Harish Kumar Gupta As A New DGP For AP: ఏపీ కొత్త డీజీపీగా హరీష్ కుమార్ గుప్తాను నియమించింది ఈసీ. సాయంత్రం 5 గంటల లోపు బాధ్యతలు చేపట్టాలని ఆదేశించింది. ఏపీ డీజీపీ రవీంద్రనాథ్ రెడ్డిపై ఈసీ నిన్న బదిలీ వేటు వేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ రోజు కొత్త డీజీపీని నియమించింది ఈసీ. ప్రస్తుతం హోం శాఖ కార్యదర్శిగా గుప్తా ఉన్నారు. కొత్త డీజీపీ నియామకం కోసం సీనియార్టీ జాబితాను పంపించమని ఈసీ ఆదేశించగా.. సీఎస్.. ద్వారకా తిరుమల రావు, మాదిరెడ్డి ప్రతాప్, హరీశ్ కుమార్ గుప్తా పేర్లను పంపించారు. ఇందులో హరీశ్ గుప్తా పేరును ఈసీ ఎంపిక చేసింది.
ఏపీలో అధికారులపై వరుసగా బదిలీ వేటు పడడం కలకలం రేపుతోంది. ఎన్నికలు ముగిసే వరకు మరికొంత మంది అధికారులపై కూడా వేటు పడే అవకాశం ఉందని తెలుస్తోంది. ముఖ్యంగా ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డిని ఈసీ బాధ్యతల నుంచి తప్పించే అవకాశం ఉందన్న ప్రచారం జోరుగా సాగుతోంది.
ప్రతిపక్షాలు ఇప్పటికే ఆయనపై అనేక ఫిర్యాదులు చేసిన నేపథ్యంలో ఈసీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంటుందన్న చర్చ జరుగుతోంది. ఇదిలా ఉంటే.. నిన్న డీజీపీపై వేటు వేసిన ఈసీ.. ఈ రోజు అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిని బదిలీ చేసింది. ఎన్నికలు ముగిసే వరకు ఆయనకు ఎలాంటి బాధ్యతలు ఇవ్వొద్దని ఆదేశాలు జారీ చేసింది.