పార్టీలు ఎలాగైనా ఈ ఎన్నికల్లో గెలుపొందాలని భావిస్తున్నాయి. ఇందుకు అవసరమైన అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి. సాధారణంగా ఎన్నికలంటేనే.. డబ్బుతో పని ఉంటుంది. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు నాయకులు, అభ్యర్థులు పెద్ద ఎత్తున డబ్బు ఖర్చు చేస్తుంటారు. భారీ స్థాయిలో డబ్బు పంపిణీ చేస్తారు. నగదు, ఆభరణాలు, చీరలు, వస్తువులు.. ఇలా ఏది పడితే అది పంపకాలు చేపడతారు. అయితే, ఈసారి అలాంటి పప్పులుడకవ్ అంటోంది ఎన్నికల సంఘం. ఈ మేరకు ఎక్కడికక్కడ పకడ్బందీ చర్యలు తీసుకుంటోంది. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన దరిమిలా.. ఎన్నికల కోడ్ కూడా రాష్ట్రంలో అమల్లోకి వచ్చింది. ఈ నెల 9వ తేదీ నుంచి మోడల్ కోడ్ అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం.. రూ. 50 వేల కంటే ఎక్కువ డబ్బు, ఇతర సామాగ్రిని తరలిస్తున్నట్లయితే లెక్కలు చూపాల్సిందే. లేదంటే.. ఆ డబ్బు, సామాగ్రి అన్నీ సీజ్ చేసేస్తారు అధికారులు.
అయితే, ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థులకే కీలక సూచనలు చేసింది ఎన్నికల సంఘం. ఒక్కొక్క అభ్యర్థి గరిష్టంగా రూ. 40 లక్షలు మాత్రమే ఖర్చు చేయాలని స్పష్టం చేసింది. అదనంగా ఖర్చు చేస్తే ప్రజాప్రాతినిధ్య చట్టంలోని.. సెక్షన్ 123(6) ప్రకారం అవినీతికి పాల్పడినట్లు కేసు నమోదు చేయడం జరుగుతుందని హెచ్చరించింది. కాగా, 2022 జూన్‌లోనే ఎన్నికల ఖర్చు పరిమితి పెంచింది ఈసీ. సెక్షన్ 77 ప్రకారం అభ్యర్థి ఖర్చుల అకౌంట్.. నిర్ణీత గడువులోగా ఎన్నికల ఖర్చుల లెక్కలు చూపించకపోతే శిక్ష విధించడం జరుగుతుంది. ఒకవేళ అదే జరిగితే.. సెక్షన్ 10ఏ కింద అనర్హత వేటు వేస్తారు. అనర్హత గరిష్ఠంగా మూడేళ్ల వరకు ఉండే అవకాశం ఉంది. గెలిచిన అభ్యర్థులైతే సభ్యత్వం రద్దు అవుతుంది. ఓడిపోయిన వారైతే శిక్షా కాలంలో పోటీకి నో ఛాన్స్. బస్ రోజు అద్దె రూ.6 వేలు, మిని బస్ రూ.3,500, ఇన్నోవా వంటి కార్లకు రూ.4 వేలు, ట్రాక్టర్ డీజిల్, డ్రైవర్ ఖర్చులు కలిపి రోజుకు రూ. 1,000, పట్ణణ ప్రాంతాల్లో ఫంక్షన్ హాల్ ఖర్చు రూ.15 వేలు, గ్రామాల్లో రూ.12 వేలు, సభలు, సమావేశాలు టెలికాస్ట్ చేసేందుకు.. తెరలకు రోజు అద్దె రూ.15 వేలు, డ్రోన్ కెమెరాలు ఉపయోగిస్తే రూ.15 వేలు, భోజన ఖర్చు ఒక్కొక్కరికి రూ.80, గ్రామాల్లో టిఫిన్ ఖర్చు రూ.30, పట్టణాల్లో రూ. 35, గుర్తింపు పొందిన జాతీయ, రాష్ట్ర పార్టీలు 20 మంది, గుర్తింపు లేని పార్టీలు 10 మంది క్యాంపెయినర్లు, ఎన్నికల ఖర్చుల్లో స్టార్ క్యాంపెయినర్ల ప్రయాణ ఖర్చులు మినహాయింపు ఉంటుంది.
Also Read:
స్టేడియంలోనే తన్నుకున్న క్రికెట్ ఫ్యాన్స్.. ఇండియా,అఫ్ఘాన్ మ్యాచ్ సమయంలో ఏం జరిగిందంటే?
శ్రీనివాస్ గౌడ్ ఏ కార్డు ప్లే చేసినా.. ఓడిస్తా: యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ